టాలీవుడ్‌కు బీఆర్​ఎస్​ ఫుల్​ సపోర్ట్​ 

కాంగ్రెసు ప్రభుత్వం వచ్చాక రేవంత్​ రెడ్డికి సినిమా పరిశ్రమతో పడటంలేదనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది.

రేవంత్​ రెడ్డి ప్రభుత్వాన్ని ఎంతలా బద్నాం చేయాలో అంతలా బద్నాం చేయడానికి బీఆర్​ఎస్​ పార్టీ పరంగా, తన సొంత మీడియా పరంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన పత్రికలో పేజీలకు పేజీల కథనాలు రాసిపడేస్తోంది. బీఆర్​ఎస్​ ప్రతిపక్షం కదా. సహజంగానే తన చేతిలోని ఆయుధాన్ని ఉపయోగించుకుంటోంది.

ఈ క్రమంలోనే తెలుగు సినిమా పరిశ్రమకు పూర్తిగా మద్దతుగా నిలిచింది. కేసీఆర్​ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగు సినిమా పరిశ్రమకు మద్దతుగానే ఉన్నారు. ముఖ్యంగా కేటీఆర్‌తో సినీ పరిశ్రమకు మంచి సంబంధాలు ఉన్నాయి. తరచుగా సినిమా ఫంక్షన్లకు అటెండ్​ అవుతూ ఉండేవాడు. సినిమా సెలబ్రీటీలతో సరదాగా మాట్లాడేవాడు.

కాని కాంగ్రెసు ప్రభుత్వం వచ్చాక రేవంత్​ రెడ్డికి సినిమా పరిశ్రమతో పడటంలేదనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. హీరోలుగాని, సినిమా పరిశ్రమలోని ఇతర రంగాల్లోని ప్రముఖులు కూడా రేవంత్​ రెడ్డితో అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు. ఈ నేపధ్యంలోనే ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమను టార్గెట్​ చేసిందని, టాలీవుడ్​ తన భవిష్యత్తుపై తీవ్రంగా భయపడుతోందని పెద్ద కథనం రాసింది.

ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తెలుగు సినిమా పరిశ్రమను వేధిస్తోందని రాసింది. బీఆర్​ఎస్​ పాలనలోనే తెలుగు సినిమా పరిశ్రమ బాగుందనేది ఆ కథనం సారాంశం. ఆ కథనం సారంశం ఏమిటంటే…హీరో నాగార్జున ఎన్​ కన్వెన్షన్​ కూల్చవేసి ప్రభుత్వం సినిమా పరిశ్రమకు గట్టి వార్నింగ్​ ఇచ్చింది. జ‌గ‌న్‌తో నాగార్జునకు ఉన్న సాన్నిహిత్యం కారణంగానే చంద్రబాబు ఆదేశాల మేరకు ఎన్​ కన్వెన్షన్​ కూల్చివేశారు.

నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసింది. అప్పుడు సినిమా పరిశ్రమ మొత్తం నాగార్జునకు అండగా నిలిచింది. సినిమా పరిశ్రమ ఐక్యత రేవంత్​ రెడ్డికి కంటగింపుగా మారింది. సంధ్య థియేటర్​ ఘటనలో అల్లు అర్జున్​ను వేధించడానికి, అరెస్టు చేయడానికి కారణం సినిమాకు సంబంధించిన ప్రెస్​మీట్​లో అల్లు అర్జున్​ రేవంత్​ రెడ్డి పేరు మర్చిపోవడమే.

అసలు తొక్కిసలాట జరిగి మహిళ చనిపోయిన ఘటనలో అల్లు అర్జున్​ ప్రమేయం ఏమీ లేదు. ఇలాంటి ఘటనల్లో సినిమా హీరోను అరెస్టు చేసిన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవు. ఆ తరువాత సినిమా పరిశ్రమతో రేవంత్​ రెడ్డికి సెటిల్​మెంట్​ కుదరడంతో సంధ్య థియేటర్​ ఘటన సమసిపోయింది. సంధ్య థియేటర్​ ఘటన తరువాత ప్రభుత్వం సినిమా రంగం మీద ఆంక్షలు విధించింది. బెనిఫిట్​ షోలకు అనుమతులు రద్దు చేసింది. ఇలాంటిది గతంలో ఎన్నడూ లేదు.

ప్రభుత్వ వైఖరి సినిమా పరిశ్రమకు ఇబ్బందిగా మారింది. పాటల్లో అసభ్య డ్యాన్స్​ స్టెప్పులపై మహిళా కమిషన్​ తాజా హెచ్చరికను కూడా కథనం ప్రస్తావించింది. ఈ విషయంలో మహిళా కమిషన్​కు సంబంధం లేదని, అలాంటి విషయాలు సెన్సార్​ బోర్డు చూసుకుంటుందని పేర్కొంది. మహిళా కమిషన్​ సినిమా పరిశ్రమకు వార్నింగ్​ ఇవ్వడం ఇది తొలిసారని, గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని పేర్కొంది. సినిమా పరిశ్రమను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వేధిస్తోందని, కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోందని బీఆర్​ఎస్​ మీడియా స్పష్టం చేసింది.

4 Replies to “టాలీవుడ్‌కు బీఆర్​ఎస్​ ఫుల్​ సపోర్ట్​ ”

Comments are closed.