వైసీపీ, కూటమికి వచ్చే సీట్లపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పలు సర్వేలు అధికారంపై భిన్నమైన లెక్కలు చెబుతున్నాయి. అయితే టీడీపీ నేతలు, కార్యకర్తలు తమకు తెలిసిన వారికి ఫోన్ చేసి సేకరిస్తున్న లెక్కలు, ఆ పార్టీకి భయం కలిగిస్తున్నాయి. జనసేన ఒకట్రెండు స్థానాల అభ్యర్థుల మినహా, మిగిలిన పార్టీలన్నీ తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి.
రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి సంబంధించి అభ్యర్థుల ఎంపిక రచ్చకు దారి తీసింది. కూటమి పెద్దన్నగా టీడీపీ అధికారాన్ని కాంక్షిస్తోంది. తాజా పరిణామాలపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
రెండు నెలల క్రితం నాటి సానుకూల పరిస్థితులు ఇప్పుడు లేకపోవడంతో టీడీపీలో కలవరం మొదలైంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ఎక్కడ చూసినా విధ్వంసాలే కనిపిస్తున్నాయి. ఈ మొత్తం వాతావరణాన్ని చూస్తుంటే… మరోసారి ప్రతిపక్షానికే పరిమితం అయ్యే సంకేతాలు వెలువడుతున్నాయని టీడీపీ శ్రేణులు భయాందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు తమకు తెలిసిన వారికి ఫోన్‌కాల్స్ చేస్తూ… ఎలా వుందని ఆరా తీస్తున్నారు.
రాయలసీమలో వైసీపీ బలంగా వుంది. ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేకత, ఇతరత్రా కారణాలతో సీమలో వైసీపీకి సీట్లు తగ్గొచ్చనేది టీడీపీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. కనీసం అంటే 35 సీట్లకు సీమలో వైసీపీకి ఏ మాత్రం తగ్గవని ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు ఇతర ప్రాంతాల నేలతో చెబుతున్నారు. మీ ప్రాంతాల్లో ఎలా వుంది? ఏఏ పార్టీకి ఎన్నెన్ని సీట్లు రావచ్చనే వివరాలు తెలుసుకుంటున్నారు.
ఫోన్ సంభాషణల్లో లెక్కలు ఎలా వున్నాయంటే.. నెల్లూరులో వైసీపీకి 7, టీడీపీకి 3, ప్రకాశంలో వైసీపీ, టీడీపీలకు చెరో ఆరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకి 7, కూటమికి 9, గుంటూరులో వైసీపీకి 7, కూటమికి 10, ఉభయ గోదావరి జిల్లాల్లో 34 సీట్లలో వైసీపీకి 15, కూటమికి 14, మరో ఐదు స్థానాల్లో గట్టి పోటీ వుందనే మాట వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర విషయానికి వస్తే 34 స్థానాల్లో వైసీపీ, కూటమికి ఒక సీటు అటోఇటో వస్తాయని లెక్కలేస్తున్నారు. వైసీపీకి విజయనగరంలో బాగా వుందని అందరూ చెబుతున్న మాట. వైసీపీకే రెండు సీట్లు తక్కువ వేస్తున్నారు. ఉత్తరాంధ్రలో వైసీపీకి 16, కూటమికి 18 అసెంబ్లీ సీట్లు వస్తాయని లెక్కలేస్తున్నారు.
ఏ రకంగా చూసినా వైసీపీకి నెల్లూరు వరకూ ఆధిక్యత వస్తుందనే ఆ పార్టీ నేతలు సైతం చెబుతున్న మాట. ఈ లెక్క ప్రకారం వేసుకున్నా రాయలసీమలో వైసీపీకి 35, నెల్లూరులో 7, ప్రకాశంలో 6, కృష్ణాలో 7, గుంటూరులో 7, ఉభయగోదావరి జిల్లాలో 15, ఉత్తరాంధ్రలో 16 సీట్లు చొప్పున మొత్తం 93 సీట్లు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లో మరో ఐదు చోట్ల నువ్వానేనా అనే రీతిలో పోటీ జరుగుతుంది. ఇక టీడీపీకి వచ్చే సీట్లు ఎన్నో లెక్కేద్దాం. రాయలసీమలో 17, ఉభయగోదావరి జిల్లాల్లో 14, ఉత్తరాంధ్రలో 18, గుంటూరులో 10, కృష్ణాలో 9, నెల్లూరులో 3, ప్రకాశంలో 6 సీట్లు చొప్పున మొత్తం 77 సీట్లు వస్తాయి. ఉభయగోదావరి జిల్లాల్లో గట్టి పోటీ అనుకుంటున్న ఐదు సీట్లను కూడా కూటమి ఖాతాలో ఉదారంగా వేద్దాం. అప్పుడు కూటమి గెలిచే సీట్ల సంఖ్య 82కు పెరుగుతుంది.
వైసీపీకి చాలా వరకూ తగ్గించి వేసినా… అధికారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ను దాటుతోంది. ఈ లెక్కలే కూటమిని, మరీ ముఖ్యంగా టీడీపీ నేతలకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.