హరీష్‌కున్న విచక్షణ కేటీఆర్ కు లేదా?

కొండా సురేఖ మీద అత్యంత అసహ్యకరమైన రీతిలో లేకిగా అనుచితమైన ట్రోలింగ్ జరిగింది. మంత్రి కొండా సురేఖ పర్యటనలో స్థానిక ఎంపీ రఘునందన్ రావు.. చేనేత కార్మికులు తయారు చేసిన నూలు మాలను ఆమెకు…

కొండా సురేఖ మీద అత్యంత అసహ్యకరమైన రీతిలో లేకిగా అనుచితమైన ట్రోలింగ్ జరిగింది. మంత్రి కొండా సురేఖ పర్యటనలో స్థానిక ఎంపీ రఘునందన్ రావు.. చేనేత కార్మికులు తయారు చేసిన నూలు మాలను ఆమెకు వేస్తే.. ఆ ఫోటోను ట్రోల్ చేస్తూ అసహ్యకరమైన ట్రోలింగ్ చేశారు. ఇలాంటి వాటిని ఖచ్చితంగా ఖండించాలి. ఈ ట్రోల్స్ ను పుట్టించిన వారిని గుర్తించి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి.

ఇలాంటి అసహ్యకరమైన ట్రోల్స్ ను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎవ్వరికైనా అలాంటి పరిస్థితి తప్పదు. ట్రోలర్స్ హద్దుమీరుతున్నారనడానికి ఇది నిదర్శనం.

ట్రోల్ కు గురైనది కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి గనుక.. సహజంగానే అందరి దృష్టి భారత రాష్ట్ర సమితి బృందాల మీదకు వెళుతుంది. సురేఖ కూడా తన మీద ట్రోల్స్ కు కారణం బీఆర్ఎస్ అని నిందిస్తున్నారు. ఈ విషయం ఇంకా ఖరారు కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రోల్ ను ఎవరు పుట్టించినా.. నింద బీఆర్ఎస్ భరించాల్సి రావడం సహజం.

ఆ తర్వాతి పరిణామాలే చిత్రంగా కనిపిస్తున్నాయి. కొండాసురేఖ కంటతడి పెట్టుకోవడంపై బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఆమెకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్టుగా హరీష్ రావు ట్వీట్ చేయడం విశేషం.

హరీష్ రావు ట్వీట్ ఇలా సాగిపోయింది. ‘‘మహిళలను గౌరవించడం మనందరి బాధ్యత. వారి పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఏ ఒక్కరూ సహించరు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అయినా, వ్యక్తిగతంగా నేనైనా ఉపేక్షించబోము. మీకు (కొండా సురేఖకు) కలిగిన అసౌకర్యానికి మీతో పాటు నేనూ చింతిస్తున్నాను. సోషల్ మీడియా వేదికగా జరిగే ఇలాంటి వికృత చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్నాను. సోషల్ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలని అందరిని కోరుతున్నాను.’’

అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ ఏంటంటే.. హరీష్ రావుకు ఉన్న విచక్షణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎందుకు లేకుండా పోయింది. తప్పు తమ పార్టీ వారిదే అని తేలితే వారు సారీ చెప్పాలి. తేలకపోయినా సరే.. ఇలాంటి పరిస్థితి ఒక మహిళా నాయకురాలికి ఎదురైనప్పుడు.. హరీష్ తరహాలో సానుభూతి వ్యక్తం చేయడం, కనీస ధర్మం కదా అనే భావన ప్రజల్లో వ్యక్తం అవుతోంది. కేటీఆర్ మౌనం పాటించే కొద్దీ.. ఆయనకు కనీస సామాజిక స్పృహ కూడా లేదనే విమర్శలు వస్తున్నాయి. పైగా హరీష్ ఈ సానుభూతి వ్యక్తీకరణతో మార్కులు కొట్టేశారు.

ఇందులో కూడా ట్విస్టు ఏంటంటే.. హరీష్ రావు తాను కూడా చింతిస్తున్నానని, ఖండిస్తున్నానని అన్నారే తప్ప.. ట్రోలర్స్ ను కనిపెట్టి కఠినంగా శిక్షించాలని అనలేదు. దీని వెనుక ఉన్నది ఎవరో బయటకు రాబట్టాలని డిమాండ్ చేయలేదు. ఈ పోకడ చూస్తే.. భారాసకు దాంతో సంబంధం ఉందని ప్రజలు అనుమానించడంలో తప్పేముంది.

7 Replies to “హరీష్‌కున్న విచక్షణ కేటీఆర్ కు లేదా?”

Comments are closed.