Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : సెజ్‌ల నుంచి నేర్చుకున్నదేమిటి? - 7

ఎమ్బీయస్‌ : సెజ్‌ల నుంచి నేర్చుకున్నదేమిటి? - 7

ఇంతకీ అక్కడ అంత ఆదాయం వస్తుందా? మూడుపంటలు పండే భూములను నాశనం చేసుకున్నాక యిక అక్కడ వ్యవసాయ ఆదాయం ఎలా వస్తుంది? ప్రభుత్వం డెవలప్‌ చేయబోయే 7400 చ.కి.మీ.ల ప్రాంతం మాత్రమే కాదు, దానికి చుట్టూ వున్న ప్రాంతాలన్నిటిలో సాగు కట్టిపెట్టి ప్లాట్లు చేసేసి జండాలు పాతేసి 'సెక్రటేరియట్‌కు 5 ని.ల డ్రైవ్‌, రాజభవన్‌కు 7 ని.ల డ్రైవ్‌, ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు ఆకాశమార్గాన 3 ని.లు' అంటూ యాడ్స్‌ యిచ్చేస్తూ వుంటారు. ఆ ప్రాంతంలో యీ యాక్టివిటీ తప్ప వేరే ఏ యాక్టివిటీ జరిగే అవకాశం వుండదు. ఆ విధంగా రియల్‌ ఎస్టేటు ధరలు పెరిగితే అదే ఆదాయం అనుకోవాలి కాబోలు. షేర్‌ మార్కెట్‌లోలా ఒక్క కొత్త వస్తువు ఉత్పత్తి కాకపోయినా అదే షేరుకి విలువ పెరుగుతూ పోయినట్లు స్థలం ధర పెరిగితే అదే ఆదాయం అనుకోవాలి. ఫ్యాక్టరీలు పెడితే వస్తూత్పత్తి జరిగి ఆదాయం పెరుగుతుంది కానీ ఆ రేటులో భూమి కొని అక్కడ ఎవడూ ఫ్యాక్టరీ పెట్టడు. ఇక కన్స్యూమర్‌ గూడ్స్‌ అమ్మకాల ద్వారా షాపింగ్‌ మాల్స్‌ ద్వారా ఆదాయం రావాలి. ఆ షాపింగు ఏరియాలు సింగపూరు కాంట్రాక్టర్లకు యిచ్చి మీ పెట్టుబడులు వసూలు చేసుకో అంటారేమో! అన్నీ మన వూహలే. ఏదీ స్పష్టంగా చెప్పటం లేదు.

టిడిపి వాళ్ల మూడ్‌ చూస్తే యిలాటి ప్రశ్నలు లేవనెత్తే వీలు లేకుండా వుంది. ఏమడిగినా 'ఏం మాకు రాజధాని అక్కరలేదా? మేం గ్రాండ్‌ కాపిటల్‌ కట్టుకోవడం మీకిష్టం లేదా?' అని దబాయించేస్తున్నారు. ఇటు కెసియారూ అంతే. ఏవేవో వాగ్దానాలు, అవి ఆచరణయోగ్యం కాదు అని ఎవరైనా వ్యాఖ్యానించగానే 'బంగారు తెలంగాణ రావడం మీ కిష్టం లేదు' అని ఉరుముతున్నారు. తెలంగాణ ఉద్యమసమయంలో కొత్త రాష్ట్రం ఏర్పడితే స్వర్గం దిగివస్తుందన్నారు. స్వర్గమేమిటి సముద్రమే తెలంగాణకు వస్తుందన్నారు బిజెపి విద్యాసాగరరావుగారు. ఆయన వెళ్లి మహారాష్ట్ర గవర్నరు భవన్‌లో కూర్చున్నారు. ఇప్పుడు బిజెపికే చెందిన నితిన్‌ గడ్కరీ తెలంగాణకు డ్రై డాక్‌ అంటున్నారు. డ్రై ఎందుకు సముద్రం వస్తుందిగా అని అడిగితే, 'జోకులా?' అని మండిపడతారు. గతంలో వైయస్సారూ అంతే 'ఉచిత విద్యుత్‌ పథకం మంచిది కాదు, దాని వలన  ఆదాయం తగ్గి విద్యుత్‌రంగంలో పెట్టుబడులు పెట్టడం తగ్గిపోతుంది. భవిష్యత్తులో విద్యుత్‌ సంక్షోభం ఏర్పడుతుంది' అని నిపుణులు హెచ్చరిస్తే 'పేదలకు విద్యుత్‌ యివ్వడం మీకు నచ్చదా?' అని దబాయింపు. 'జలయజ్ఞంలో అవినీతి జరుగుతోంది' అంటే 'రైతుల పొలాలకు నీరు యివ్వడం మీకు యిష్టం లేదు' అని దబాయింపు. ఇప్పుడు బాబు కూడా అదే తీరు. 'ఋణమాఫీ ఆచరణయోగ్యం కాని హామీ' అంటే '..అంటే ఋణమాఫీ చేయకూడదంటారా? రైతులను ఆదుకోకూడదని మీ ఉద్దేశమా? ఆ మాట రైతులకు చెప్పి చూడండి..' అంటూ అడ్డగోలు వాదన. 

