వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కంచుకోటలాంటి వైఎస్సార్ కడప జిల్లా టీడీపీలో వర్గపోరు తీవ్రమైంది. జగన్‌ను కట్టడి చేయాలంటే, మొట్టమొదట సొంత జిల్లాలో రాజకీయంగా కళ్లెం వేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆలోచన. ఆ పని జరగాలంటే టీడీపీ ఏకతాటిపై వుండాలి. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, టీడీపీలో వర్గపోరు తీవ్రమైంది. ఎంతగా అంటే… మహానాడు స్థల ఎంపికలో కూడా విభేదాలు కనపడ్డాయి.
ఈ దఫా మహానాడు కడపలో నిర్వహించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. కడపలో మూడు చోట్ల స్థలాలను పరిశీలించాలని అనుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాస్‌రెడ్డి రాజంపేట మార్గంలో ఒక స్థలాన్ని సూచించారు. మరికొందరు నేతలు యర్రగుంట్ల మార్గంలో విమానాశ్రయం ఎదురుగా స్థలమైతే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సవిత, రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తదితరులు విమానాశ్రయం ఎదురుగా స్థలాన్ని పరిశీలించారు.
ఆ స్థలమైతే వీఐపీల రాకపోకలకు బాగుంటుందని అనుకున్నారు. కానీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ససేమిరా అంటున్నారు. కనీసం వాళ్లతో కలిసి ఆ స్థలాన్ని పరిశీలించడానికి కూడా వెళ్లలేదంటే, టీడీపీలో వర్గవిభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయి అర్థం చేసుకోవచ్చు. బహుశా ఆ స్థలాన్ని సూచించిన కమలాపురం టీడీపీ నాయకులంటే గిట్టకపోవడం వల్లే శ్రీనివాస్‌రెడ్డి అటు వైపు వెళ్లలేదనే చర్చ జరుగుతోంది.
రెండు రోజుల క్రితం పులివెందుల టీడీపీ సర్వసభ్య సమావేశంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సవిత సమక్షంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ బీటెక్ రవి వర్గీయులు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డిపై దాడికి ప్రయత్నించడం గమనార్హం. పులివెందుల టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయి …నిత్యం ఏదో ఒక విషయమై గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పులివెందుట టీడీపీని వర్గ చిచ్చు దహించివేస్తోంది.
ప్రొద్దుటూరు టీడీపీలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, యువ నాయకుడు ప్రవీణ్‌రెడ్డి మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. తాజాగా సీఎం చంద్రబాబును ప్రవీణ్ కలిసి పార్టీ కోసం పని చేసిన వాళ్లకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని వినతిపత్రం సమర్పించారు. ప్రొద్దుటూరులో ప్రవీణ్ పనులేవీ జరగడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రవీణ్ అంటే అధికారులు వణికిపోయే పరిస్థితి. దీనికి కారణం… ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆదేశాలే.
జమ్మలమడుగులో బీజేపీ నుంచి ఆదినారాయణరెడ్డి గెలుపొందారు. ఆది అన్న కుమారుడు భూపేష్ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. తన పదవిని చిన్నాన్న లాక్కున్నారనే ఆవేదన భూపేష్‌లో వుందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ప్రతిదానికీ ఎమ్మెల్యే ఆదిని అడుక్కోవాల్సి వస్తోందని టీడీపీ వర్గీయులు ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. అయితే రక్త సంబంధీకులే కూటమి పార్టీల నుంచి నాయకత్వం వహిస్తుండడంతో ప్రస్తుతానికి గొడవలేవీ పైకి కనిపించడం లేదు.
కడప అసెంబ్లీలో టీడీపీ విభేదాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎమ్మెల్యే మాధవీరెడ్డి, సీనియర్ నేతల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలున్నాయి. మాధవీరెడ్డి ఒక వైపు, సీనియర్ నేతలు అలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి, నగర అధ్యక్షుడు కొండారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, పసుపులేటి హరిప్రసాద్ తదితరులంతా మరో వర్గంగా విడిపోయి కత్తులు దూసుకుంటున్నారు.
మైదుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కేవలం ఒక సామాజిక వర్గానికే మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆవేదన టీడీపీలోని మిగిలిన సామాజిక వర్గాల్లో తీవ్రంగా వుంది. ఇది ఆ పార్టీకి చేటు తీసుకురానుందనే అభిప్రాయాన్ని కొట్టి పారేయలేం.
కమలాపురం నియోజకవర్గంలో విభేదాలు లేవు కానీ, అసంతృఫ్తి తీవ్రంగా వుందని సమాచారం. ఇప్పటికే కమలాపురంలో రెండు, మూడు వేల ఓట్లను ప్రభావితం చేయగల ఓ నాయకుడు ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి దగ్గరికి వెళ్లలేదని తెలిసింది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో అతి జోక్యం, టీడీపీకి రాజకీయంగా నష్టం తీసుకొచ్చేలా వుందని సమాచారం. కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డితో పుత్తా నరసింహారెడ్డికి తీవ్ర విభేదాలున్నాయి. కడపలో మీ పెత్తనం ఏంటని మాధవీరెడ్డి అడ్డుపడుతుండడంతో విభేదాలు చాలా దూరమే వెళ్లాయి.
బద్వేలు నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జ్ రితీష్‌రెడ్డిని చంద్రబాబే కాస్త దూరం పెట్టారని టాక్. కూటమి సునామీలో కూడా పార్టీని బద్వేలులో గెలవలేకపోవడంపై బాబు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. ప్రస్తుతం వైఎస్సార్ కడప జిల్లా టీడీపీలో ఇదీ పరిస్థితి.
జాయిన్ అవ్వాలి అంటే