మోడీ మంచోడయ్యాడు.. కిషన్​ రెడ్డి శత్రువయ్యాడు

మోదీని తెలంగాణకు మిత్రుడిగా అభివర్ణించిన రేవంత్, అదే సమయంలో కిషన్ రెడ్డిని రాష్ట్రానికి శత్రువుగా చిత్రీకరించడం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

రాజకీయ నాయకులు ఎవరిని ఎప్పుడు మిత్రుడిగా పరిగణిస్తారో, ఎవరిని ఎప్పుడు శత్రువుగా చూస్తారో అర్థంకాదు. ఓ పట్టాన అంతుపట్టదు. నిన్న మొన్నటివవరకు రేవంత్​ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణకు శత్రువుగా పరిగణించాడు. నోటికొచ్చినట్లు మాట్లాడాడు.

సేమ్​ గతంలో కేసీఆర్​ మాదిరినే వ్యవహరించాడు. ఆయన్ని గుర్తుకు తెచ్చాడు. ఈమధ్యనే మోదీ నిజమైన బీసీ కాదని, అసలు ఆయన ఓసీ అయితే తన కులాన్ని మార్చుకొని బీసీగా చెలామణి అవుతున్నాడని ఏదేదో మాట్లాడాడు. రాష్ట్రానికి నిధులు ఇవ్వడంలేదని, ప్రాజెక్టులు ఇవ్వడంలేదని అన్నాడు. కేసీఆర్​ మాదిరిగానే మోదీని ఏదో ఒకటి అంటూనే ఉంటాడు.

కాని రేవంత్​ రెడ్డి ప్రయారిటీ మారిపోయింది. ఇప్పుడు ఆయన శత్రువు అంటే తెలంగాణ శత్రువు  మోదీ కాదు. కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి. మోదీ తెలంగాణకు మేలు చేయాలనుకుంటున్నారని, కాని కిషన్​ రెడ్డి సైంధవుడిలా అడ్డు పడుతున్నాడని మండిపడ్డాడు రేవంత్​ రెడ్డి. మోదీ తెలంగాణకు చేయాలనుకున్న పనులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడని రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశాడు.

కేంద్ర మంత్రిగా ఉంటూ, రాష్ట్రానికి రావాల్సిన నిధులు నిలిపివేయడం, అభివృద్ధి ప్రాజెక్టులను విఫలమయ్యేలా చేయడం కిషన్ రెడ్డి కుయుక్తి అని అన్నారు. ముఖ్యంగా వరంగల్ ఎయిర్ పోర్టును మోదీ ఇచ్చినప్పటికీ, దాన్ని తన విజయంగా చిత్రీకరించేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నించాడని ఆరోపించాడు. అదే సమయంలో మెట్రో రైలు విస్తరణ, మూసీ నది ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్ కోసం నిధులు తేవడంలో కిషన్ రెడ్డి విఫలమయ్యాడని రేవంత్ విమర్శించాడు.

రేవంత్ తన రాజకీయ ప్రయాణంలో ఒకదశలో కిషన్ రెడ్డితో కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, తన ఎదుగుదలను కిషన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నాడని అన్నారు. తాను తనకంటే చిన్న వయసులో సీఎం అయ్యాననే అసూయతో కిషన్ రెడ్డి రాష్ట్రానికి మేలు చేసే పనులను అడ్డుకుంటున్నాడని ఆరోపించాడు.  కేంద్రమంత్రిగా ఉండి తెలంగాణకు ఒక్కరూపాయి ప్రాజెక్టు తీసుకురాలేదని ఆరోపిస్తున్నారు.

అంతే కాదు కేంద్ర కెబినెట్ ముందుకు వచ్చే ప్రతిపాదనల్ని కూడా నిలిపివేయిస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆరేళ్లుగా కిషన్ రెడ్డి మంత్రిగా ఉండి తెలంగాణకు తెచ్చిందేమిటో చెప్పాలన్నాడు.  ఆయన వల్లనే తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నాడు.  మూసీకి నిధుల ఇవ్వమంటే ఎందుకంత అసహనమంటూ బీజేపీ నేతల వైఖరిపై సీఎం రేవంత్ మండిపడ్డాడు.

కేంద్రం ప్రత్యేకంగా తెచ్చిన ప్రాజెక్టు ఒక్కటైనా తెలంగాణలో ఉందా అని ప్రశ్నించాడు. దమ్ముంటే ఏపీలో మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేయండని కిషన్ రెడ్డికి సవాల్ చేశాడు. తాము మెట్రో విస్తరణ ప్రతిపాదనలు పంపిన తర్వాత .. ఓ రెండు రాష్ట్రాల్లో మెట్రో విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని హైదరాబాద్ గురించి ఎందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించాడు.

ప్రతిపాదనలు రెడీ అయినప్పటికీ కిషన్ రెడ్డి నిలిపివేయించారన్నడు రేవంత్ రెడ్డి ఆరోపణ. మోదీని తెలంగాణకు మిత్రుడిగా అభివర్ణించిన రేవంత్, అదే సమయంలో కిషన్ రెడ్డిని రాష్ట్రానికి శత్రువుగా చిత్రీకరించడం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

2 Replies to “మోడీ మంచోడయ్యాడు.. కిషన్​ రెడ్డి శత్రువయ్యాడు”

Comments are closed.