దక్షిణాది రాష్ట్రాలలో ఒక్క తమిళనాడులో మాత్రం- తమ పార్టీ అస్తిత్వాన్ని కనీసం మాత్రంగానైనా నిరూపించుకోవడంలో భారతీయ జనతా పార్టీ విఫలం అవుతూనే వస్తున్నది. కర్ణాటకలో అధికారంలోకి కూడా రాగలిగే, ప్రధాన ప్రతిపక్షంగా ఉండగలిగే స్థితిలో ఆ పార్టీ ఉంది.
తెలంగాణ, కేరళల్లో పరవాలేదు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కూటమి పుణ్యమా అని వారికి కొన్ని సీట్లు దొరికాయి. కానీ తమిళనాడులో ఎంత తలకిందులుగా తపస్సు చేస్తున్నా వారు కనీసంగానైనా బలం చూపించలేకపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో తమిళనాడు లో బలం కోసం కోసం అనేక మెట్లు దిగివచ్చిన బిజెపి పాత నిర్ణయాన్ని సరికొత్తగా తీసుకుంది. అయితే ఒకసారి ఫలించని ఈ ప్రయోగం ఈసారి వారికి ప్రయోజనం చేకూరుస్తుందా అనే అనుమానం ప్రజలలో ఉంది.
దక్షిణాది రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీకి కొరకరాని కొయ్యగా తయారైనది తమిళనాడు మాత్రమే. ఇలాంటి నేపథ్యంలో వారు అక్కడ రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అన్నాడీఎంకేతో జట్టు కట్టి ఎన్నికల బరిలోకి వెళ్లినప్పటికీ స్టాలిన్ ధాటికి తాళలేకపోయారు. ఆ తర్వాత ఆ పార్టీల మధ్య మైత్రీ బంధం బెడిసికొట్టింది కానీ వచ్చే ఎడారి శాసనసభ ఎన్నికలు జరగనున్న ఈ రాష్ట్రంలో మళ్లీ ప్రయోగాలకు శ్రీకారం దిద్దింది బిజెపి.
అన్నాడీఎంకేతో పొత్తు కోసం చాలా కాలం ముందు నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. పార్టీలో ఈ సంకేతాలు రావడంతో అన్నాడీఎంకే ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తన పదవికి రాజీనామా కూడా చేశారు.కొన్ని వారాల తర్వాత తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమిళ రాజకీయాలలో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని తమ పార్టీ ముందుకు వెళ్ళబోతున్నట్లుగా ప్రకటించారు. అదే సమాయానికి నైనార్ నాగేంద్రన్ ను పార్టీకి కొత్త అధ్యక్షుడిగా ప్రకటించారు.
నైనార్ నాగేంద్రన్ పార్టీ అధ్యక్షుడు కావడం అన్నా డీఏంకేతో మైత్రి బంధాన్ని దృఢంగా ముందుకు తీసుకువెళ్లడం కోసమే అనే వాదనలు రాష్ట్రంలో వినిపిస్తున్నాయి. పైగా ఆయన కోసం పార్టీ నియమాలను కూడా బిజెపి మార్పులు చేసుకుంది. రాష్ట్ర చీఫ్ గా నియమితులు కావాలంటే పార్టీలో పదేళ్లపాటు ప్రాథమిక సభ్యత్వం కలిగి ఉండాలనే నిబంధన వారికి ఉంది. అయితే నైనార్ నాగేంద్రన్ కు పార్టీలో అంత సీనియారిటీ లేదు. ఆ నిబంధనను పక్కనపెట్టి మరి ఆయనకు అధ్యక్ష హోదా కట్టబెట్టారు.
ఇన్ని మెట్లు దిగివచ్చిన తర్వాతనైనా భారతీయ జనతా పార్టీ తమిళనాడులో తమ ఆస్తిత్వం ప్రదర్శిస్తుందా లేదా అనేది సందేహంగానే ఉంది. డీఎంకే అధినేత స్టాలిన్ కేవలం తమిళనాడులో రాజకీయ ఆధిపత్యం చూపించడం మాత్రమే కాకుండా, జాతీయ స్థాయిలో కూడా బిజెపికి కొరకరాని కొయ్యగా మారుతున్నారు.
హిందీ వ్యతిరేక ఉద్యమం దగ్గర నుంచి, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కేంద్రం వేస్తున్న అడుగులకు వ్యతిరేకంగా గళం విప్పడం ద్వారా ఆయన దక్షిణాది రాష్ట్రాలని ఏకంచేస్తూ భారతీయ జనతా పార్టీకి కొత్త తలనొప్పులు క్రియేట్ చేస్తున్నారు. ఆ రాష్ట్రంలో డీఎంకే ఆధిపత్యానికి గండి కొట్టాలని బిజెపి తపన పడటం ఆశ్చర్యకరం కాదు. కానీ అందులో సక్సెస్ అవుతుందా లేదా తేలడానికి వచ్చే ఏడాది ఎన్నికల వరకు వేచి చూడాలి.
Mari purandheshwari Kuda 10 years primary membership ledhuga