ఏ నేతల చరిత చూచినా
ఏమున్నది గర్వకారణం!
ఐక్యపోరులో ఆద్యంతం
జనవంచన జగద్విదితం!!
ఉద్యమాల చరిత సమస్తం
కోవర్టుల కుట్రకు అంతం
హస్తిన గద్దల బధిరాంధత్వం
జనహననం నవ వేదాంతం
… నీ కన్నీళ్లు తుడిచిన చేతులు` ఊరడిల్లేలోగా` కిందికి వాలి నీ కడుపులో కత్తులు దించేయగలవు!
… నీ భుజం తట్టి భరోసా ఇచ్చిన చేతులు` ధైర్యం పుంజుకునే లోగా` వెన్నుపోటు రుచిచూపించగలవు!
… జన ఉద్యమంతో దురహంకార పాలకుల కావరాన్ని కాలరాయవచ్చుననుకునే ఓ నేస్తం.. నేతల రూపంలో ఉంటూ నీకు దణ్నాలు పెడుతూ ఉండేవారున్నారు చూశావా…
… నువు కన్నెర్ర జేసినప్పుడు నీ కాళ్ల దగ్గర పడిఉంటారు. కాసింత చనువిచ్చావా.. నీ జట్టు పట్టుకుని ఆడిస్తారు. కాసింత అలుసయ్యావా… నిన్ను సాంతం కబళిస్తారు. అందుకే వాళ్లని ‘రాజకీయ నాయకులు’ అని నిర్వచించారు మిత్రమా…
వంచించడం వారి ప్రాథమిక హక్కు.
వంచింపబడడం ప్రజ ప్రాథమిక బాధ్యత.
ఇదే నవీన రాజ్యాంగం ప్రవంచించిన ప్రజాస్వామ్యం!!
వంచకులీ ఉద్యమ జాతిని/ వంచితులను కావించారు
నరహంతలు రాష్ట్ర నేతలై/ ముంచుటలో ప్రసిద్ధి కెక్కిరి
సీఎం కిరణూ, చందరబాబూ/ కావూరీ, జగనూ, డిగ్గీ,
లక్ష్మీ ఈశ్వరి ఎవరైతేనేం/ ఒక్కొక్కరూ మహా వంచకులు..
రాజకీయం యొక్క విశ్వరూప సందర్శన భాగ్యం.. తెలుగుజాతికి దక్కింది. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకమైన కుట్ర కవచాలు, కూహక వ్యూహాలతో వర్తిల్లుతోంది. ప్రజలు వెర్రి గొర్రెల్లాగా కసాయినే నమ్ముతున్నారు. రోడ్ల మీదకు వచ్చి అరచి గీపెట్టి ఉద్యమాలు చేసిన ప్రజలలో, సామాన్యులలో, ఉద్యోగులలో జవసత్వాలు ఉడిగిపోయాయి. కాదుకాదు ఉడిగిపోయే వరకు, రాజకీయ నాయకగణం భిన్న వంచనా రీతులను వారిపై కడు సమర్థంగా ప్రయోగించింది.
మంచీ చెడూ వేర్వేరుగా ఉండవు. అవసరం వచ్చినప్పుడు మంచితనమూ, అవకాశం వచ్చినప్పుడు చెడ్డతనమూ జడలు విప్పి నర్తిస్తాయి. ఈ లోకరీతికి నేతలు అతీతులు కాదు. అందరూ మోసగాళ్లే… కాకపోతే ప్రతి ఒక్కరికీ ఒక స్కెచ్ ఉంది. దాని ప్రకారం వారు మోసం చేస్తున్నారు.
సమైక్య రాష్ట్రాన్ని కోరుకున్న వారి పట్ల నాయకులు వ్యవహరించిన తీరు చాలా చిత్రమైనది. ఉద్యమకారుల్ని నెత్తిన పెట్టుకున్న వారు, ఈసడిరచిన వారు, తూలనాడిన వారు, దాడి చేసిన వారు అన్ని పార్టీలకు చెందిన నాయకుల్లో అన్ని రకాల వారూ ఉన్నారు. కానీ ఒక్కరు… ఒక్కరంటే ఒక్కరైనా సరే.. సదరు ఉద్యమకారులు, వారి రూపేణా మెజారిటీ తెలుగుజాతి కోరిన ఒకే ఒక్క కోరికను తీర్చలేకపోయారు. అది` రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కాదు. ఉంచడం కోసం` రాజీనామా చేయడం.
