దిల్ రాజు రోడ్డెక్కారు.. నిజాలు అంగీకరించారు

గడిచిన 4-5 ఏళ్లుగా గుంతల రోడ్డుపైనే ప్రయాణం చేస్తున్నామని.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తారు రోడ్డు ఎక్కామని తేల్చేశారు.

నిర్మాత దిల్ రాజులో ఉన్న గొప్పదనం ఏంటంటే, ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. నిజాలు ఒప్పుకుంటాడు, తప్పు తనవైపు ఉన్నప్పటికీ కవర్ చేసుకునే ప్రయత్నం చేయడు. ఈసారి కూడా అదే పనిచేశాడు.

ఒకేసారి సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్ సినిమాల్ని రిలీజ్ చేసిన రాజు.. గేమ్ ఛేంజర్ విషయంలో తను చేసిన తప్పుల్ని పరోక్షంగా అంగీకరించారు. బడ్జెట్ ఇంపార్టెంట్ కాదు, కథలే ముఖ్యమన్నారు. ఈ చిన్న లాజిక్ ను మేం మిస్సయ్యామని కూడా ఒప్పుకున్నారు.

కథల్ని నమ్ముకొని, దర్శకులపై నమ్మకంతో సినిమాలు చేసినప్పుడు ఎస్వీసీ బ్యానర్ పై నుంచి క్లాసిక్స్ వచ్చాయని, ఎప్పుడైతే అందర్లా కాంబినేషన్ల వెంట పడ్డామో అప్పుడే ట్రాక్ తప్పామని ఓపెన్ గా ప్రకటించారు ఈ పెద్ద ప్రొడ్యూసర్.

గడిచిన 4-5 ఏళ్లుగా గుంతల రోడ్డుపైనే ప్రయాణం చేస్తున్నామని.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తారు రోడ్డు ఎక్కామని తేల్చేశారు. తమ రూటు ఏంటనేది తమకు క్లారిటీ వచ్చిందన్నారు.

ఈ సందర్భంగా మరో ఆణిముత్యం లాంటి మాట కూడా అన్నారు. 2025లో తను చాలా పెద్ద పాఠం నేర్చుకున్నానని, దర్శకుడితో కలిసి ప్రయాణం చేసినప్పుడే మంచి రిజల్ట్ వస్తుందనే విషయం తెలుసుకున్నానని అన్నారు. ఈ మాట ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో ఆయనకే తెలియాలి.

ఈ సందర్భంగా మీడియాకు కూడా ఓ సవాల్ విసిరారు రాజు. తమకు కూడా కొన్ని వీక్ నెస్ లు ఉంటాయని.. రకరకాల నంబర్లతో పోస్టర్లు వేస్తామని, అసలైన వసూళ్లు ఎంతనేది మీడియానే నిగ్గుతేల్చి జనాలకు చెప్పాలని కోరారు. మొత్తమ్మీద కొంతమంది పేర్లు ప్రస్తావించకుండా, కొన్ని సినిమాల పేర్లు మెన్షన్ చేయకుండా.. చాలా నిజాలు చెప్పేశారు దిల్ రాజు.

7 Replies to “దిల్ రాజు రోడ్డెక్కారు.. నిజాలు అంగీకరించారు”

Comments are closed.