ప్రశ్నేమిటి? జవాబేమిటి? రాజధాని అక్కరలేదని ఎవరూ అనరు. బజెట్‌ వేసుకున్నట్లే రాజధాని విషయంలో కూడా ఒక బ్లూ ప్రింట్‌ యివ్వాలి. ఇంత అవసరం, యింత ఖర్చు పెడితే యింత ఆదాయం వస్తుంది. దానితో యిన్నేళ్లలో చేసిన అప్పులు తీర్చగలం... అని క్లియర్‌కట్‌గా చెప్పాలి. ఇప్పుడు యిష్టం వచ్చినట్లు ప్రామిస్‌లు చేసేయడం, ఆ తర్వాత ప్రతిపక్షం అడ్డుపడింది కాబట్టి చేయలేకపోయాం అనడం బాగుండదు. ఏది చెప్పినా ప్రాక్టికల్‌గా వుండాలి. రెండు జిల్లాలకు ఒక ఎయిర్‌పోర్టు అని చెప్పేశారు. ఉన్నవాటికే డిమాండ్‌ లేదు, ఎయిర్‌లైన్సు మూతపడుతున్నాయి అని సద్విమర్శ వస్తే దానికి బాబు సమాధానం ఏమిటి? 'కడప నాయకుల దగ్గర బోల్డు డబ్బుంది, ఎయిర్‌పోర్టుకి డిమాండ్‌ ఎందుకుండదు?' అని. కడప నాయకుల దగ్గరే కాదు, వెనకబడిన అనంతపురం, విజయనగరం జిల్లా నాయకుల దగ్గర కూడా డబ్బుంటుంది.  అయితే వాళ్లందరూ ఎక్కడ నివాసం వుంటున్నారు? ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నారు? అన్నదే ప్రశ్న. అందరూ యిన్నాళ్లూ హైదరాబాదులో, బెంగుళూరులో, మద్రాసులో పెట్టారు కాబట్టే ఆంధ్ర జిల్లాలన్నీ యిలా అఘోరించాయి. ఆ నాయకులు తమ జిల్లాల్లో వుండేది తక్కువ, కావాలంటే సొంత హెలికాప్టర్లలో తిరగగలరు. సామాన్యులు కూడా విమానాల్లో వెళ్లగలిగే స్థాయి సమకూరినప్పుడే విమానాశ్రయాలు కళకళలాడతాయి. లేకపోతే వెలవెలే. రాజమండ్రి, గన్నవరం విమానాశ్రయాలకు తిరిగే విమానాల సంఖ్య ఒక్కసారి చూస్తే, అవి తరచుగా రద్దు అవుతున్న విషయం గమనిస్తే విమానాశ్రయాల డిమాండ్‌ ఏ మేరకు ఎలా వుంటుందో అర్థమవుతుంది. అబ్బే టిడిపి అధికారంలోకి వచ్చింది కాబట్టి అందరి వద్దా డబ్బు ప్రవహించేస్తుంది, అందరూ విమానాలెక్కేస్తారు అంటే దణ్ణం పెట్టి వూరుకోవాలి. ఇటు మెట్రోలకు, అటు ఔటర్‌ రింగు రోడ్డులకు, హైవేలకు, స్కైవేలకు, విమానాలకు, యింటర్‌సిటీ రైళ్లకు .. అన్నిటికీ రద్దీ ఎలా వచ్చేస్తుందో నాకైతే అర్థం కాదు. సర్వత్రా అభివృద్ధి జరిగి, ఎక్కడివారికి అక్కడే ఉపాధి అవకాశాలు దొరికితే పెద్దగా తిరిగే అవసరమే వుండదు. ఉన్నచోట తిండి దొరక్కపోతేనే ప్రయాణాలు పెరుగుతాయి.

బాబుగారి బంగారు కలలు మనల్నే కాదు, సింగపూరు వాళ్లనీ అడలగొడుతున్నాయని సింగపూరు వ్యాసంలోని వాక్యాల ద్వారా తెలుస్తోంది. ఆ మాట రాస్తే ఆయన అభిమానులు 'కలలు కనడం తప్పా? తారలపై దృష్టి పెడితే కనీసం చంద్రుణ్ని చేరతాం' అంటున్నాం. ఇంకా నయం, ఇస్రో వాళ్లు యీ లాజిక్‌ వుపయోగించి మన రాకెట్‌లను డైరక్టుగా సూర్యుడిపైకే పంపటం లేదు. దగ్గర్లో వున్న చంద్రుడు, కుజుడు అంటూ మెట్టుమెట్టుగా వెళుతున్నారు. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగరగలదా? అనే సామెత కూడా గుర్తు పెట్టుకోవాలి. శాంపుల్‌గా ఉట్టి కొట్టి చూపిస్తే ఎంతవరకు ఎగరగలరో తెలుస్తుంది. మీ పథకాలకు డబ్బులెలా వస్తాయని బాబు నడిగితే ఎఱ్ఱచందనం అమ్మితే బోల్డు వస్తుందని చెప్పుకొచ్చారు. అటవీ శాఖాధికారిగా వున్న ఐఎఫ్‌ఎస్‌ అధికారిని మొన్న సస్పెండ్‌ చేసినపుడు తెలియవచ్చింది - ఆయన ఎఱ్ఱచందనం వేలానికి కేంద్ర అనుమతి తేవడంతో అమిత తాత్సారం చేశాడని, చాలా తక్కువ ధరకు అమ్మేశాడని, వచ్చిన నిధులను తెలంగాణకు బదిలీ చేసేస్తూంటే చివరకు సస్పెండ్‌ చేశారనీ! అంటే ఏమిటన్నమాట - ఆ చందనం అమ్మకాల వలన వస్తాయని అంచనా వేసిన నిధులు అనుకున్న స్థాయిలో రావటం లేదు. (సశేషం)

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

Click Here For Part-4

Click Here For Part-5

Click Here For Part-6

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?