‘సమైక్య ఆంధ్రప్రదేశ్’ అనేది గతించిన వైభవంగా మారుతున్న సంధి సమయంలో.. వంచకులు ఎవరో, వంచనలో వారి ‘గ్రేడ్’ ఏమిటో… ఎన్ని రకాలుగా తాము మోసపోయామో.. వంచితులు తెలుసుకోవడం చాలా అవసరం! అందుకే గ్రేట్‌ఆంధ్ర చేస్తోంది ఈ ప్రయత్నం…
కిరణ్ : అంత:భజన! బహిర్ సమైక్యం!!
‘రాష్ట్ర విభజన అంత సులభం కాదు. మనది విభజించడానికి యోగ్యమైన రాష్ట్రం కాదు. విభజనతో నీటి సమస్యలు, విద్యాఉపాధి సమస్యలు వస్తాయి. రాష్ట్రం సమైక్యంగా ఉండాల్సిందే’
‘నేను ముఖ్యమంత్రిగా ఉండగా.. రాష్ట్ర విభజన జరగదు’
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గత 75 రోజులుగా ప్రవచించినవి ఈరెండు విషయాలు మాత్రమే. ఈరెండు మాటలు చెబుతూ యావత్తు సీమాంధ్ర ప్రజల సమైక్య కలలకు తానే చుక్కానిగా ఆయన కీర్తి ప్రతిష్ఠలను సొంతం చేసుకున్నారు. ఉద్యమకారులంతా ఆయనను నమ్మారు. కిరణ్‌రెడ్డి తిమ్మిని బమ్మిని చేసి ఏదో ఒక రీతిగా అనుకున్నది సాధిస్తారు అని అందరూ విశ్వసించారు. అవును అది నిజం. సోనియమ్మ అనుకున్నది` ఆయన సాధించారు! సీమాంధ్ర ప్రాంతం నుంచి ఢిల్లీ పాలకు గుండెల్లో వణుకు పుట్టించిన సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అంచెలంచెలుగా ఆయన జోకొట్టి పడుకోబెట్టేశారు. సాంతం సమాధి చేశారు. ఆ విషయంలో ఆయన అమ్మ వద్ద వందకు వంద మార్కులు పొందే ఉంటారు. వచ్చే ఎన్నికల సమయానికి సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ సకల భ్రష్టత్వం చెందవచ్చు గాక.. అది వారికి ఖాతరు లేదు. కానీ ఈ మేలు ఒనగూర్చినందుకు పార్టీ ఇక్కడ జీరో స్కోరుతో దుకాణం ఖాళీ చేసినప్పటికీ.. కిరణ్ రెడ్డికి ఏ రాజ్యసభ సభ్యత్వమో తప్పక దక్కుతుంది. అమ్మ కరుణాకటాక్ష వీక్షణాలు ప్రసరించినంత కాలమూ ఆయన నేతగానే వెలుగొందుతారు.
కిరణ్ జనాన్ని వంచించిన విధం బెట్టిదనిన…
విభజన వలన దాపురించే కష్టాలను ప్రస్తావించి ఆయన తొలుత జనం దృష్టిలో సానుభూతి సంపాదించారు. తెలంగాణ ప్రాంత అమాత్య సహచరులు, అధినేత్రి పనుపున పురమాయింపు ఆదేశాను సారం.. కిరణ్‌ను నానా దూషణలతో దుమ్మెత్తిపోయకుండా ఉంటే గనుక.. ఈయన సదరు సానుభూతిని స్కోరు చేయడం అంత సులువుగా సాధ్యమయ్యేదే కాదు. కిరణ్ చెప్పినవి.. ప్రతి పసిపిల్లవాడికి కూడా తెలిసిన సాధారణ సమస్యలు. ఆయన కనిపెట్టి, పసిగట్టి చెప్పినవి ఏమీ లేదు. అందరికీ తెలిసిన సమస్యలనే తను కూడా ప్రస్తావించి.. అందుకు గాను తెలంగాణ వారితో తిట్టించుకున్న తర్వాత.. ‘అబ్బో కిరణ్ చాలా గొప్ప సమైక్యవాది’ అని జనం నమ్మారు. ఆ పునాది మీదనుంచి.. ఆయన సమైక్యవాదుల విశ్వాసహర్మ్యాన్ని నిర్మించుకున్నారు.
