మన దగ్గర క్లాసు కథ.. అక్కడ బూతు కథ!

2005 సమయం… హిందీ బడా ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కథ అయిపోయిందని బాలీవుడ్ పత్రికలు అప్పటికే తేల్చేశాయి. అప్పుడప్పుడు మాత్రమే మీడియా ముందుకు వచ్చే శ్రీదేవిని కూడా మీ ఆయన ఆర్థిక పరిస్థితి ఎలా…

2005 సమయం… హిందీ బడా ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కథ అయిపోయిందని బాలీవుడ్ పత్రికలు అప్పటికే తేల్చేశాయి. అప్పుడప్పుడు మాత్రమే మీడియా ముందుకు వచ్చే శ్రీదేవిని కూడా మీ ఆయన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? అని అడగడం మొదలైంది. ‘‘నా కెరీర్ లో ఎంతోమంది నిర్మాతలను చూశాను… పెద్ద పెద్ద వాళ్లు కూడా ఒకటీ రెండు సినిమాలు పోయే సరికి తీవ్రమైన ఇబ్బందుల్లో పడిపోయారు. మా ఆయన వాళ్లకంటే స్ట్రాంగ్… అని చెప్పుకొంది శ్రీదేవి. ఇంతలోనే బోనీ కపూర్ ప్రొడక్షన్‌లో వచ్చింది ‘‘నో ఎంట్రీ’’ సినిమా. రివ్యూయర్లో బోనీ ధ్వజమెత్తారు. ఇదేం సినిమా బాబోయ్ అంటూ విస్తుపోయారు.  బోనీ కపూర్ తీసిన బృహత్తరమైన బూతు సినిమాగా పేరొచ్చింది. మళ్లీ శ్రీదేవి మీడియా ముందుకు వచ్చింది. ‘‘మా ఆయన తీసిన సినిమా బాగా ఆడుతోంది…’’ అని ఆమె ప్రకటించుకొంది. బహుశా ఆ సినిమా పేరును చెప్పడానికి కూడా ఆమె వెనుకాడి ఉండవచ్చు. ఎందుకంటే.. పేరు చెబితే ఆ సినిమా స్థాయిని కూడా గుర్తు చేసినట్టు అవుతుంది. అనిస్ బజ్మీ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమానే ‘‘నో ఎంట్రీ’’ ఇప్పుడంటే.. బాలీవుడ్‌లో అలాంటి సినిమాల పట్ల అభ్యంతరాలు వ్యక్తం కాకపోవచ్చు కానీ.. కచ్చితంగా పది సంవత్సరాల క్రితం ఆ సినిమాను చూసి బాలీవుడ్ బెంబేలెత్తింది. పక్కబూతు సినిమా అనే ముద్ర వేసింది.  అయితే ఆ సినిమాకు కలెక్షన్ల వర్షం కురిసింది. సినిమా సూపర్ హిట్ అయ్యింది!

బోనీ కపూర్ కు ఆర్థిక కష్టాలు తీరాయి.  ఈ సినిమాలో అనిల్ కపూర్, సల్మాన్, ఫర్దీన్ ఖాన్ , సెలీనా జైట్లీ, బిపాశా, ఇషా డియోల్‌లు ముఖ్యపాత్రల్లో నటించారు.

మరి హిందీలో పరమబూతు సినిమా పేరు పొందిన ఈ సినిమా అసలు వెర్షన్ దక్షిణాది సొంతం. మన దగ్గర ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘‘పెళ్లాం ఊరెళితే’’ సినిమానే హిందీలో ‘‘నో ఎంట్రీ’’ అయ్యింది! ఈ సినిమా తెలుగు వెర్షన్ ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. సకుటుంబంతో చూడదగ్గ కుటుంబకథా చిత్రం ‘‘పెళ్లాం ఊరెళితే’’  2003లో ఈ సినిమా తెలుగులో విడుదల అయ్యింది. ప్రేక్షకుల ఆదరణకు నోచుకొంది. శ్రీకాంత్, వేణు, సునీల్, సంగీత, రక్షిత, జ్యోతీలు ముఖ్యపాత్రల్లో చేసిన ఈ సినిమా టైమ్లీ కామెడీ బాగా పేలింది. సినిమా హిట్ అయ్యింది.

కథ పరంగా మార్పులు లేవు కానీ… చిత్రీకరణలో.. హిందీ వెర్షన్ పూర్తిగా మారిపోయింది. 2005లో హిందీలో విడుదల అయిన ఈ సినిమా ఆ ఏడాది టాప్ హిట్ గా నిలిచింది. అయితే బూతు సినిమాగా విమర్శలను ఎదుర్కొంది. నిర్మాతగా ఎంతో చరిత్ర ఉన్న బోనీకి ఇదేం పోయే కాలం? అంటూ కొందరు కడిగేశారు కూడా! ఆ విధంగా పెళ్లాం ఊరేళితే సినిమా సౌత్ చీరకట్టుకొని.. హిందీలో బికినీలో దర్శనం ఇచ్చింది.

ఈ రెండు సినిమాలకూ మూలం చార్లీచాప్లిన్(2002) అనే ఒక తమిళ సినిమా. ప్రభుదేవా, ప్రభులు ముఖ్యపాత్రల్లో చేసిన ఆ సినిమా అక్కడ సూపర్ హిట్. తమిళంలో హిట్ అయ్యే సరికి తెలుగులో దీన్ని రీమేక్ చేశారు. మళయాలం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా రీమేక్ అయ్యింది. విశేషం ఏమిటంటే.. ఈ సినిమా దక్షిణాదిలో అంతా చీరకట్టుతోనే ఉంటుంది. హిందీ వాళ్లే మంచి ఫ్యామిలీ కథను.. క్లబ్ స్థాయికి తీసుకొచ్చారు.

ఈ సినిమా హిందీలో హిట్ కావడాన్ని గమనించి మళ్లీ మరాఠీ వాళ్లు ఈ స్క్రిప్ట్ పై దృష్టి సారించారు. దీన్ని తమ భాషల్లో రీమేక్ చేశారు. మరాఠీలో మాత్రం హిందీ వెర్షన్ నే ఫాలో అయిపోయారు. బూతును దట్టంగా దట్టించి వదిలారు.

దశాబ్దం కిందట వచ్చిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు విశేషం ఏమిటంటే.. దీనికి సీక్వెల్ ఆలోచనలో ఉన్నాడు బోనీ కపూర్. 2005లో హిట్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిన ఈ సినిమాకు.. తన కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాకు తమ్ముడు అనిల్, సల్మాన్ తదితరులనే పెట్టి సీక్వెల్ రూపొందించి సొమ్ము చేసుకొనే యత్నంలో ఉన్నాడు బోనీ. సల్మాన్‌కు జైలు నుంచి కూడా విముక్తి కొంత విముక్తి లభిస్తుండటంతో ఈ సినిమా పట్టాలెక్కడం దాదాపు ఖాయమైంది! మరి ఈ సీక్వెల్ వెర్షన్ ఎంత హాట్‌గా ఉంటుందో!