Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : సెజ్‌ల నుంచి నేర్చుకున్నదేమిటి? - 6

 ఎమ్బీయస్‌ : సెజ్‌ల నుంచి నేర్చుకున్నదేమిటి? - 6

సింగపూరు ప్రభుత్వం 1981లో తన ఫారిన్‌ రిజర్వ్‌స్‌ను మేనేజ్‌ చేయడానికి, విలువ పెంచడానికి గవర్నమెంట్‌ ఆఫ్‌ సింగపూర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పోరేషన్‌ అని పెట్టింది. తర్వాత దాని పేరు జిఐసి ప్రై.లి. అని మార్చింది. దానికి మూడు సబ్సిడియరీలు వున్నాయి. జిఐసి ఎసెట్‌ మేనేజ్‌మెంట్‌, జిఐసి రియల్‌ ఎస్టేట్‌, జిఐసి స్పెషల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అని. 2006లో అమెరికాలో మ్యాన్‌హట్టన్‌లో పీటర్‌ కూపర్‌ విలేజ్‌ ప్రాజెక్టులో భారీగా యిన్వెస్ట్‌ చేసి యిళ్లు కట్టించింది. అక్కడ అద్దెకున్నవాళ్ల అసోసియేషన్‌ కోర్టుకి వెళ్లడంతో వ్యవహారం చెడింది. అదే సమయంలో అమెరికాలో సబ్‌ప్రైమ్‌ మార్ట్‌గేజ్‌ క్రైసిస్‌ రావడంతో 600 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు గొహోవిందా అయ్యాయి. (ఇప్పుడు తుళ్లూరు రైతులు కూడా సింగపూరు వాళ్లను లిటిగేషన్‌లో లాగుతారేమో వేచి చూడాలి) 2010లో జరిగిన యీ నష్టంపై, దీనితో బాటు అది యిన్వెస్ట్‌ చేసిన చోట్ల యిన్వెస్ట్‌ చేసి మూటకట్టుకున్న నష్టాలపై సింగపూరు మీడియా ప్రభుత్వాన్ని ఉతికి ఆరేసింది. ''అదర్‌ పీపుల్స్‌ మనీ''అనే పుస్తకం కూడా వచ్చిందట. ఇక అప్పణ్నుంచి అది తన బాలన్స్‌షీటు బయట పెట్టటం లేదట. సింగపూరు చైనాలో చేపట్టిన ప్రాజెక్టు కూడా విఫలమైందని చదివాను. 

ఇప్పుడు అది 2014లో ఇండియా వాటికా గ్రూపుతో కలిసి గుడ్‌గావ్‌లో రెండు హౌసింగ్‌ ప్రాజెక్టులు తలపెట్టి, 2018-19 నాటికి అవి పూర్తి చేయడానికి ఒప్పందాలు చేసుకుంది. వాటి గతి ఏమిటో తెలియకుండానే ఆంధ్ర రాజధానిని వాళ్ల చేతిలో పెడుతున్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది ఇంటర్నేషనల్‌ ఎంటర్‌ప్రైజ్‌ (ఐఇ) సింగపూరు. ఇది సింగపూరు ప్రభుత్వపు వ్యాపార, పరిశ్రమ శాఖ సింగపూరు కంపెనీలకు విదేశీ వ్యాపారాలు సమకూర్చడానికి ఏర్పరచిన స్టాచ్యుటరీ బోర్డు. 20 దేశాల్లో 39 ఆఫీసులు తెరిచి, సింగపూరు కంపెనీలు ఎగుమతులు చేయడానికి, తమ వ్యాపారం పెంచుకోవడానికి సహాయపడుతుంది. విదేశీ కంపెనీలు సింగపూరులో తమ కార్యాలయాలు తెరవడానికి దోహదం చేస్తుంది. ఇది ప్రోత్సహించే కంపెనీలు అనుకున్న విధంగా పని చేయకపోతే, నియమాలు ఉల్లంఘిస్తే యీ బోర్డు బాధ్యత వహిస్తుందో లేదో నాకు తెలియరాలేదు.  

ఇప్పుడు ఆంధ్రరాజధాని ప్రాజెక్టు గురించి స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ పేపర్లో వార్తలు, వ్యాసాలు ఎలా వచ్చాయో చూదాం - 'ఇంటర్నేషనల్‌ ఎంటర్‌ప్రైజ్‌ సింగపూరు సిఇఓ, టియో ఎంగ్‌ చియాంగ్‌, ఎపి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పోరేషన్‌ ప్రతినిథి డా|| సాంబశివరావు కొత్త రాజధానికి మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేయడానికై డిసెంబరు 8 న ఎమ్‌ఓయు సంతకం చేశారు. ఈ కొత్త రాజధాని విస్తీర్ణంలో సింగపూరుకు పది రెట్లు వుంటుంది. దాన్ని అభివృద్ధి చేయడం మూడు అంతకంటె ఎక్కువ థల్లో సాగుతుంది. 7335 చ.కి.మీ. ఏరియాకు మాస్టర్‌ ప్లాన్‌ తయారుచేస్తారు. 125 చ.కి.మీ.ల కోర్‌ ఏరియా వుంటుంది. 8 చ.కి.మీ. ల డెవలప్‌మెంట్‌ ఏరియా వుంటుంది. వీటిలో సింగపూరు కంపెనీలు యుటిలిటీస్‌ (వసతుల కల్పన) చేపడతాయి. అర్బన్‌ డెవలప్‌మెంట్‌లో, గవర్నెన్స్‌ (పరిపాలన)లో ఆంధ్ర అధికారులకు సింగపూరు తర్ఫీదు యిస్తుంది. ఇది సింగపూరువాళ్లు ఇండియాలో చేపడుతున్న అతి పెద్ద ప్రాజెక్టు. చంద్రబాబుగారు ఆ రాజధానిలో ఆకాశహర్మ్యాలు (స్కైస్క్రాపర్స్‌), ప్రభుత్వాఫీసుల కోసం 44 అంతస్తుల బిల్డింగ్‌ కడదామని ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. కృష్ణానదిపై రెండు అల్ట్రా మోడర్న్‌ బ్రిజెస్‌ కడతారట. జపాన్‌ కంపెనీలు కూడా నిర్మాణంలో పాలు పంచుకుంటాయని బాబు ప్రకటించారు. 

