పెద్ద పదవి మీద జీవీఎల్ ఆశలు

జీవీఎల్ ని పెద్దల సభకు ఎంపిక చేయడానికి చూస్తున్నారని ప్రచారం సాగుతోంది.

కేంద్ర బీజేపీ అధినాయకత్వం తమకు విధేయులు అయిన వారికి పదవులు కట్టబెడుతోంది. పార్టీ బలపడాలన్నదే కమలం పార్టీ ఉద్దేశ్యం. అందుకోసం ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నేతలతో పాటు బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తోంది.

అందులో భాగమే సీనియర్ నేత సోము వీర్రాజుని ఎమ్మెల్సీగా చేసి శాసనమండలికి పంపించారు. ఆయన ఎంపిక మీద చాలా మంది కనుబొమ్మ‌లు తెరచి విస్మయం వ్యక్తం చేసినా బీజేపీ మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి ఇచ్చే ప్రాధాన్యత అదని తెలిసి తరువాత సర్దుకున్నారు.

ఇప్పుడు అలాంటి మరో కీలక నేతకు పదవి ఇవ్వాలని బీజేపీ ఆలోచిస్తోంది అని అంటున్నారు. విశాఖలో మకాం పెట్టి 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి నిర్ణయించుకున్న జీవీఎల్ నరసింహారావుకు పొత్తులలో భాగంగా చుక్కెదురు అయింది. కడప నుంచి వచ్చి అనకాపల్లిలో బీజేపీ తరఫున సీఎం రమేష్ పోటీ చేసి ఎంపీ అయ్యారు. కానీ విశాఖను నమ్ముకున్న జీవీఎల్ కు న్యాయం జరగలేదు.

అయితే జీవీఎల్ అంతకు ముందు యూపీ కోటాలో రాజ్యసభ మెంబర్ అయి ఆరేళ్ల పాటు పెద్దల సభలో రాణించారు. పార్టీ వాయిస్ ని మీడియా ముందు బలంగా వినిపించారు. కేంద్ర పెద్దలకు ఆయన సన్నిహితులు అని కూడా చెబుతారు.

ఇపుడు చూస్తే జీవీఎల్ ని కూడా సరైన పదవితో సమాదరించాలని కేంద్ర బీజేపీ నాయకత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు. ఏపీలో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఒక సీటు ఖాళీ అయింది. తొందరలో దానికి సంబంధించి నోటిఫికేషన్ రానుంది అని అంటున్నారు.

ఈ పోస్టుని బీజేపీ తీసుకుంటుంది అని అంటున్నారు. జీవీఎల్ ని పెద్దల సభకు ఎంపిక చేయడానికి చూస్తున్నారని ప్రచారం సాగుతోంది. విశాఖలో పార్టీ విస్తరణ ఏపీలో బీజేపీకి బలమైన వాణి ఉండాలన్న ఉద్దేశ్యంతో జీవీఎల్‌ని ఎంపిక చేస్తారు అని అంటున్నారు. ఈ పోస్టు విషయంలో ఎన్నో పేర్లు తెర మీదకు వస్తున్నా మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికే ఇవ్వాలన్నది ఆ పార్టీ పెద్దల ఆలోచనగా ఉందని అంటున్నారు. అదే కనుక నిజమైతే మళ్ళీ ఎంపీగా జీవీఎల్ పూర్వ వైభవాన్ని అందుకుంటారని అంటున్నారు.

6 Replies to “పెద్ద పదవి మీద జీవీఎల్ ఆశలు”

Comments are closed.