కేసీఆర్ కూతురు కవిత బాగా యాక్టివ్ అయిపొయింది. ఈ మధ్య ప్రతీ విషయానికీ ఉద్యమం చేస్తామంటోంది. కొంతకాలం కొత్త తెలంగాణ తల్లిపై రచ్చ చేసింది. ఒక ఉద్యమంలా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాలను పెడతామంది. కొత్త తెలంగాణ తల్లి ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పింది.
ఇప్పుడు బీసీ రిజర్వేషన్లపై గళం విప్పింది. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ప్రకారం బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచాలని డిమాండు చేసింది. అలా పెంచకపొతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనివ్వబోమని చెప్పింది. బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం ఉద్యమం చేస్తామని సర్కారును హెచ్చరించింది.
కొత్త ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ప్రభుత్వం ఇంతవరకు బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ ఇవ్వలేదు. బీసీ రిజర్వేషన్లు పెంచుతామని గతంలో కామారెడ్డి డిక్లరేషన్ విడుదల చేసింది.
కానీ రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. రిజర్వేషన్లు పెంచాకనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, లేకుంటే ఎన్నికలు జరగనివ్వబోమని కవిత చెప్పింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నదని చెప్పింది.
బీసీల జనాభా ఎంతో తెలియకుండా హామీ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. జనాభాలో సగానికిపైగా బీసీలు ఉన్నారని చెప్పింది. కానీ 42 శాతం అని కాంగ్రెస్ ఎలా చెబుతుందో అంతుపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చాకా, బీసీ జనాభాను వెల్లడించిన తర్వాతే ఎన్నికలపై ఆలోచన చేయాలంది. అంత వరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదని చెప్పింది. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంది.
మండల కేంద్రాల్లో, జిల్లాల్లో నిరసన ప్రదర్శన చేస్తామన్నారు. సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3న ఇందిరా పార్కు వద్ద భారీ సభను నిర్వహిస్తామంది. ప్రధాన డిమాండ్ గా ఉన్న బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా ఎన్నికలు జరపడానికి వీలు లేదన్నది.
జనాభా లెక్కల్లో కులగణన చేపట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామంది. ఏటా రూ.20 వేల కోట్లు బీసీలకు బడ్జెట్ కేటాయిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిందని విమర్శించింది. మరి కవిత హెచ్చరికను ప్రభుత్వం లెక్క చేస్తుందా?