సొంత జిల్లాలో ఎమ్మెల్సీని బొత్స గెలిపించాల్సిందే!

రెండు నెలల క్రితం విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది. విజయనగరం జిల్లా నుంచి విశాఖకు వచ్చి వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బొత్స ఆ పార్టీ…

రెండు నెలల క్రితం విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది. విజయనగరం జిల్లా నుంచి విశాఖకు వచ్చి వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బొత్స ఆ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. ఆయన బలమైన అభ్యర్థి కావడంతో టీడీపీ కూటమి పోటీకి తటపటాయించింది. చివరిలో పోటీ నుంచి తప్పుకుంది. అలా బొత్స ఎన్నిక ఏకగ్రీవం అయింది.

ఆయనకు ఎమ్మెల్సీ పదవితో పాటు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడి పదవి కూడా దక్కింది. ఇపుడు బొత్స సొంత జిల్లా విజయనగరంలో ఎమ్మెల్సీకి ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 28న స్థానిక సంస్థల కోటాలో జరిగే ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 1న ఫలితాలు వెలువడతాయి.

విశాఖ జిల్లాలో ఎమ్మెల్సీ సీటుని అవలీలగా గెలుచుకున్న బొత్సకు ఇపుడు సొంత జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్ధిని పార్టీ తరఫున గెలిపించడం ఒక సవాల్ గా మారింది అని అంటున్నారు. విజయనగరం జిల్లాలో కూడా స్థానిక సంస్థలు అన్నీ వైసీపీ చేతిలో ఉన్నాయి. మెజారిటీ వైసీపీకే ఉంది. ఆ సీటు కూడా వైసీపీదే.

దీంతో బొత్స మీద అతి పెద్ద బాధ్యత పడినట్లు అయింది. సరైన అభ్యర్ధిని బరిలోకి దించి అన్నీ తానై చూసుకుంటే కనుక వైసీపీ చేతిలోకి ఎమ్మెల్సీ సీటు పడడం కష్టం కాదు అన్న అభిప్రాయం ఉంది. బొత్స సొంత జిల్లా కాబట్టి ఆయన ప్రతిష్టగా తీసుకోవాల్సి ఉంది. ఆయన శాసనమండలిలో వైసీపీ పక్ష నాయకుడు. అందువల్ల తమ జిల్లా నుంచి ఎమ్మెల్సీని గెలిపించి మండలికి తీసుకుని పోవాల్సి ఉంది. బొత్స రాజకీయ వ్యూహాలకు అసలైన అగ్ని పరీక్షంగా దీనిని అంతా చూస్తున్నారు.

9 Replies to “సొంత జిల్లాలో ఎమ్మెల్సీని బొత్స గెలిపించాల్సిందే!”

Comments are closed.