పైన చెప్పిన రెండో వాక్యం ఆయన వంచనకు ఆరంభం. నేను ముఖ్యమంత్రిగా ఉండగా.. విభజన జరగదు. ఇది వంచనకు పరాకాష్ట. అంటే విభజన కు ముందు తాను గద్దె దిగిపోతున్నాననే సంకేతం తప్ప.. ఆయన చాలా టెక్నికల్‌గా విభజనను ఆపుతానని, ఆపగలనని ఎక్కడా అనలేదు. అదే మాటమీద.. ఆయన సమైక్యవాదుల విశ్వాసం పొందుతూ వచ్చారు. దానికి తెలంగాణ తైనాతీలు.. ‘కిరణ్‌ను బర్తరఫ్ చేయాలి’ వంటి వంత పాటలతో జన వంచనకు తమ వంతు సహకరించారు. మూడురాష్ట్రాల విభజన విధానాలనే ఇక్కడా అనుసరించాలని హోంశాఖకు లేఖ రాస్తానని కిరణ్ ఇప్పుడు అంటున్నారు. ఈ 75 రోజుల పాటు ఆయన ఏం చేశారు? చాలా దారుణమైన మోసం అది. బిల్లు`తీర్మానం, ఒకసారి` రెండుసార్లు అంటూ నడిపిస్తున్న ప్రహసనం మరో మోసం!
ఆయన సమైక్య ఉద్యమాన్ని ఒక్క సారిగా కుప్పకూల్చేయగలిగారంటే ఇలా మాత్రమే సాధ్యమైంది. అసలు తరుణం ఆసన్నం అయిన తర్వాత.. అమ్మ ఆదేశం రాగానే.. ఆయన అంచెలంచెలుగా ఉద్యమనేతలతో భేటీలు జరిపి.. అందరినీ చక్కగా జోకొట్టి పడుకోబెట్టేశారు. ఉద్యమానికి సమాధి కట్టారు.
అనుమానాల నడుమ వంచించడం వేరు. వంచనలో ఆయనది మేలిమిరకం. నమ్మించి, తడిగుడ్డతో గొంతుకోయడం. నయవంచన అంటాం దీనిని.
కిరణ్ వంచన స్కోరు : 95/100.
చంద్రబాబు : ఘటనాఘటన సమర్థుడు
రెండు వరుస సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా పరాజయం పాలైనంత మాత్రాన… ఆ పిమ్మట జరిగిన అనేకానేక ఉప ఎన్నికల్లో కనీసం బోణీ కొట్టలేకపోయినంత మాత్రాన… తెలుగుదేశా ధీశుడిని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఆయన రాజనీతి పారంగతుడు. ఘటనా ఘటన సమర్థుడు. గ్రహబలం అనుకూలించనప్పుడు నిగ్రహం పాటిస్తూ, అదుపు తప్పిపోతే ఆగ్రహం ప్రదర్శిస్తూ ఆయన రోజులు గడిపేస్తున్నారు. ఎంతటి జ్ఞాతి అయినప్పటికీ పొరబాట్లు సహజం. ఈ వ్యవహారంలో ఆయన చేసిన ఒకేఒక్క పొరబాటు ఏమిటంటే.. విభజన అనే నిర్ణయం సీమాంధ్ర ప్రాంతంలో రేకెత్తించగల నిరసన, వ్యతిరేక జ్వాలల పరిమాణాన్ని పసిగట్టలేకపోవడం. ఆ అంచనా వైఫల్యం ఆయన పార్టీని అతలాకుతలం చేసేసింది. మరమ్మతు చేసుకోలేని పరిస్థితికి పార్టీని పతనం చేసేసింది. 63ఏళ్ల వయసులో సాగించిన పాదయాత్ర, పడిన కష్టం, ప్రయాస అన్నీ మట్టి గొట్టుకుపోయాయి.
చంద్రబాబునాయుడు వంచనకు రెండువైపులా పదును.
