ఉగాది తరువాత కేబినెట్ విస్తరణ పక్కాయేనా?

ఈ ఉగాది తరువాతైనా కేబినెట్ విస్తరణ జరిగిన పదవులు ఆశిస్తున్నవారి కోరిక తీరుతుందేమో చూడాలి.

తెలంగాణలో మంత్రి పదవుల కోసం ఎమ్మెల్యేలు తహతహలాడిపోతున్నారు. చాలామందికి పదవుల మీద ఆశలు ఉన్నాయి. ఉండటం సహజం కూడా. ప్రస్తుతం ముగ్గురి పేర్లు బయటకు వచ్చాయి. కాని వినాయకుడి పెళ్లి మాదిరిగా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు అదిగో కేబినెట్ విస్తరణ…ఇదిగో మంత్రివర్గ విస్తరణ అనడమేగాని ఇప్పటివరకు ఆ ముహూర్తం రాలేదు.

కాంగ్రెసు ప్రభుత్వంలో ఎంత చిన్న విషయమైనా అధిష్టానం నిర్ణయించాల్సిందే తప్ప సీఎం సొంతంగా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు. అధిష్టానం ఓకే చెప్పందే రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోలేడు కాబట్టి ఆయన కూడా అలా ఎదురుచూస్తూ కూర్చున్నాడు. పదవి చేపట్టినప్పటినుంచి ఇప్పటివరకు రేవంత్ అనేకసార్లు ఢిల్లీ వెళ్లి వచ్చాడు.

ఆయన వెళుతున్నప్పడు కేబినెట్ విస్తరణపై చర్చలు జరపడానికే వెళుతున్నాడని మీడియాలో వార్తలు వస్తాయి. తీరా ఆయన తిరిగి వచ్చాక కేబినెట్ విస్తరణ ఉండదు. ఇది తెలుగు సీరియల్ మాదిరిగా సాగుతూనే ఉంది. కేబినెట్‌లో 18 మందికి అవకాశం ఉంది. కానీ ఇప్పటికీ కేబినెట్‌లో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు దాటినా ఇంకా కేబినెట్ బెర్తులు ఖాళీగానే ఉండటం చర్చనీయాంశంగా మారింది.

ఈ బెర్తుల కోసం ఆశావహులు పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత ఏడాది డిసెంబరు నెలాఖరులోగా కేబినెట్ విస్తరణ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మంత్రివర్గ విస్తరణపై హైకమాండే నిర్ణయం తీసుకుంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఈ నేపథ్యంలో.. రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి కేబినెట్ గురించి చర్చ జరుగుతోంది. కాని ఫలితం శూన్యం.

కేబినెట్ విస్తరణపై ఈనాటికీ స్పష్టత రాకపోవడంతో పదవులపై ఆశలు పెట్టకున్న నేతలు ఊసూరుమంటున్నారు. తమకు ఇక మంత్రి పదవులు ఎప్పుడు దక్కుతాయని తమ ఫాలోవర్స్ వద్ద ఆవేదన చెందుతున్నారట. ఇక మరి కొందరు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి, అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట.

జనవరిలో రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన రాగానే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. పదవులు ఇచ్చేవారి జాబితా కూడా తయారైందన్నారు. కాని ఏమీ కాలేదు. గత ఏడాది మొద‌ట సంక్రాంతి అన్నారు. త‌ర్వాత‌ మూఢాలు అడ్డొచ్చాయన్నారు. ఉగాదికి ప‌క్కా అన్నారు. అదీ కుదరలేదు. ద‌స‌రా అయిపోయింది. దీపావళి దగ్గరికి వచ్చింది. కానీ మంత్రివర్గ విస్తర‌ణ‌పై మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌టం లేదు.

