సూది మోపే సందు ఇస్తే.. గునపం దించాలనుకుంటున్నారే!

బార్ లైసెన్సులు తగ్గించుకున్నట్టే.. ఎన్నెన్ని గొంతెమ్మ కోరికలైనా కోరవచ్చునని ఈ స్టార్ హోటళ్ల యజమానులు ఫిక్సయినట్టుగా కనిపిస్తోంది.

చంద్రబాబునాయుడు ప్రభుత్వం.. రివర్స్ రాబిన్ హుడ్ తరహాలో వ్యవహరిస్తున్నదా అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. కాకులను కొట్టి గద్దలకు ఆహారంగా వేసే విధానం ఎంచుకుంటున్నదా అనిపిస్తోంది? ఎందుకంటే.. ఒకవైపు మద్యం దుకాణాలు, బార్లకు లైసెన్సు ఫీజులను భారీగా వసూలు చేస్తూ.. త్రీస్టార్ అంతకంటె పై స్థాయి హోటళ్లకు మాత్రం బార్ లైసెన్సు ఫీజును ఏడాదికి రూ.25 లక్షలకు తగ్గించడం అనేది ఇప్పుడు సర్వత్రా విమర్శలకు గురవుతోంది.

స్టార్ రేంజి హోటళ్లకు మాత్రం అప్పనంగా దోచుకోవడానికి అనుమతులు ఇచ్చినట్టుగా ప్రభుత్వం తీరు విమర్శల పాలవుతుండగా.. హోటల్ రంగంలోని సంఘం వాళ్లు.. ప్రభుత్వంనుంచి మరింతగా సదుపాయాలు కావాలంటూ.. ప్రజలను దోచుకోవడానికి నంగనాచి కబుర్లు చెబుతున్నారు. పోనీ పాపం అని సూదిమొన మోపడానికి వారికి సందు ఇస్తే.. గునపం దించేయడానికి వారు ప్లాన్ చేస్తున్నారనే అనిపిస్తోంది.

చంద్రబాబు ప్రభుత్వం స్టార్ హోటళ్ల బార్ లైసెన్సు ఫీజులను భారీగా తగ్గించింది. ఈ ఫీజులను కేవలం 25 లక్షలకు తగ్గించినందుకు హోటళ్ల అసోసియేషన్ చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ ఫీజులు తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో 10-12 లక్షలు, తెలంగాణలో రూ.40 లక్షలు ఉన్నాయని అంటూ ఏపీలో 25 లక్షలకు తగ్గించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

పొరుగున ఉన్న తెలంగాణలో రూ.40 లక్షలు ఉండగా.. ఎవరి కళ్లలో ఆనందం చూడడానికి చంద్రబాబునాయుడు ఏపీలో వీటిని రూ.25 లక్షలకు తగ్గించారో భగవంతుడికే తెలియాలి. ఇందుకోసం ఆ సంఘం వారు మాత్రం.. బాబుకు, పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు. దీనిద్వారా రాష్ట్రంలో 54 పెద్దస్థాయి హోటళ్లకు లాభం జరుగుతుంది. అంటే ఈ విధానం ద్వారా లాభం జరిగేది కేవలం బడాబాబులకు మాత్రమేనని గమనించాలి.

కాగా.. ప్రభుత్వం అడ్డగోలుగా ఈ సదుపాయం కల్పించగా.. హోటళ్ల యజమానులు ఇంకా తమ గొంతెమ్మ కోరికలను బయటపెడుతున్నారు. హోటళ్లకు కరెంటు చార్జీల్లో రాయితీ ఇవ్వాలట, ఆస్తి పన్ను తగ్గింపు వర్తింపజేయాలట.. సమస్యల్లేని ప్రాంతాల్లో రాత్రి 12 గంటల దాకా హోటళ్లు తెరుచుకునేలా అనుమతి ఇవ్వాలట, హోటళ్లలోని బార్లు అర్ధరాత్రి 2 గంటల దాకా తెరిచి ఉంచుకునేందుకు అనుమతి ఇవ్వాలట.. ఇలా తమ కోరికల చిట్టా విప్పుతున్నారు.

అక్కడికేదో ఈ స్టార్ హోటళ్ల యజమానులు ప్రజాసేవ చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. స్టార్ ముసుగులో ఉండే ఒక్కో సాధారణమైన గదిలో ఒకరోజు గడపడానికి నాలుగైదు వేల నుంచి పదివేల రూపాయల వరకు ముక్కుపిండి వసూలుచేసే ఈ హోటళ్ల వారు.. తమకు కరెంటు రాయితీలు కావాలనుకోవడం పెద్ద కామెడీగా ఉంది. వాటర్ బాటిల్ మీదగానీ, లిక్కరు మీదగానీ.. దాని ఎమ్మార్పీ ధరల కంటె.. అనేకానేక రెట్లు పెంచేసి అమ్ముతూ ఉండే ఈ హోటళ్లవారు రాయితీలు అడుగుతున్నారు.

చక్కెర కూడా మనల్ని కలుపుకోమని చెప్పే.. ఒక్కో కాఫీకి మూడునుంచి అయిదు వందల రూపాయల వరకు బిల్లు చేసేవారు.. కరెంటు బిల్లు రాయితీలు అడగడం చూస్తే ప్రజలు విస్తుపోతున్నారు. ప్రభుత్వంలో తాము పైరవీ చేసుకునే దారులు తెలిసినప్పుడు.. బార్ లైసెన్సులు తగ్గించుకున్నట్టే.. ఎన్నెన్ని గొంతెమ్మ కోరికలైనా కోరవచ్చునని ఈ స్టార్ హోటళ్ల యజమానులు ఫిక్సయినట్టుగా కనిపిస్తోంది.

8 Replies to “సూది మోపే సందు ఇస్తే.. గునపం దించాలనుకుంటున్నారే!”

  1. ఇదేదో చెత్త మీద పన్ను కంటే బాగానే ఉన్నట్లుందే.. వైజాగ్, విజయవాడ లో నైట్ లైఫ్ కీ ప్రయత్నం అనుకుంట

Comments are closed.