తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక నేపథ్యంలో చిత్తూరులో హైడ్రామా చోటు చేసుకుంది. చిత్తూరులో ఒక లాడ్జీలో 15 మంది వైసీపీ కార్పొరేటర్లు, వాళ్ల కుటుంబ సభ్యులతో ఉన్నారని తెలిసి… తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు మదన్, అలాగే టీడీపీ నేతలు జేబీ శ్రీనివాసులు, పులిగోరు మురళీధర్‌రెడ్డి తదితరులు గుండాలతో వెళ్లారు. ఇవాళ 11 గంటలకు జరిగే ఓటింగ్‌కు రాకుండా అడ్డుకునేందుకు చిత్తూరు లాడ్జీ నుంచి కదలకుండా చేయాలని కుట్ర చేశారు.
వీళ్ల కుట్రను పసిగట్టిన తిరుపతి వైసీపీ ఇన్‌చార్జ్ భూమన అభినయ్ రాత్రికి రాత్రే చిత్తూరు వెళ్లారు. కార్పొరేటర్ బస చేసిన ప్రతి హోటల్ గది బయట ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు మదన్, అలాగే టీడీపీ నాయకులు తమ రౌడీమూకలతో కాపలాగా కూచున్నారు. తెల్లవారుజామున రెండు గంటల సమయంలో అక్కడి నుంచి తిరుపతికి బయల్దేరాలని వైసీపీ కార్పొరేటర్లు అనుకున్నప్పటికీ జనసేన, టీడీపీ నేతలు అడ్డగించారు.
తెల్లవారుజామున రెండు గంటల సమయానికి హోటల్‌కు భూమన అభినయ్ చేరుకున్నారు. వైసీపీ కార్పొరేటర్లను తిరుపతికి తీసుకొచ్చేందుకు అభినయ్ తరలించే ప్రయత్నాన్ని జనసేన, టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో వాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఇది ఏ మాత్రం పద్ధతి కాదని అభినయ్ తీవ్ర స్వరంతో ఎమ్మెల్యే తనయుడిని, అతనికి అండగా వచ్చిన టీడీపీ నాయకుల్ని హెచ్చరించారు.
మహిళా కార్పొరేటర్లు, వాళ్ల పిల్లల్ని కూడా భయభ్రాంతులకు గురి చేయడం ఏంటని అభినయ్ నిలదీశారు. ఇలాంటి అడ్డగింతలను లెక్క చేసేది లేదని, మర్యాదగా తప్పుకోవాలని అభినయ్ హెచ్చరించారు. చివరికి జనసేన, టీడీపీ నాయకులను ధిక్కరించి, 15 మంది కార్పొరేటర్లను తిరుపతికి తరలించడం విశేషం. రెండురోజుల క్రితం వైసీపీ అభ్యర్థి శేఖర్‌రెడ్డి ఆస్తులపై బుల్డోజర్లను పంపి, ఆయన కుటుంబాన్ని తీవ్రంగా భయపెట్టి లొంగదీసుకున్న సంగతి తెలిసిందే. అయితే మరో అభ్యర్థిని బరిలో నిలబెట్టడాన్ని కూటమి నేతలు జీర్ణించుకోలేకపోయారు.
డిప్యూటీ మేయర్ స్థానాన్ని దక్కించుకోడానికి తగిన బలం లేదని తెలిసి కూడా, కేవలం బెదిరింపులు, ఆస్తులపై దాడులతో దారికి తెచ్చుకోవాలని టీడీపీ, జనసేన నేతలు ప్రయత్నించడం అడుగడుగునా కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. అసలు ఓటింగ్‌కు రాకుండా అడ్డుకునే ప్రయత్నాన్ని అభినయ్ నేతృత్వంలో ఎలాగోలా ఛేదించారు. ఓటింగ్ సమయానికి ఇంకెన్ని డ్రామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
వైసీపీ చేసిందే తిరిగి వస్తుంది . అదే కాల మహిమ..