మంత్రి పదవి మిస్సయినందుకు మరో కాంగ్రెసు ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశాడు. అనవసరంగా బీజేపీ నుంచి కాంగ్రెసులోకి వచ్చానని అర్థం వచ్చేలా మాట్లాడాడు. బీజేపీలోనే ఉంటే కేంద్రంలో మంత్రిని అయ్యేవాడినని అన్నాడు. ఆయనే చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్. తెలంగాణ కేబినెట్ విస్తరణ నిరవధికంగా వాయిదా పడటంతో మంత్రి పదవులు గ్యారంటీగా వస్తాయనుకున్న ఎమ్మెల్యేలు, విస్తరణ కోసం తయారుచేసిన జాబితాలో పేర్లు ఉన్నవారు, మంత్రి పదవులు ఇస్తామంటూ అధిష్టానం, రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చిన వారు తీవ్రంగా నిరాశ పడ్డారు. ఇంకా పడుతూనే ఉన్నారు.
ఆ నిరాశను, కోపాన్ని బహిరంగంగానే బయటకు వెళ్లగక్కుతున్నారు. మీడియా సమావేశాలు పెట్టి మరీ ఆగ్రహిస్తున్నారు. ఏప్రిల్ మొదటివారంలో మంత్రివర్గ విస్తరణ జరపాలని అనుకున్నప్పుడే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తిరుగుబాటు స్వరం వినిపించాడు. అప్పట్లో ఆయనకు మంత్రి పదవి కాకుండా డిప్యూటీ స్పీకరో, చీఫ్‌విప్ పదవో ఇవ్వాలనుకున్నారు. కాని ఆయన అందుకు ఒప్పుకోలేదు. అప్పట్లో భర్తీ చేయాలనుకున్న నాలుగు పదవులకు ప్రధానంగా రెడ్డి సామాజికవర్గం నుంచి ఎక్కువమంది పోటీపడ్డారు. దీంతో మల్రెడ్డి రంగారెడ్డిని పక్కకు పెట్టారు. దీంతో ఆయన ఆగ్రహించి తన సామాజికవర్గమే అడ్డు అనుకుంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మంత్రి పదవి ఇచ్చే సామాజికవర్గాన్ని గెలిపిస్తానని చెప్పాడు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో రంగారెడ్డి జిల్లాకు కేబినెట్లో ప్రాధాన్యం ఇవ్వాలని జానారెడ్ది అధిష్టానానికి లేఖ రాశాడు. దాని తరువాతే విస్తరణ ఆగిపోయింది. దీంతో పదవులు ఆశించినవారు కుతకుతలాడిపోతున్నారు.
జానారెడ్డి వల్లనే తనకు మంత్రి పదవి రాలేదని కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి ఈమధ్య బహిరంగంగానే ధ్వజమెత్తాడు. ఆయన కామెంట్స్ కాక తగ్గకముందే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే సహించనని అన్నాడు. ఓ కుటుంబం (గడ్డం వెంకటస్వామి కుటుంబం) తన గొంతు కోస్తోందని ఆగ్రహించాడు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలోనే తన కోపాన్ని వెళ్లగక్కాడు. విస్తరణ లిస్టులో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ పేరు కూడా ఉంది. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలనుకోవడంపై మాదిగ సామాజికవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
తాజాగా ఆయన తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశాడు. వివేక్‌కు కూడా పార్టీలు మారిన చరిత్ర ఉంది. ఈయన మొదట్లో కాంగ్రెసులో ఉండి, తరువాత టీఆర్ఎస్లోకి వెళ్లాడు. ఆ తరువాత బీజేపీలో చేరాడు. గత ఎన్నికల ముందు కాంగ్రెసులో చేరి చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయనకు మంత్రి ఇస్తామని అధిష్టానం, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో మాట్లాడుతూ ‘నేను బీజేపీలోనే ఉంటే కేంద్ర మంత్రి అయ్యేవాడిని’ అన్నాడు.
అంటే కాంగ్రెసులోకి అనవసరంగా వచ్చానని బాధపడతున్నట్లుగా ఉంది. రేవంత్ రెడ్డి కాంగ్రెసులోకి రమ్మంటేనే తాను వచ్చానని చెప్పాడు. అంటే వివేక్ ఆయనై ఆయన కాంగ్రెసులో చేరలేదన్నమాట. ఆహ్వానిస్తేనే వచ్చాడు కాబట్టి మంత్రి పదవి ఇస్తానని రేవంత్ హామీ ఇచ్చాడు. అందుకే విస్తరణ లిస్టులో కూడా వివేక్ పేరు ఉంది. కాని మాదిగ సామాజికవర్గం వ్యతిరేకించింది. ఇంకాఎంతమంది అసంతృప్తులు బయటకు వస్తారో చూడాలి.
All these people are here to earn money, enjoy posts and take care of their businesses. Not even 1% for serving people.
No one here in telugu states to serve the people except Jagan mamiya:)