బ్లాక్ బస్టర్ సూపర్ హిట్.. సెన్సేషనల్ హిట్.. మూవీ ఆఫ్ ది ఇయర్.. సూపర్ హిట్ మూవీ.. పత్రికల్లో, టీవీల్లో సినిమా యాడ్స్ ఇచ్చినప్పుడు ఇవి కామన్. ఎందుకంటే, ఇలా చెబితే నిజంగా సినిమా బాగుందేమో అనే భ్రమలో మరికొంతమంది ఆడియన్స్ థియేటర్లకు వస్తారని మేకర్స్ ఆశ.
అయితే ఈ ఎత్తుగడ ఫెయిలై ఎన్నో ఏళ్లయింది. బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ స్థానంలో మరెన్నో కొత్త పదప్రయోగాలు పుట్టుకొచ్చినప్పటికీ జనం నమ్మడం మానేశారు. మరి తమ సినిమాల వైపు జనాల్ని ఆకర్షించాలంటే ఏం చేయాలి? సరిగ్గా ఇక్కడే పుట్టుకొచ్చింది ‘బ్లాక్ బుకింగ్’ అనే కొత్త పద్ధతి.
ఓ సినిమా రిలీజ్ అవుతుంది. జనం మాత్రం థియేటర్లకు రారు. దీంతో నిర్మాతలు లేదా హీరో తమ సినిమా టికెట్లను తామే కొనుగోలు చేస్తారు. మొదటి రోజు బుక్ మై షోలో టికెట్లన్నీ అమ్ముడుపోయాయని, భారీ కలెక్షన్లు వచ్చాయని చూపించే ప్రయత్నం చేస్తారు. అవసరమైతే కొన్ని స్క్రీన్స్ దగ్గర హౌజ్ ఫుల్ బోర్డులు పడేలా చేస్తారు. దీన్నే బ్లాక్ బుకింగ్ లేదా కార్పొరేట్ బుకింగ్స్ అని అంటారు.
ఇలా చేయడం వల్ల సినిమాకు జనం పోటెత్తుతారని, మూవీ హిట్ అయిందని మిగతా ప్రేక్షకులు నమ్మే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తారు. ప్రస్తుతం బాలీవుడ్ లో జోరుగా నడుస్తోంది ఈ కార్పొరేట్ బుకింగ్ ట్రెండ్. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి సినిమాకు కార్పొరేట్ బుకింగ్స్ ను ఆశ్రయిస్తున్నారు మేకర్స్.
అయితే ఇది సమస్యకు పరిష్కారమా? కార్పొరేట్ బుకింగ్స్ తో బాక్సాఫీస్ వైఫల్యాల నుంచి బాలీవుడ్ బయటపడగలదా? ఇది ఎప్పటికీ సాధ్యం కాదు. కార్పొరేట్ బుకింగ్ అనేది సినిమా రిలీజైన మొదటి 2-3 రోజులు మాత్రమే పనిచేసే ఎత్తుగడ. ఆ తర్వాత కూడా సినిమా నడవాలంటే కచ్చితంగా మౌత్ టాక్ బాగుండాలి. అది లేనప్పుడు వారం రోజుల పాటు బ్లాక్ బుకింగ్స్ చేసినా ఫలితం ఉండదు. కొన్ని నెలల కిందట అలియా భట్ నటించిన ఓ సినిమాకు ఇదే జరిగింది. కానీ ఫలితం రాలేదు.
ఈ మధ్య వచ్చిన అక్షయ్ కుమార్ సినిమాకు కూడా ఇదే ఎత్తుగడ పాటించారు. దాదాపు వారం రోజుల పాటు కార్పొరేట్ బుకింగ్స్ చూపించారు. బుక్ మై షో లాంటి యాప్స్ లో 50 శాతానికి పైగా సీట్లు ఫుల్ చేశారు. కానీ సినిమా రిజల్ట్ ఏంటనేది అందరికీ తెలిసిందే.
రీసెంట్ గా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఛావా సినిమాకు కూడా ప్రారంభంలో ఈ పని చేశారనే ఆరోపణలున్నాయి. అయితే ఈ సినిమా విషయంలో ఆ ఎత్తుగడ ఫలించిందనే చెప్పుకోవాలి.
ఓవరాల్ గా చూసుకుంటే, బ్లాక్ బుకింగ్స్ చిట్కా, బాలీవుడ్ ఫ్లాపులకు అడ్డుకట్ట వేసే శాశ్వత పరిష్కార మార్గం కానేకాదు. ఈ హైప్ చూపించి ఓటీటీ, శాటిలైట్ డీల్స్ కుదుర్చుకోవచ్చేమో కానీ, ఓ సినిమా బాక్సాఫీస్ సక్సెస్ కు మాత్రం ఇది మార్గం కాదు.
Chudam