చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే!

ఉచిత పథకాలను ఆపడం ఎవరి తరమూ కావడంలేదు. ఎవరేం చెప్పినా రాజకీయ పార్టీలకు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే ఉంటుంది.

రాజకీయ పార్టీలు ఉచిత పథకాలు ఇవ్వొద్దని సుప్రీం కోర్టు చెబుతూనే ఉంది. అయినా మార్పు రావడంలేదు. ఒక దశలో ఉచిత పథకాలు ఇవ్వకుండా ఆపలేమని నిస్సహాయత వ్యక్తం చేసింది. ఒకసారి ఈసీ కూడా రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి ఉచిత పథకాల హామీలు వద్దని చెప్పింది. అయినప్పటికీ రాజకీయ పార్టీలు పట్టించుకోలేదు. పట్టించుకోవు కూడా.

ఎన్నికల్లో ఓట్లు పడాలంటే ఒక పార్టీని మించి మరో పార్టీ ఉచిత పథకాలు ప్రకటించాల్సిందే. తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రాలో అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు నాయుడు (కూటమి) ఇబ్బడి ముబ్బడిగా ఉచిత పథకాలను ప్రకటించారు. కారణాలు ఏవైనా చివరకు అధికారంలోకి వచ్చారు.

కాని హామీ ఇచ్చిన ఉచిత పథకాలను అమలు చేయలేక రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తలలు పట్టుకుంటున్నారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనేక హామీలిచ్చాడు. అందులో మహిళలకు కళ్యాణలక్ష్మి చెక్కులతోపాటు తులం బంగారం ఇస్తానని చెప్పాడు. రెండొందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పాడు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పాడు. మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తానని చెప్పాడు. రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణ మాఫీ చేస్తానని చెప్పాడు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తానని చెప్పాడు.

వీటిల్లో ఒక్క ఉచిత బస్సు ప్రయాణమే సజావుగా అమలు జరుగుతోంది. తులం బంగారం ఇవ్వడంలేదు. రుణ మాఫీ పూర్తిగా అమలుకాలేదనే ఆరోపణలు ఉన్నాయి. మిగతా పథకాలు అమలు కావడంలేదని తెలుస్తోంది. చంద్రబాబు కూడా అధికారంలోకి రావడానికి ఉచిత పథకాల హామీలు విపరీతంగా గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయాలంటే ఆయనకు చుక్కలు కనబడుతున్నాయి. హామీల అమలును కొన్నింటిని వచ్చే ఏడాదికి వాయిదా వేశారు.

సంపద సృష్టించాక హామీలు అమలు చేస్తామంటున్నారు. హామీలు అమలు చేయడానికి లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తున్నారు. రకరకాల నిబంధనలు పెడుతున్నారు. వాయిదా వేసుకుంటూపోతున్నారు. ఓట్ల కోసం ఉచిత పథకాలను అమలు చేయాలనుకోవడం దేశానికి ప్రమాదకరమని ప్రధాని మోదీ కూడా ఒకప్పుడు హెచ్చరించారు. కాని ఆయన కూడా మొన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బోలెడు ఉచిత పథకాలు ప్రకటించారు.

ఉచిత పథకాలకు కచ్చితమైన నిర్వచనం ఏమి లేకపోవడంతో ఇది మంచిదా, చెడ్డదా అనే విషయాన్ని చెప్పడం కష్టం. ప్రజల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సేవలను అందించడాన్ని ఉచిత పథకాలని చెప్పొచ్చు. దీనికొక కచ్చితమైన నిర్వచనం లేకపోవడంతో కొంత మంది ఈ పథకాలు మంచివని అంటుంటే, కొంత మంది ఇవి మంచివి కావని అంటూ తమ వాదనలు వినిపిస్తున్నారు.

ఉచిత పథకాలు ఓటర్లను ఆలోచించి నిర్ణయం తీసుకునేందుకు అవరోధంగా పని చేస్తాయి అని అంటారు. కొంత మంది ఓటర్లు తామెవరిని ఎన్నుకోవాలనే నిర్ణయం నుంచి పూర్తిగా పక్కకు తప్పుకునేట్లు చేస్తాయని విమర్శిస్తారు. ఎవరెటువంటి వాదన చేసినప్పటికీ, ఉచిత పథకాలు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నికల రాజకీయాల్లో అంతర్భాగంగా ఉన్నాయి. నగదు బదిలీలు, ఆరోగ్య బీమా, ఆహార ఉత్పత్తులు నుంచి కలర్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, సైకిళ్ళు, బంగారం వరకు కూడా ఓటర్లకు ఇస్తామని చాలా మంది రాజకీయ నాయకులు హామీలు చేస్తూ ఉంటారు.

ఒక ఎన్నికల్లో తమిళనాడుకు చెందిన ఒక రాజకీయ నాయకుడు 100 రోజుల పాటు చంద్రమండలానికి, అధిక ఉష్ణోగ్రతల నుంచి బయటపడేందుకు చల్లని దీవికి పర్యటనకు తీసుకుని వెళతానని హామీ ఇచ్చారు. ఇలాంటి ప్రకటన చేయడం వెనుకనున్న ఉద్దేశ్యం గురించి చెబుతూ, రాజకీయ నాయకులు చేసే భారీ హామీల గురించి ప్రజలకు అవగాహన కలిగించేందుకే ఇలాంటి ప్రకటన చేశానని ఆయన అన్నారు. అయితే, ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు.

ఉచిత పథకాన్ని సంక్షేమ పథకం నుంచి వేరు చేసేందుకు కచ్చితమైన నియమాలేమి లేవు. భారతదేశంలో ఎన్నికలకు ముందు, తర్వాత ఓటర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వడం చట్టవ్యతిరేకం కాదు. దేశంలో అన్ని పార్టీలు, ఆఖరుకు బీజేపీ కూడా ప్రోత్సాహకాలు ప్రకటిస్తుంది. ప్రభుత్వాలు కూడా పౌరుల సామాజిక ఆర్ధిక అభివృద్ధికి కొన్ని సంక్షేమ పథకాలను ప్రకటిస్తాయి. ఏది ఏమైనా ఉచిత పథకాలు ప్రభుత్వాలకు భారంగా మారుతున్నాయి.

ప్రజలు కూడా ఏ పనులు చేయడానికి ముందుకు రాకుండా సోమరులుగా మారుతన్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా సుప్రీం కోర్టు ఉచిత పథకాలతో ప్రజలను పరాన్న జీవులుగా తయారుచేస్తున్నారని ఘాటుగా విమర్శించింది. ఉచిత పథకాలను ఆపడం ఎవరి తరమూ కావడంలేదు. ఎవరేం చెప్పినా రాజకీయ పార్టీలకు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే ఉంటుంది.

2 Replies to “చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే!”

Comments are closed.