కేసీఆర్ కూతురు ధిక్కార ఉద్యమం!

కొత్త తెలంగాణ తల్లిపై గులాబీ పార్టీలో ఆగ్రహం ఇంకా చల్లారలేదు. తాజాగా కవిత ఫైర్ అయ్యింది.

కొత్త తెలంగాణ తల్లిపై గులాబీ పార్టీలో ఆగ్రహం ఇంకా చల్లారలేదు. తాజాగా కవిత ఫైర్ అయ్యింది. కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి బలవంతంగా ప్రజలపై రుద్దాడని చెప్పింది. తెలంగాణ తల్లి రూపాన్ని ఇష్టారాజ్యంగా మార్చడమే కాకుండా, ఎవరైనా ఇదే విగ్రహం పెట్టాలంటూ, లేకపోతే కేసులు పెడతామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

రేవంత్ రెడ్డి చెప్పిన దాన్ని ఆమె ధిక్కరించాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ఎన్ని జీవోలు ఇచ్చినా, ఉద్యమ స్ఫూర్తితో పాత తెలంగాణ తల్లి విగ్రహాలను ఊరూరా పెడతామని అన్నారు. తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం చేపడతామని చెప్పారు. వేల సంఖ్యలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు.

కొత్త తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేకపోవడాన్ని కూడా ఆమె తప్పుబట్టింది. తెలంగాణలో బతుకమ్మ పండుగ తరతరాలుగా ఉన్నప్పటికీ, తెలంగాణ ఉద్యమంలో దాన్ని బాగా ప్రజాదరణ పొందేలా చేసింది మాత్రం కవిత అని చెప్పొచ్చు. విదేశాల్లో కూడా బతుకమ్మ పండుగను ఆడించిన ఘనత ఆమె సొంతం. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించి, రాష్ట్రాన్ని సాధించారు.

ఆ ఉద్యమంలోనే పురుడు పోసుకుంది తెలంగాణ తల్లి విగ్రహం. గులాబీ పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో ఆ విగ్రహాన్ని స్థాపించారు. కొన్ని నగరాలు, పట్టణాల్లో కూడా పాత తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. కానీ కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్లలో సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టలేదు. దీన్ని రేవంత్ రెడ్డి క్యాష్ చేసుకున్నారు.

ఆగమేఘాల మీద అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన కేసీఆర్, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రం పెట్టకుండా పదవీకాలం గడిపేశారు. అదే ఆయన చేసిన పొరపాటు. ఇక కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యాక కొంతకాలం సైలెంటుగా ఉన్నప్పటికీ, మళ్లీ యాక్టివ్ అయ్యింది. కొద్దిరోజులుగా వాడీ వేడి విమర్శలతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది.

మళ్లీ జాగృతి మీద దృష్టి పెట్టింది. జిల్లాలవారీగా సమావేశాలు నిర్వహిస్తోంది. త్వరలోనే కొత్త కమిటీలను కూడా ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఆమె బీసీల మీద ఫోకస్ చేస్తున్నారు. బీసీ సంఘాల నేతలతో సమావేశాలు జరుపుతున్నారు. బీసీల హక్కుల కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేస్తానని చెప్పారు. అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

బీసీ కులగణన చేయాలని ఆమె పట్టుదలగా చెబుతున్నారు. రేవంత్ రెడ్డి తెచ్చిన కులగణనకు మద్దతు ఇచ్చిన కవిత, కొత్త తెలంగాణ తల్లిని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే ఒక ఉద్యమంలా పాత తెలంగాణ తల్లి విగ్రహాలను పెడతామని ఆమె పేర్కొన్నారు.

3 Replies to “కేసీఆర్ కూతురు ధిక్కార ఉద్యమం!”

Comments are closed.