టీడీపీలో సీనియర్ నేతలకు విలువ క్రమంగా తగ్గుతోందన్నది వాస్తవం. సుదీర్ఘ కాలంగా పార్టీలో ఉన్నారనే కారణంతో కొందరికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు. ఇలా పదవి పొందిన సీనియర్ నేతల్లో తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్ ఒకరు. రెండో దఫా నామినేటెడ్ జాబితాలో ఆయనకు ఏపీ యాదవ సంక్షేమ, అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి దక్కింది. గత నవంబర్‌లో రెండో జాబితా వచ్చిన సంగతి తెలిసిందే.
పదవి దక్కిన దాదాపు ఐదు నెలలకు నరసింహయాదవ్ ఇవాళ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేవలం తనను ఒక కులానికి పరిమితం చేశారని ఆయన అలకబూనారు. అలిగి పదవి చేపట్టకుండా భీష్మించుకుని కూచుంటే, సీఎం చంద్రబాబు బుజ్జగించి మరో మంచి పదవి ఇస్తారని ఆయన ఆశించారు. అయితే ఐదు నెలలు అవుతున్నా పదవీ బాధ్యతలు చేపట్టకపోవడంతో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలోని టీడీపీ నాయకత్వంపై ఆయనపై సీరియస్ అయినట్టు విశ్వసనీయ సమాచారం.
బాధ్యతలు చేపట్టకపోతే, మరొకరికి ఆ పదవి ఇస్తామని నరసింహయాదవ్‌ను హెచ్చరించినట్టు తెలిసింది. దీంతో ఎట్టకేలకు నరసింహయాదవ్ దిగొచ్చారు. పదవీ బాధ్యతలు చేపట్టడానికి ముహూర్తం ఖరారు చేశారు. నరసింహయాదవ్‌కు తిరుపతిలో పట్టుమని పది ఓట్లు లేవని లోకేశ్‌కు తెలుసని, ఆయనకు ఆ పదవి ఇవ్వడమే ఎక్కువని యువ నాయకుడి వర్గం అంటోంది. పేరు చివర్లో కులం తెలిసేలా పెట్టుకుని, పదవి ఇస్తే మాత్రం అలకబూనడం ఏంటని లోకేశ్ టీమ్ నిలదీస్తోంది.
నరసింహయాదవ్ పసుపు చొక్కా వేసుకోవడం తప్ప, ఎవరినైనా ప్రభావితం చేయగలిగే పరిస్థితి వుందా? అని టీడీపీలోనే ఒక వర్గం ప్రశ్నిస్తోంది. పార్టీని అడ్డుపెట్టుకుని తుడా చైర్మన్ పదవిని గతంలో పొందారని, ఇంకా తెల్ల ఏనుగులాంటి ఇలాంటి వాళ్లను మోయడానికి లోకేశ్ సిద్ధంగా లేరని ఆయన అనుచరులు స్పష్టం చేస్తున్నారు. ఇంతకాలం చంద్రబాబు దగ్గర వీళ్ల ఆటలు సాగాయని, ఇకపై అలా వుండదని స్పష్టం చేస్తున్నారు.