మూడు పార్టీల మధ్య పొత్తులు కుదిరాయో.. చంద్రబాబు తమకు కేటాయించినవి గెలిచే సీట్లో కాదు.. ఇంకా బోలెడు సందేహాలలోనే కొట్టుమిట్టాడుతున్నారు గానీ.. మొత్తానికి కమల నాయకులు తమకు దక్కిన సీట్లకు అభ్యర్థులను కూడా ప్రకటించేసుకున్నారు. ఇక కలసికట్టుగా ఎన్నికల ప్రచారంలోకి వెళ్లి సక్సెస్ సాధించడం మాత్రమే మిగిలింది.
ఇలాంటి నేపథ్యంలో బిజెపి రాష్ట్ర సారథి ఒక మాట చెబుతున్నారు. మూడు పార్టీల తరఫున నాయకులు ఇప్పటికే కలిశారని, ఇక కార్యకర్తలు మాత్రమే కలవవలసి ఉన్నదని ఆమె అంటున్నారు. అయితే ఇప్పుడు ఆమె ఇదే మాటను చంద్రబాబు వెన్నుపోటు తత్వాన్ని వ్యతిరేకిస్తున్న బిజెపి సీనియర్లతో చిన్నమ్మ పురందేశ్వరి ఇదే మాట చెప్పించగలదా అనే సందేహం పలువురికి కలుగుతోంది.
భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో జనదారణ గ్రాఫ్ ను పెంచుకుంటూ ఉండగా.. ఏపీలో మాత్రం చంద్రబాబు మోచేతి నీళ్లు తాగేలా, ఆయన విదిలించిన సీట్లను దక్కించుకుని అక్కడితో మురిసిపోతూ పోటీచేస్తుండడం అనేది ఆ పార్టీ సీనియర్లలోనే పలువురికి ఇష్టం లేదు.
చంద్రబాబు ను ఆశ్రయించడం పార్టీకి ఆత్మహత్యాసదృశం అని, వెన్నుపోటు తప్పదని పలువురు నాయకులు- పొత్తుల ప్రకటన వచ్చిన తర్వాత కూడా.. అధిష్ఠానానికి లేఖ రాశారు. తీరా ఇప్పుడు వారందరినీ కూడా ఎన్నికల జాబితాల్లో కనిపించకుండా పక్కన పెట్టారు. అలాగని వారేమీ ఊరూపేరూ నాయకులు కాదు.
ఇప్పుడు ప్రకటించిన జాబితాల్లో కంటె పార్టీకి చాలా విలువైన వారు. పార్టీ ఎజెండాను నిత్యం తమ భుజాన మోస్తుండేవారు. వారందరూ పొత్తులను ఇంకా తీవ్రంగా విభేదిస్తూ సైలెన్స్ పాటిస్తున్నారు. కాగా, చిన్నమ్మ మాత్రం.. నాయకులు కలిశారు- ఇక కార్యకర్తలు కలవాల్సి ఉంది అని ప్రకటించడం కామెడీగా ఉన్నదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
నిజానికి పురందేశ్వరి మాటలు స్ట్రెయిట్ మీనింగ్ తీసుకున్నా కూడా పొత్తులకు అది ప్రమాద సంకేతమే. ‘నాయకులు కలవడం’ అంటే వారికి సవాలక్ష వక్రప్రయోజనాలు ఉంటాయి. నియోజకవర్గాల స్థాయిలో కార్యకర్తల్లో ఇంకా పొత్తులు జీర్ణం కాలేదని, వారు ఇంకా సుముఖంగా మారలేదని ఆమె మాటలే స్పష్టం చేస్తున్నాయి. వారందరూ ఎప్పుడు దారిలోకి రావాలి?
దాదాపు మూడునాలుగు నెలల నుంచి చంద్రబాబు మరియు పవన్ కల్యాణ్ నానా పాట్లు పడుతోంటే.. పదుల సంఖ్యలో ఉండే బిజెపి నాయకులు ఇప్పటికి కలిశారు. అలాంటిది.. వేల సంఖ్యలో ఉండే కమలం కార్యకర్తలు ఎప్పటికి కలవాలి? ఈలోగా ఎన్నికల పుణ్యకాలం గడచిపోదా? అనేది ప్రజల్లో సందేహం. వీటన్నింటికీ చిన్నమ్మ ఏం సమాధానాలు చెప్తారోమరి?