''9 ఏళ్ల క్రితం ఢిల్లీ ఎయిర్‌పోర్టు నిర్మాణం విషయంలో సింగపూరుకు చెందిన చాంగీ కంపెనీ చెడ్డపేరు తెచ్చుకుంది. ఇప్పుడు దీనితో యీ కాంట్రాక్టుతో ఆ పేరు తొలగిపోతుందని ఆశిద్దాం. భారత్‌లో యిప్పటిదాకా ప్లానింగ్‌లో మేటి అనిపించుకున్న చండీగఢ్‌ ప్లానింగ్‌కు ఇండియా ఫ్రెంచ్‌ ఆర్కిటెక్టుని పిలిపించింది. ఇప్పుడు సింగపూరును పిలుస్తున్నారు. ప్రస్తుత సింగపూరు ప్రభుత్వాధినేతలు, చంద్రబాబు ఒకరికొకరు సుపరిచితులు. బాబు ఉత్సాహం ఎంత వురకలు వేస్తోందంటే  కాస్త ప్రాక్టికల్‌గా వుండండి అని సింగపూరు నేతలు ఆయనను హెచ్చరించవలసి వచ్చింది. (For one thing, the Republic and Andhra's dynamic Chief Minister N Chandrababu Naidu are well-known to each other. Indeed, such is the scale of his ambition that Singaporean leaders have recently needed to caution Mr Naidu, who was here last month, to keep his expectations realistic.)  మోదీ స్మార్ట్‌ సిటీలు కడతానంటున్నారు. అందువలన సింగపూరు డిజైన్‌ కంపెనీలకు, అనేక సర్వీసు ప్రొవైడర్లకు ఇండియాలో పంట పండుతుంది. రెండు దశాబ్దాల  క్రితం అప్పటి ప్రధాని గో చోక్‌ టాంగ్‌ 'మైల్డ్‌ ఇండియా ఫీవర్‌' గురించి మాట్లాడేవారు. కొన్నాళ్లకు ఇండియాలోనే 'సింగపూర్‌ ఫీవర్‌' వస్తుందని ఆయన వూహించి వుండరు.' 

ఇది చదివితే యిదేదో విన్‌-విన్‌ సిట్యుయేషన్‌లా కనబడటం లేదు. సింగపూరుకు లాభం, మనకు వట్టంలా తోస్తోంది. సింగపూరు వాళ్లు ఎక్కణ్నుంచో దిగి వచ్చిన దేవతల్లా బిల్డప్‌ యిస్తున్నారు. పర్యటనకు వచ్చిన వాళ్ల కన్సల్టెంట్లు కోరిన సమాచారంలో 95% మనవాళ్లు వెంటనే యిచ్చేస్తే వాళ్లు శభాషంటూ మెచ్చుకున్నారట. దీనిలో మురవడానికి ఏమైనా వుందా? హూ హేజ్‌ టు సెర్వ్‌ హూమ్‌? ఎవరి చేయి పైన వుండాలి?  సొమ్ము మనదైనపుడు సోకూ మనదవ్వాలి. ఋణమాఫీ గురించి అడిగితే ఆర్నెల్లయినా సమాచారం రాదు, సెర్వర్‌ మాటిమాటికీ క్రాష్‌ అయిపోతోందని, అందుకే నిర్ణయాలు ఆలస్యమై పోతున్నాయని కుటుంబరావుగారు చెప్తారు. మరి సింగపూరు వారడగినదానికి నిమిషాల్లో యిచ్చేయ గలిగేరే! కొందరి విషయాల్లో ప్రభుత్వం జోరుగా పనిచేస్తున్నట్లుంది. సింగపూరు వాళ్ల కండిషన్లు ఏమిటో అర్థం కావటం లేదు. ఊరికే చేస్తారంటే నమ్మలేం. రాజధాని ప్రాంతం డెవలప్‌ చేసి అక్కడ నుండి వచ్చే ఆదాయంతో పే చేస్తారని ఎమ్‌ఓయులో రాశారని వార్తలు వచ్చాయి. అక్కడి ఆదాయం సింగపూరు వాళ్లకు ఎలా వెళుతుంది? ఈస్టిండియా కంపెనీకి యిచ్చినట్లు కొన్ని ప్రాంతాలపై ఆదాయం వారికి కట్టబెడతారా? ఆదాయం సరిపోకనే కదా, పన్నులు వేయడం, సర్‌చార్జి అనడం! తెలంగాణలో వాటర్‌ గ్రిడ్‌ వస్తోందంటూ చాలా ఆర్భాటం చేస్తున్నారు. ఆ తర్వాత వెయ్యబోయే యూజర్‌ చార్జీలు చూస్తే మూడు చెఱువుల నీళ్లు తాగాల్సి వస్తుందేమో! ఇప్పుడు ఆంధ్ర రాజధాని ప్రాంతంలో కట్టబోయే భవంతులపై, వెయ్యబోయే రోడ్లపై టోల్‌ చార్జీలు, మరో చార్జీలు వడ్డించి వాటిల్లోంచి సింగపూరుకు, జపాన్‌కు యిస్తారేమో! (సశేషం)

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

Click Here For Part-4

Click Here For Part-5

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?