బన్నీ అరెస్ట్ తో నిన్నంతా మోహన్ బాబు ఇష్యూ సైడ్ అయింది. ఈరోజు అది మరోసారి తెరపైకి వచ్చింది. ఏ నిమిషంలోనైనా మోహన్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది.
ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడంతో, మోహన్ బాబు అరెస్ట్ తప్పదని కథనాలు వస్తున్నాయి. మరోవైపు మోహన్ బాబు పరారీలో ఉన్నారంటూ ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. వీటన్నింటిపై ఒకేసారి స్పందించారు మోహన్ బాబు.
“తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించలేదు. నేను మా ఇంట్లోనే ఉన్నాను. మెడికల్ కేర్ లో ఉన్నాను. దయచేసి మీడియా వాస్తవాలు తెలుసుకొని వ్యవహరించాలి.”
మీడియా ప్రతినిధిపై దాడి చేసిన ఘటనలో మోహన్ బాబుపై కేసు నమోదైంది. దాడి చేసినట్టు అంగీకరించిన మోహన్ బాబు, ఆ వేడిలో అలా జరిగిపోయిందంటూ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. బాధితుడ్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని తెలిపారు. అయినప్పటికీ బాధితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మోహన్ బాబుపై కేసు నమోదైంది. కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే తప్ప, మోహన్ బాబు అరెస్ట్ ఖాయం అంటున్నారు న్యాయ నిపుణులు.
తాజా సమాచారం ప్రకారం.. పోలీసులు ఆయనతో టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆయన నుంచి స్టేట్ మెంట్ తీసుకునే పనిలో పోలీసులున్నట్టు సమాచారం. అంతేకాదు, మోహన్ బాబు దగ్గరున్న లైసెన్స్ డ్ తుపాకీని కూడా స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నారు.