దీపావ‌ళికి కూడా మంత్రివర్గ విస్తరణ కష్టమేనని ఢిల్లీ పెద్దలు చేప్పేశారు. మంత్రివర్గ విస్తరణ డైలీ ఎపిసోడ్‌ అయిపోయింది. పండ‌గలు వస్తున్నాయి..పోతున్నాయి. మూఢాలు తొలిగిపోయి..శుభ ముహూర్తాలు క‌రిగి పోతున్నాయి. అయినా క్యాబినెట్‌ విస్తరణపై సాగదీత కొనసాగుతోంది. వాయిదాలతో ఆశావహుల ఆశ‌ల‌పై నీళ్ళు చల్లుతున్నట్లు అవుతోంది. బుగ్గకారు కోసం కంట్లో వ‌త్తులేసుకుని ఎదురు చూస్తున్నారు ఎమ్మెల్యేలు. ఢిల్లీ, సీఎం రేవంత్ చుట్టూ ప్రద‌క్షిణ‌లు చేస్తున్నారు ఆశావహులు. ఉగాది తర్వాత ఆషాఢ మాసం తెర‌పైకి వ‌చ్చింది.

అయితే క్యాబినెట్ విస్తర‌ణ మాత్రం జ‌ర‌గ‌లేదు. కొత్త పీసీసీ ప్రెసిడెంట్ ఎంపిక త‌ర్వాత‌.. విస్తర‌ణ ప‌క్కా అంటూ ప్రచారం జ‌రిగింది. చెప్పిన‌ట్లుగానే పీసీసీ చీఫ్‌గా మ‌హేశ్‌ కుమార్ గౌడ్ నియామ‌కం పూర్తి చేసింది. ఇక అన్నీ అడ్డంకులు తొలిగిపోయాయి. ద‌సరా పండుగ‌కు కొత్త మంత్రులు వ‌స్తార‌ని అధిష్టానం లీకులు ఇచ్చింది. బుగ్గకారుతో ద‌స‌రా పండుగ‌ చేసుకోవచ్చనుకున్న ఆశావహుల ఆశ‌ల‌పై మ‌రోసారి నీళ్లు చల్లింది పార్టీ హైక‌మాండ్. దీంతో జరిగిందేదో జ‌రిగింది.

ఈ దీపావ‌ళికి మాత్రం ప‌క్కా..అంటూ కొత్త ఆశలు చిగురించేలోపు మరో షాక్ ఇచ్చారు అధిష్టానం పెద్దలు. మ‌హారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నిక‌ల‌ బిజీలో ఉన్నాం.. ఇప్పుడు మంత్రివ‌ర్గ విస్తర‌ణ‌పై మాట్లాడ‌లేమంటూ ఢిల్లీ పెద్దలు సెల‌విచ్చారు. ఇలా అనేక కారణాలతో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఉగాది తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు. ఉగాది తరువాత అందరికీ మంచిరోజులు వస్తాయని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఈయన కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మంత్రి పదవి కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్నారు. అధిష్టానం మాట ఇచ్చిన ప్రకారం తనకు మంత్రి పదవి వస్తుందని అంటున్నారు.

సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన రెడ్డి కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. తనకు ఏ శాఖ ఇచ్చినా సమర్ధవంతంగా పనిచేస్తానని అన్నారు. గతంలో వైద్యశాఖ, మైనర్ ఇరిగేషన్ శాఖల బాధ్యతలు నిర్వహించినట్టు గుర్తుచేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా మంత్రి పదవి కోసం చూస్తున్నారు.

హైదరాబాద్ నగరానికి ప్రయరిటీ ఇవ్వాలని అంటున్నారు. మంత్రి పదవి కాకుండా చీఫ్ విప్పదవి ఆయనకు రేవంత్ ఆఫర్ చేయగా.. తనకు మంత్రి పదవి తప్ప మరొకటి అవసరం లేదని ఆయన స్పష్టంచేసినట్టు ప్రచారం జరుగుతున్నది. కాబట్టి ఈ ఉగాది తరువాతైనా కేబినెట్ విస్తరణ జరిగిన పదవులు ఆశిస్తున్నవారి కోరిక తీరుతుందేమో చూడాలి.

5 Replies to “ఉగాది తరువాత కేబినెట్ విస్తరణ పక్కాయేనా?”

Comments are closed.