ఆయన కాంగ్రెసు పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. దాదాపు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఆయన సొంతం. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆయన గతంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూడుసార్లు మంత్రిగా పనిచేశారు. ఆయనే టి.జీవన్ రెడ్డి. ఆయన చాలాకాలంగా కాంగ్రెసు పార్టీపై అసంతృప్తిగా, కోపంగా ఉన్నారు. జీవన్ రెడ్డి తాజాగా తన అసంతృప్తిని, కోపాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు. అదిప్పుడు పార్టీలో చర్చనీయంశమైంది.
వేరే పార్టీకి చెందిన నాయకుడెవరైనా కాంగ్రెసు పార్టీలో చేరితే సంతోషించే పరిస్థితి. కానీ జీవన్ రెడ్డి ‘కాంగ్రెసు పార్టీలో ఏముందని ఇందులోకి వస్తున్నావు’ అని ప్రశ్నించారు. దీన్నిబట్టి ఆయన ఎంత అసంతృప్తిగా ఉన్నారో అర్థమవుతోంది. బీఎస్పీ నాయకుడు విజయ్ కాంగ్రెసు పార్టీలో చేరాడు. ఆయనకు అడ్లూరి లక్ష్మణ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెసు పార్టీలో ఏముందని ఇందులో చేరావని ప్రశ్నించారు. ‘నేనే బీఎస్పీలో చేరదామనుకుంటుంటే నువ్వే కాంగ్రెసు పార్టీలోకి వచ్చావు’ అన్నారు.
జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు గంగారెడ్డి హత్య జరిగినప్పటినుంచి ఆయన పార్టీ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అనుచరుడి హత్య జరిగిన తరువాత తాను ఇక కాంగ్రెసు పార్టీలో ఉండలేనని అన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా కార్యకర్తలకు భరోసా లేకుండా పోయిందని అన్నారు. ఇక పార్టీ ఫిరాయింపులను కూడా జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చకోకపోతే ప్రభుత్వం నడవదా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించవద్దని రాజీవ్ గాంధీ నుంచి రాహుల్ గాంధీ వరకు చెప్పారని, అయినా కాంగ్రెసు నాయకులు వినే పరిస్థితిలో లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తూ పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని హైకమాండే చెప్పిందని అన్నారు. ఆ ప్రకారమే తాము చేర్చుకున్నామని చెప్పారు. నిన్న గాక మొన్న వేరే పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వారికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఇకపై ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీ మారిన వారితోనే ప్రచారం చేయించుకోవాలని, వారే నియోజకవర్గ బరువు బాధ్యతలు మోయాలని ఎద్దేవా చేశారు. తాను ఎవ్వరికీ తలొగ్గను అని, తనపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు.
తాను పార్టీ కోసం ఎంతో త్యాగం చేశానని, ఎంతో కష్టపడ్డాను అని.. సొంత కష్టంపై ఇంత దాకా వచ్చిన వాడిని అన్నారు. అలాంటి తాను ఎన్నటికీ ఇంకొకరికి భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఏది తప్పో ఒప్పో బహిరంగంగా చెప్పే హక్కు తనకు ఉందని, తన భావాలను వ్యక్తీకరించే స్వేచ్చ ఎప్పటికీ ఉంటుందని, తన గొంతు నొక్కేయాలని చూడటం ఎవ్వరితరం కాదన్నారు. ఒక దశలో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. ఏది ఏమైనా కాంగ్రెసు పార్టీపై ఆయన అసంతృప్తి ఇప్పట్లో తగ్గకపోవచ్చేమో.