అల్లు అర్జున్ మరో ఘనత సాధించాడు. దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో బన్నీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇంతకుముందు ప్రభాస్, మహేష్ మాత్రమే ఈ ఘనత సాధించగా.. ఇప్పుడు బన్నీ కూడా లిస్ట్ లోకి చేరాడు.
స్వయంగా తన చేతుల మీదుగా మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించాడు అల్లు అర్జున్. ఆ ఫొటోల్ని ఘనంగా తన సోషల్ మీడియా పేజీలో షేర్ చేశాడు. దీంతో బన్నీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆశ్చర్యకరంగా మెగా కాంపౌండ్ నుంచి స్పందన అంతగా రాలేదు.
మెగా కాంపౌండ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్న రామ్ చరణ్, బన్నీ మైనపు విగ్రహంపై ఇప్పటివరకు స్పందించలేదు. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా కనిపించే చిరంజీవి కూడా ఈ అంశంపై ఇప్పటివరకు స్పందించకపోవడం ఆశ్చర్యం.
మెగా కాంపౌండ్ లో కీలకమైన చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ బన్నీ మైనపు విగ్రహంపై స్పందించకపోవడంతో చాలామంది చెవులు కొరుక్కుంటున్నారు. బన్నీ-చరణ్ మధ్య అభిప్రాయబేధాలున్నాయంటూ ఇప్పటికే ఎన్నో కథనాలొచ్చాయి. ఈమధ్య అవి కాస్త తగ్గాయనుకున్న టైమ్ లో, తాజా పరిణామాలతో అవి మరోసారి తెరపైకొచ్చాయి.
కుటుంబంలో అభిప్రాయబేధాలు సహజం. కొన్నాళ్లు ఎడమొహంపెడమొహంగా ఉంటారు, ఆ తర్వాత కలిసిపోతారు. అయితే ఇంటిపెద్ద మాత్రం వీటికి అతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆ స్థానంలో ఉన్న చిరంజీవి, బన్నీ సాధించిన ఘనత పట్ల స్పందించకపోవడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది.
ఇక పవన్ కల్యాణ్ సంగతి సరేసరి. ఓవైపు రాజకీయంగా బిజీగా ఉన్నప్పటికీ.. రామ్ చరణ్ పుట్టినరోజు నాడు ప్రత్యేకంగా ప్రెస్ నోట్ విడుదల చేసి మరీ శుభాకాంక్షలు తెలిపిన పవన్, బన్నీ మైనపు విగ్రహంపై మాత్రం మౌనం వహించారు.
ఇలా మెగా కాంపౌండ్ కు చెందిన కీలక వ్యక్తులంతా మౌనం వహించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉన్నంతలో సాయిదుర్గతేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్.. బన్నీ సాధించిన ఘనతను మెచ్చుకున్నారు, అతడికి శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ కు అల్లు అర్జున్ ను మెచ్చుకోవడానికి ఇంకా సమయం చిక్కినట్టు లేదు.