ఆ ఇద్దరిదీ దశాబ్దాల వైరం. ఒకరు ముఖం ఒకరు చూసుకునే వారు కాదు. వేరు వేరు పార్టీలలో ఉంటూ వచ్చారు. ఇద్దరూ ఒకరి మీద ఒకరు పోటీ పడిన సందర్భాలు ఉన్నాయి. అధికార పార్టీలో ఒకరు ఉంటే ప్రతిపక్ష పార్టీలో మరొకరు ఉండేవారు.
అలా రాజకీయాన్ని నడిపించిన ఆ ఇద్దరూ అనకాపల్లికి చెందిన మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ. ఈ ఇద్దరూ వైసీపీలో పనిచేసిన వారే కావడం విశేషం. ఈ ఇద్దరూ వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాధ్ తో కూడా పనిచేశారు. అయితే గుడివాడతో ఇద్దరికీ పొసిగేది కాదు. 2014 ప్రాంతంలో అలా కుదరక కొణతాల రామక్రిష్ణ వైసీపీ నుంచి తప్పుకున్నారు.
అలాగే 2024 ఎన్నికలకు ముందు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీ నుంచి తప్పుకున్నారు. ఈ ఇద్దరూ ఇపుడు టీడీపీ కూటమిలో సర్దుకున్నారు. కొణతాల జనసేనలో ఉంటే దాడి తన సొంత గూడు అయిన టీడీపీలోకి వచ్చారు. అనకాపల్లి నుంచి కొణతాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తూంటే దాడి మద్దతు అవసరం అయింది.
దాంతో దాడి ఇంటికి కొణతాల వచ్చారు. ఈ ఇద్దరూ అలా దశాబ్దాల తరువాత కలుసుకున్నారు. పాత వైరానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. దీని మీద గుడివాడ మాట్లాడుతూ తానే ఈ ఇద్దరు రాజకీయ ప్రత్యర్ధులను కలిపాను అని అన్నారు. ఒక విధంగా వారు తనకు ధన్యవాదాలు చెప్పుకోవాలని తన ఫోటో వారి ఇంట్లో ఉండాలని చమత్కరించారు.
ఇద్దరికీ విభేదాలు ఉన్నకారణంగా వైసీపీ మీద కసితో వారిద్దరు అవన్నీ మరచి చేతులు కలిపారు అంటే తన మీద వ్యతిరేకత వారిని ఒక్కటి చేసింది అని గుడివాడ అంటున్నారు. అనకాపల్లికి వలస వచ్చిన సీఎం రమేష్ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారని ఆయన పార్టీ గుర్తు పువ్వు అని గుడివాడ అంటూ జూన్ 4న ఫలితాలు వచ్చాక చెవిలో పువ్వు పెట్టుకుని రమేష్ అనకాపల్లి నుంచి వెళ్ళిపోవాల్సిందే అని జోస్యం చెప్పారు.