నాయకమ్మన్యులందరికీ సీమాంధ్ర ప్రజల్ని మాత్రం వంచించే అవకాశం ఉంది. అదే చంద్రబాబుకు ఇరు ప్రాంతాల ప్రజలను బురిడీ కొట్టించే ఛాన్సుంది. తనకున్న అవకశాన్ని పూరా సద్వినియోగం చేసుకోవడానికి పాపం.. ఆయన శక్తి వంచన లేకుండా ప్రయత్నించారు. ఆయన ప్రయత్నం పూర్తిస్థాయిలో ఫలించలేదన్నది నిజం. ప్రజలు ఆయన మాటలు, చేతలకు అంత ఎక్కువగా మోసపోలేదు. కామెడీ ఏంటంటే.. ఆయన వంచన పర్వంలో, వంచిత వర్గంలో నిలిచే భాగ్యం ఢల్లీిలోని ఇతర పార్టీల పెద్దలకు కూడా ప్రాప్తించే ఏర్పాటు చేశారు గానీ.. ఆ పాచిక కూడా పారలేదు.
చంద్రబాబు రాసిన లేఖ ఎంత సందిగ్ధంగా ఉన్నదో, ఆయన వంచనా ప్రస్థానం కూడా అంతే సందిగ్ధమైనది.
తెలంగాణ విషయం త్వరగా తేల్చమని మాత్రమే బాబు లేఖ రాశారు. ‘ఇవ్వ’మని కాదు. కానీ ఇవాళ అలాగని ఆయన చెప్పుకోలేరు. ఇప్పుడు కూడా… అపభ్రంశపు అర్థాయుష్షు బస్సు యాత్ర చేసినా.. నిరవధిక నిరాహార దీక్ష చేసినా.. 75 రోజులుగా ఏదో ఒక మాయ మాటలు చెబుతూనే ఉన్నా.. చంద్రబాబు స్పష్టంగా తనకేం కావాలో చెప్పలేదు.
ఉదాహరణకు ‘హైదరాబాదు సంగతి తేల్చకుండా’ అంటారు చంద్రబాబు. కాంగ్రెస్ చాలా స్పష్టంగా తేల్చింది. అది తెలంగాణది మాత్రమే అని చెప్పింది. సీమాంధ్రులు ఇక్కద పదేళ్లు రాజధాని నిర్వహించుకుని వెళ్లిపోవాలని చెప్పింది. ఇంకా ఏం తేల్చాలి. అంటే చంద్రబాబు ఉద్దేశం ఏంటంటే.. తన ఆలోచనకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రకటించలేదు కాబట్టి తేల్చలేదు అంటున్నారు. పోనీ ఆయన ఆలోచన చెబుతారా.. హైదరాబాదుపై ఉమ్మడిగా ఇరు ప్రాంతాలకు అధికారం ఉండాల్సిందే అనే మాట బహిరంగంగా డిమాండ్ చేయగలరా… అంటే అందుకు మళ్లీ ధైర్యం లేదు. కుటిల రాజకీయనీతి, చాణక్య ఎత్తుగడల పరంగా ప్రత్యర్థులు చంద్రబాబును ఎన్ని రకాలుగా అయినా విమర్శించవచ్చుగానీ.. స్వతహాగా ఆయన పిరికివాడు మాత్రం కాదు. ఎన్నిచేసినా ధైర్యంగానే చేసేవాడు.. ఇప్పుడు వార్ధక్యం ఆయనలో పిరికితనాన్ని నింపుతున్నట్లుంది. అయితే ఏదో ఒక మాయ జరిగి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి.. జగన్ పట్ల అపనమ్మకాలు ముదిరి.. ఓట్ల పరంగా అంతిమలాభం తనకే దక్కుతుందనే భ్రమలో బతుకువెళ్లదీస్తున్నారు చంద్రబాబు.
అందుకే విభజన విషయంలో ఎప్పటికీ ఏమీ తేల్చకుండా వంచించడానికే ఆయన మొగ్గు. అటూ ఇటూ కాని మాటలతో నెట్టేస్తున్నారు.
చంద్రబాబు వంచన స్కోరు : 80/100.
