అభ్యర్థుల ప్రకటన టీడీపీకి వరుస షాక్ ఇస్తోంది. అనపర్తి, అనంతపురం అర్బన్, గుంతకల్లు, చీపురుపల్లి తదితర నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటన టీడీపీకి కోలుకోలేని దెబ్బ తీస్తోంది. కార్యాలయాల విధ్వంసానికి టీడీపీ శ్రేణులు తెగబడ్డాయి. తాజాగా అన్నమయ్య జిల్లా రాజంపేటలో టికెట్ చిచ్చు రేపింది. టీడీపీ ఇన్‌చార్జ్ బత్యాల చెంగల్రాయుడిని కాదని, రాయచోటికి చెందిన సుగవాసి బాలసుబ్రమణ్యాన్ని అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు.
దీంతో బత్యాల తీవ్ర మనస్తాపం చెందారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. బత్యాల బాటలోనే ఆయన అనుచరులు కూడా నడుస్తున్నారు. గత రాత్రి బత్యాల తన అనుచరులతో భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీలో కష్టపడి పని చేసే నేతలకు విలువ లేదని ఆయన మండిపడ్డారు. ఇక ఈ పార్టీలో వున్నా ప్రయోజనం లేదని అన్నారు.
ఈ నేపథ్యంలో రాజంపేట నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో బత్యాల రాజంపేటలో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ ఆయన ప్రజలతోనే వున్నారు. ఐదేళ్లుగా రాజంపేటలో కేడర్‌ను కాపాడుకోడంతో పాటు పార్టీ పిలుపు మేరకు ఆందోళనలు, ఇతరత్రా కార్యక్రమాల నిర్వహణకు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టుకున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
స్థానిక ప్రజలతో మమేకం అయిన బత్యాల చెంగల్రాయుడిని కాదని, రాయచోటి నుంచి సుగవాసిని తీసుకొస్తే ప్రయోజనం ఏంటనే ప్రశ్న ఉత్పన్నం అయ్యింది. బలిజ సామాజిక వర్గానికి చెందిన బత్యాలకు రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో తన కులంలో మంచి పట్టు వుంది. ఇప్పుడాయన ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే, కూటమికి భారీ దెబ్బ అని చెప్పకతప్పదు. ఈ ప్రమాదం నుంచి కూటమి ఎలా బయట పడుతుందో చూడాలి.