నాలుగు కాదు… ఐదు పదవులు

తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ….ఇద్దరు రెడ్లు అలాగే ఉంటారు. కొత్తగా ముస్లింను యాడ్ చేశారు.

తెలంగాణ కేబినెట్ విస్తరణలో ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలో, ఎవరిని పక్కకు పెట్టాలో తెలియక కాంగ్రెసు అధిష్టానం ఇంకా తర్జభర్జన పడుతూనే ఉందని తెలుస్తోంది. అసలు ఖాళీగా ఉన్న ఆరు పదవులు ఒకేసారి భర్తీ చేయాలని హైకమాండ్ అనుకుంటోందని, కాదు ప్రస్తుతానికి ఐదు పదవులు భర్తీ చేయాలని అనుకుంటోందని సమాచారం. చివరకు ఐదు పదవులు భర్తీ చేసి ఒకటి ఖాళీగా ఉంచాలని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.

అసలు మొదట వచ్చిన సమాచారం ప్రకారం నాలుగు పదవులను నాలుగు సామాజికవర్గాలకు ఒక్కోటి ఇవ్వాలని అనుకున్నారు. బీసీ, ఎస్సీ, రెడ్డి, ముస్లిం సామాజికవర్గాలకు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. ఆ తరువాత వచ్చిన సమాచారం ప్రకారం రెడ్డి సామాజికవర్గానికి రెండు పదవులు ఇవ్వాలనుకున్నారు. దాంతో ముస్లిం సామాజికవర్గాన్ని కట్చేశారు. కాని తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ….ఇద్దరు రెడ్లు అలాగే ఉంటారు. కొత్తగా ముస్లింను యాడ్ చేశారు. అందుకని ఐదు పదవులు అయ్యాయి.

దీని ప్రకారం… ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి వివేక్, ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి ముదిరాజ్ కోటాలో వాకిటి శ్రీహరి, ముస్లిం కోటాలో ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్‌కు అవకాశం ఇస్తున్నారని తెలుస్తోంది. ఒక పదవి ఖాళీగా ఉంటుంది. ఆ ఒక్క పదవి కోసం కూడా పోటీ బాగానే ఉంది. మరి ఎవరికి ఇస్తారో తెలియదు. ఇక ఎస్టీ కోటాకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక రెడ్డి ఎమ్మెల్యేకు చీఫ్ విప్ ఇస్తారని అంటున్నారు. కాని ఆ జిల్లా ఎమ్మెల్యేలు మాత్రం తమకు మంత్రి పదవి కావాలంటున్నారు. ఆ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాశారు.

మరి ఆయన అభ్యర్థనను హైకమాండ్ ఎంతవరకు గౌరవిస్తుందో చెప్పలేం. కేబినెట్ విస్తరణలో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంగళవారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు లేఖ రాశారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్యేలకి మంత్రివర్గంలో చోటు కల్పించాలని లేఖలో కోరారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు ప్రయోజనమే కాకుండా, కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహద పడుతుందని పేర్కొన్నారు.