జగన్ : తాను చేస్తేనే సమైక్యం.. పరులు చేస్తే…
జగన్ వంచన ఒక వెరైటీ. ఆయన చాలా స్పష్టంగా సమైక్యవాదాన్ని భుజానికెత్తుకున్నారు. ఈ వంచన పర్వంలో` ఆయనలో కొంత కేసీఆర్ లక్షణాలు కనిపిస్తాయి. తాను చేస్తే అది సమైక్య పోరాటం లెక్క. మరొకరు ఎవరైనా అదే పనిచేస్తే.. దాన్ని ఆయన గుర్తించరు. సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్న ఉద్యోగ సంఘాల పోరాటాలకు ఆయన మీడియా ఇచ్చిన అల్ప ప్రాధాన్యం దీనికి ఒక తార్కాణం. తాను సంకల్పించిన లక్ష్యం పట్ల నిబద్ధత ఉన్నప్పుడు ఆ లక్ష్యం కోసం ఎవ్వరు నిష్కల్మషంగా ఉద్యమించినా.. దానికి జేకొట్టడం, దన్నుగా నిలవడం బాధ్యత. అలా కాకుండా.. తాను చేసే సమైక్య నినాదం సింహగర్జన అని, ఉద్యోగసంఘాలు ఉద్యమకారుల నినాదాలు పిల్లికూతలని వ్యత్యాసాలు చూపించడం అనేది అంతిమంగా.. పోరాటానికి చేటు చేస్తుంది.
మరో తమాషా మోసపూరిత ట్రిక్కు ఏంటంటే.. వైఎస్ జగన్ ఎంతసేపూ చంద్రబాబునాయుడును టార్గెట్ చేయడమే తన జీవిత లక్ష్యంగా భావిస్తారు. ఎందుకంటే, రేపు ఎన్నికల రణసీమలోకి ఆయనే తన ప్రధాన ప్రత్యర్థి అని జగన్ భావిస్తున్నారు గనుక! ‘చంద్రబాబుగారూ మీరు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని లేఖ రాయండి… మేం వచ్చి సంతకం పెడతాం..’ అంటారు. చంద్రబాబు దగ్గర మాత్రమే తన విశాల హృదయం చాటుకుంటారు. అదే సమయంలో సమైక్యం అన్న సీపీఎం వద్దకెళ్లి అక్కున ్చఏర్చుకునే ప్రయత్నం చేస్తారు. అంతేతప్ప కాంగ్రెసు వాళ్లు సమైక్యం కోసం లేఖలు రాస్తున్నారు కదా, అందులో తాను కూడా సంతకం పెట్టవచ్చునని మాత్రం ఆయన అనుకోరు. చంద్రబాబు ‘సమైక్యం’ అనలేని స్థితిలో ఉన్నాడు గనుక.. ఆ కోణంలోంచి ‘జై విభజన’ వాదిగా చంద్రబాబును వీలైనంత ఎక్కువ ప్రొజెక్టు చేస్తే.. యావత్తు సీమాంధ్రలో తాను ఏకపక్షంగా విజయాల్ని నమోదుచేయవచ్చుననేది జగన్ బలీయమైన కోరిక.
తెలుగుదేశం వాళ్లు సమాధి కట్టినందుకు విలపిస్తున్నారు గానీ… నిజానికి కాంగ్రెసు సీమాంధ్రలో తమ సమాధి తామే నిర్మించేసుకున్నదన్నది జగద్విదితం. వారిని విమర్శిస్తూ టైం వేస్ట్ చేసుకునే బదులు తెలుగుదేశాన్ని టార్గెట్ చేయాలని జగన్ కోరిక. అందుకే ఆయనలో` సమైక్య వాంఛ కంటె తెదేపా వ్యతిరేకతే బలీయంగా మారి.. అది డామినేట్ చేసేస్తోంది. ఉద్యమానికి అలా నష్టం జరుగుతోంది.
