రేవంత్​ వ్యతిరేక ప్రచారమే వారి ఉగాది పంచాంగశ్రవణం

రేవంత్​ రెడ్డికి వ్యతిరేకంగా బీఆర్​ఎస్​ చేస్తున్న ప్రచారమే సిద్ధాంతిగారు పంచాంగ శ్రవణం రూపంలో చెప్పారు

ఉగాది రోజు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీ, ప్రతిపక్షాలు నిర్వహించే పంచాగశ్రవణాలు పూర్తిగా రాజకీయ పంచాంగ శ్రవణాలే కదా. పంచాగ శ్రవణం చేసే పండితులు ఏ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీకి అనుకూలంగా, వారు ఖుషీ అయ్యేటట్లుగా పంచాంగ శ్రవణం చేస్తారు. ఇది దశాబ్దాలుగా జరుగుతున్నదేనని మనకందరికీ తెలుసు. పంచాగం చెప్పేవారికీ తెలుసు, పార్టీ నాయకత్వానికీ, నాయకులకు, కార్యకర్తలకు తెలుసు. ‘తెలిసీ వలచీ విలపించుటలో తియ్యదనం ఎవరికి తెలుసు’ అన్నట్లుగా అది నిజమైన పంచాగశ్రవణం కాదని తెలిసి కూడా నాయకులు సంతోషపడుతుంటారు.

ఈ ఉగాదికి జరిగినవి కూడా అలాంటి పంచాంగ శ్రవణాలే. కాంగ్రెసు కార్యాలయం గాంధీభవన్​లో, బీజేపీ కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకలను అంటే పంచాంగ శ్రవణాలను అలా పక్కన ఉంచుదాం. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం, కాంగ్రెసుకు బద్ధ శత్రువు అయిన బీఆర్​ఎస్​ కార్యాలయంలో జరిగిన పంచాంగ శ్రవణం సంగతి చూద్దాం. కేసీఆర్​ అసెంబ్లీకి వెళ్లడంలేదు. కనీసం తన పార్టీ కార్యాలయంలో జరిగిన ఉగాది ఉత్సవాలకు కూడా హాజరుకాలేదు. అయినప్పటికీ ఆయన సంతోషించే విధంగా రాజేశ్వర సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు. మరి కుమారుడు కేటీఆర్​, ఇతర నాయకులు కూడా హాజరయ్యారు కదా. పార్టీకి వ్యతిరేకంగా చెప్పకూడదు కదా.

కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి కేసీఆర్​, కేటీఆర్​, హ‌రీశ్ రావు, కవిత, ఇతర బీఆర్​ఎస్​ నాయకులు చెబుతున్న మాటలనే పంచాంగ శ్రవణంలో చెప్పారు. వాళ్లు ఏం ప్రచారం చేస్తున్నారు? వచ్చేది కేసీఆర్​ ప్రభుత్వమే అంటున్నారు కదా. రేవంత్​ రెడ్డి అయిదేళ్లు ఉండడని, ఎప్పుడైనా అధిష్టానం ఆయన్ని పీకేయవచ్చని అంటున్నారు కదా. పంతులుగారు కూడా అదే చెప్పారు. శ్రీరాముని జాతకం ఉన్న ఉచ్చస్థితి.. మాజీ సీఎం కేసీఆర్‌ జాతకంలో ఉందని సిద్ధాంతిగారు చెప్పారు. ఈ ఏడాది ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని, తెలంగాణ ప్రజలు ఏ విధమైన ప్రజాపాలన కోరుకుంటున్నారో.. తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రిగా పట్టం కట్టడానికి అవకాశం ఉన్న సంవత్సరం ఇదని చెప్పుకొచ్చారు.

కేసీఆర్ రాశీ ఫలాల్లో రాహువు అష్టమంలో ఉన్నప్పటికి అమ్మవారు, నరసింహ స్వామి అనుగ్రహం ఉందన్నారు. రేవంత్​ రెడ్డికి పదవీ గండం ఉందన్నారు. మంత్రుల మధ్య విభేదాలు వచ్చి అవి తారస్థాయికి చేరుతాయని, దీంతో ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడుతుందని అన్నారు. బీఆర్​ఎస్​ నాయకులు కూడా ఇదే ప్రచారం చేస్తున్నారు కదా. మే 14 తరువాత పదవీ గండం ఉంది కాబట్టే రేవంత్​ రెడ్డి జాగ్రత్తగా ఉండాలట. ఇక వార్డు సభ్యుడి ఎన్నిక దగ్గర నుంచి ఎమ్మెల్యే ఎన్నికల వరకు ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్​ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు.

ఇక ఈ ఏడాది వానలు మరీ ఎక్కువగా కురిసి పంటలు నష్టపోయి రైతులు ఇబ్బందులు పడతారని చెప్పారు. ఇప్పటికే రేవంత్​ రెడ్డి పాలనలో కరువొచ్చిందని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ వారు ప్రచారం చేస్తున్నారు. పంచాంగ శ్రవణంలోనేమో అధికంగా వానలు కురిసి రైతులు నష్టపోతారని చెప్పారు. అంటే కామ‌న్ పాయింట్​ రైతులు నష్టపోవడమే. ప్రభుత్వ పథకాలు సరిగా అమలు కావని చెప్పారు. మొత్తం మీద రేవంత్​ రెడ్డికి వ్యతిరేకంగా బీఆర్​ఎస్​ చేస్తున్న ప్రచారమే సిద్ధాంతిగారు పంచాంగ శ్రవణం రూపంలో చెప్పారు. అంతేతప్ప కొత్త విషయాలు ఏమీలేవు.

2 Replies to “రేవంత్​ వ్యతిరేక ప్రచారమే వారి ఉగాది పంచాంగశ్రవణం”

  1. మన అన్న శ్రీ కృష్ణదేవరాయల కటింగ్ కన్నా ఇదేమి ఎక్కువ కాదు లే…

Comments are closed.