జీవిత‌కాల ఆనందం, ఆనంద‌క‌ర జీవితం.. కీల‌కం అదొక్క‌టే!

జీవితంలో రిలేష‌న్ షిప్స్ స‌రిగా ఉండ‌ట‌మే..నిజ‌మైన ఆనందం అని ఈ అధ్య‌య‌నం చెబుతూ ఉంది.

ప్ర‌పంచం లెక్క‌లు మారిపోయాయి.. మొన్న‌టి వ‌ర‌కూ డ‌బ్బుతో ఆనందం ఉండ‌ద‌ని వాదించేవాళ్లు, అయితే డ‌బ్బుతో ఆనందం ఉండ‌దేమో కానీ.. ఆనందాన్ని ఇచ్చేవ‌న్నీ డ‌బ్బుతోనే ముడిప‌డి ఉంటాయ‌నే వాద‌న ఇప్పుడు ప్ర‌బ‌లంగా వినిపిస్తూ ఉంది. మ‌రి ఆనంద‌క‌ర‌మైన జీవితం పూర్తిగా డ‌బ్బుతోనే ముడిప‌డి ఉందేమో అని ఒక త‌రం భావిస్తున్న వేళ హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ఒక ఆస‌క్తిదాయ‌క‌మైన అధ్య‌య‌నాన్ని విడుద‌ల చేసింది.

దాదాపు ఏడు వంద‌ల మంది అభిప్రాయాల ఆధారంగా, వారి అనుభ‌వాల సారంగా ఈ అధ్య‌య‌నం జ‌రిగింది. ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ఆ ఏడువంద‌ల మంది వ‌య‌సూ 80 దాటింది! జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల‌ను చూసిన 80 యేళ్లు దాటిన ఏడువంద‌ల మంది వృద్ధుల జీవిత సారం ఆధారంగా జ‌రిగిన ఈ అధ్య‌య‌నం.. జీవితంలో ఆనందానికి మూలం ఏమిట‌నే దిశ‌గా సాగింది. వారంతా మూకుమ్మ‌డిగా చెప్పిన స‌మాధానం ఏమిటంటే.. రిలేష‌న్ షిప్!

జీవితంలో రిలేష‌న్ షిప్స్ స‌రిగా ఉండ‌ట‌మే..నిజ‌మైన ఆనందం అని ఈ అధ్య‌య‌నం చెబుతూ ఉంది. కుటుంబంతోనూ, సాటి మ‌నుషుల‌తోనూ స‌త్సంబంధాల‌ను క‌లిగి ఉండ‌ట‌మే జీవితంలో నిజ‌మైన ఆనందం అని ఏడువంద‌ల మంది జీవిత‌సారాన్ని కాచివాడ‌బోసిన వారి అభిప్రాయాల ఆధారంగా ఈ అధ్య‌య‌నం చెబుతూ ఉంది. జీవితంలో చ‌దువు, ఉద్యోగం, సక్సెస్, డ‌బ్బు.. ఇవ‌న్నీ ఎలా ఉన్నా.. ఆనందక‌ర‌మైన జీవితం అంటే మాత్రం బంధాలు, బాంధ‌వ్యాలు, కుటుంబం అని ఈ అధ్య‌య‌నం చెబుతూ ఉంది.

జీవితంలో ఆనందానికి నిస్సందేహంగా బంధాలే పునాదులు అని చెబుతూ ఉంది. స‌రైన బాంధ‌వ్యం లేక‌పోతే జీవితంలో ఒంట‌రిత‌నం, డిప్రెష‌న్ ఇవ‌న్నీ వేధిస్తాయని.. ఎన్ని ఉన్నా అలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనాల్సి వ‌స్తుంద‌ని ఈ అధ్య‌య‌న‌క‌ర్త‌లు చెబుతున్నారు.

మ‌రి మ‌నుషుల‌తో సంబంధాల విష‌యంలో పెద్ద‌పట్టింపులేని రోజులు ఇవి. కుటుంబాలు చిన్న‌వి అయిపోయాయి, త‌ల్లిదండ్రుల‌తో కూడా ఎవ్వ‌రూ క‌లిసి ఉండ‌టం లేదు. విద్య‌, ఉద్యోగాల పేరుతో.. రాష్ట్రాలు, దేశాలు దాటడం చాలా స‌హ‌జం. ఇక ప్రేమ‌, పెళ్లిళ్ల సంగ‌తి స‌రేస‌రి! ప్రేమ ఎంత‌మందిపైన అయినా తాత్కాలికంగా పుట్టుకొస్తూనే ఉంటుంది, పెళ్లి చేసుకునే వ‌ర‌కూ ఒక గొడ‌వ‌, చేసుకున్నాకా మ‌రెన్నో గొడ‌వ‌లు! స‌మాజం కోసం, కుటుంబం కోసమో కాపురాలు చేసే బాప‌తు ఒక‌టైతే.. అది కూడా చేయ‌లేక మూన్నాళ్ల‌కూ చెరో దిక్కూ చూసుకున్న వాళ్లూ బోలెడు మంది! వ‌స్తువుల‌పై ఉన్నంత ప్రేమ కూడా మ‌నుషుల మీద ఉందో లేదో అనే ప‌రిస్థితులే రాజ్య‌మేలుతూ ఉన్నాయి.

వ‌స్తువుల‌ను వాడుకోవాలి, మ‌నుషుల‌ను ప్రేమించాలి, అయితే వ‌స్తువుల‌ను ప్రేమిస్తూ, మ‌నుషుల‌ను అయిన‌కాడికి వాడుకుందామ‌నే త‌త్వ‌మే స‌ర్వ‌త్రా క‌నిపిస్తూ ఉంది. ఇళ్లు దాటితే మ‌నుషుల మ‌ధ్య‌న బంధం కేవ‌లం వాడ‌కం మాత్రమే! ఆఫీసు, స్నేహితులు, కొలీగ్స్.. ఇదంతా ర‌క‌కాల పేర్ల‌తో జ‌రిగే వాడ‌కం.

ఇక ఇంట్లో మ‌నుషుల‌తో అయినా స‌వ్యంగా ఉంటే అదే ప‌దివేలు. ఇలాంటి ప‌రిస్థితుల మ‌ధ్య‌న జీవితంలో ఆనందం అంటే.. డ‌బ్బు సంపాదించ‌డ‌మూ, ఉద్యోగంలో స‌క్సెస్ లు సాధించ‌డం, చుట్టూ ఉన్న వారిని వాడుకుంటూ పైకెద‌గ‌డం.. ఇదంతా కాదు.. మంచి రిలేష‌న్ షిప్స్ ను క‌లిగి ఉండ‌ట‌మే అని ఒక విదేశీ వ‌ర్సిటీ అధ్య‌య‌నం చెబుతూ ఉంది! అది కూడా ద‌శాబ్దాల జీవితానుభ‌వం క‌లిగిన వారి అభిప్రాయాలు, వారు చూసిన ప‌రిస్థితులు, వారు ఎదుర్కొన్న క‌ష్ట‌న‌ష్టాలు, జీవిత సుఖాల ఆధారంగా జ‌రిగిన అధ్య‌య‌నం ఇది. మ‌రి కాస్త వేగం త‌గ్గించి, చుట్టూ ఉన్న వారితో స‌త్సంబంధాల‌ను క‌లిగిన వారిదే నిజ‌మైన ఆనందం అనేది ఈ వ‌ర్సిటీ అధ్య‌య‌న సారం!

2 Replies to “జీవిత‌కాల ఆనందం, ఆనంద‌క‌ర జీవితం.. కీల‌కం అదొక్క‌టే!”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.