వెయ్యేల… ‘మాకు తెలంగాణ కావాలి. తమరికి అధికారం కావాలి. తమ పుత్రుడికి ప్రధాని పీఠం కావాలి. మాకు కావల్సింది ఇచ్చేయి తల్లీ.. మా పార్టీని కాంగ్రెసులో విలీనం చేసేస్తా’ అని కేసీఆర్ హామీ ఇచ్చి లక్ష్యాన్ని సాధించగలిగారు. ఇప్పుడు విలీనం చేస్తున్నారా? లేదా? అనేది వేరే సంగతి. అంతే స్పష్టంగా… ‘మాకు సమైక్యాంధ్ర కావాలి. ఇచ్చేయి తల్లీ.. మా పార్టీని విలీనం చేసేస్తా’ అని మాటమాత్రంగానైనా త్యాగం ప్రకటించగల తెగువ జగన్‌కు ఉందా? ‘పార్టీలను కలిపేసుకుంటూ అధికారం కోసం వెంపర్లాడే నైజం తమదైతే.. నాకు ఈ పదవులు అక్కర్లేదు.. పార్టీ మీ పాదాల దగ్గర పెట్టేస్తా… రాష్ట్రాన్ని చీల్చవద్దు’ అని జగన్ ఎమోషనల్‌గా ఒక్క డైలాగు చెప్పినా ఆయన హీరో అయిపోతారు. కానీ.. తథాస్తు దేవతలకు భయపడుతున్నట్లుగా ఆయన మాత్రం అలాంటి మాటలు చెప్పరు.
ఒక్కమాటలో చెప్పాలంటే జగన్ వైఖరిలో వంచన తక్కువ.. స్వార్థ అధికార లాలసత పాళ్లు జాస్తి. అది తప్పా ఒప్పా అనేది ప్రజల విజ్ఞత, విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది.
జగన్ వంచన స్కోరు : 50/100.
వీరికంటె ఘనులే అంతా…
వీరేనా వంచకులికలేరా.. అని ఆశ్చర్యపోవలదు.
అన్ని పార్టీల్లో తమ తమ స్థాయిని అనుసరించి.. వంచనమంత్రాన్ని జపిస్తున్న వారు అనేకులు ఉన్నారు. వారిలో 100కు 100 మార్కులు స్కోరు చేయగల మహామహులు కూడా ఉన్నారు. కానీ వారి వంచనలు జగద్విదితం. పైగా వారి గురించి ఒక్క వాక్యం చర్చించుకోవడం కూడా వృథా. అందుకే అందరినీ విస్మరిస్తే కాస్త మనశ్శాంతి.
కూలనున్న అమ్మ కలలు…
‘‘అంతా తమ ప్రయోజకత్వం
తామే భువి కధినాధుల మని
స్థాపించిన సామ్రాజ్యాలూ
నిర్మించిన కృత్రిమ చట్టాల్’’
… ఈ చివరి పంక్తుల్లో మన పైత్యం లేదు. 2013లో ఇలాంటి దురహంకార భరితమైన… తామే సర్వజ్ఞులమని, సర్వకాల సర్వావస్థల్లో పాలకులం అని భ్రమించి చట్టాలు, చీలికలు చేసే ధూర్తపాలకులు అవతరిస్తారని ఎరిగిన త్రికాలజ్ఞుడుగా… మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు 1938లో పలికిన శాపవచనాలు.
అధినేత్రి కలల పేకమేడలు కూలిపోవడం చిటికెలో పని. ఎటూ డిగ్గీరాజా వంటి వారు యూటర్న్ మేం తీస్కోం అంటూ కొన్ని వందల సార్లు ప్రకటించిన తరువాత.. ఇక వారికి రాష్ట్రం చీల్చక తప్పని పరిస్థితి దాపురించిన తర్వాత… తెరాస విలీనం కాబోయేది లేదని సంకేతాలు వస్తున్నాయి. అదే జరిగితే.. కొత్త రాష్ట్రంలో తెరాస, భాజపాలు మాంసం నంజుకోగా… కాంగ్రెసు వారికి దక్కేది బొక్కలే! ఇటు సీమాంధ్రలో` ఎంగిలిచేత్తో కాకిని విదిలిస్తారేమో గానీ.. కాంగ్రెసు బొచ్చెలో ఒక సీటు కూడా ముష్టి వేయరనేది ఖరారు.
‘‘ఇతరేతర శక్తులు లేస్తే
పడిపోవును పేకమేడలై
పరస్పరం సంఘర్షించిన
శక్తులలో చరిత్ర పుట్టును’’
కపిలముని