మంత్రి పదవులపై కాంగ్రెస్‌కు ఓ విధానం లేదా?

రాహుల్ గాంధీతో జరిగిన సమావేశంలో మహేశ్ కుమార్ కూడా పాల్గొన్నప్పుడు పార్టీ విధానం ఏమిటన్నది తెలియలేదా?

కాంగ్రెస్ పార్టీలో సమస్తం పార్టీ అధిష్ఠానం చేతుల్లోనే ఉంటుంది. ఈ సంగతి అందరికీ తెలిసిందే. సీఎం ఎవరో నిర్ణయించడం దగ్గర నుంచి మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలో డిసైడ్​ చేసేవరకు అధిష్ఠానం ఇష్టం ప్రకారమే జరుగుతుంది. ఏప్రిల్​ మొదటి వారంలో జరగాల్సిన కేబినెట్​ విస్తరణ సామాజిక సమతుల్యత కుదరక, మంత్రి పదవుల కోసం పోటీ ఎక్కువ కావడంతో ఎవరికీ సర్దిచెప్పలేక అధిష్ఠానం చివరకు విస్తరణను వాయిదా వేసింది. ఎప్పుడు చేస్తారో ఇప్పటివరకు సమాచారం లేదు.

ఇతర విషయాలు ఎలా ఉన్నా ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే విషయంలో వ్యతిరేకత వచ్చింది. ఆయనకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో రాహుల్ గాంధీ ఒక విధంగా మాట్లాడితే, తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మరోలా మాట్లాడాడు. మంత్రి పదవులు ఒక కుటుంబానికి ఎన్ని ఇవ్వాలి? ఒక సామాజిక వర్గానికి ఎన్ని ఇవ్వాలి? ఏ జిల్లాకు ఎన్ని ఇవ్వాలి? అనే దానిపై ఒక విధానం ఉండాలి. అలా ఉన్నప్పుడు తలా ఒక మాట మాట్లాడే అవకాశం ఉండదు. కానీ ఉన్నత పదవుల్లో ఉన్న నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తే కింది స్థాయి నాయకుల్లో అయోమయం నెలకొంటుంది.

ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే… తనకు మంత్రి పదవి రాకపోవడానికి జానారెడ్డే కారణమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ‘ఒక కుటుంబంలో అన్నదమ్ములకు పదవులు ఇస్తే నష్టమేంటి?’ అని కూడా ఆయన ప్రశ్నించాడు. ఇక ఏప్రిల్​ 3న కేబినెట్​ విస్తరణ ఖాయం అనుకోగానే పార్టీ అధిష్ఠానం ఢిల్లీలో రేవంత్ రెడ్డి, మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు, ఇతర ముఖ్యులతో కీలక సమావేశం నిర్వహించింది. అందులో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో పాటు ఇతర పెద్దలు కూడా పాల్గొన్నారు. ఆ సమావేశంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయం ప్రస్తావనకు వచ్చింది. ఆయనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చెప్పారు.

భువనగిరి ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని వ్యూహకర్త సునీల్ కనుగోలు చెప్పినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చాడు. దీంతో రాహుల్ గాంధీ ఆగ్రహించి, కేబినెట్‌లో అన్నయ్య వెంకటరెడ్డి ఉండగా తమ్ముడికి మంత్రి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించాడట. ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి పదవి ఇవ్వాలనుకుంటే వెంకటరెడ్డిని తీసేయాలని చెప్పారట. ఒక కుటుంబంలో ఒక్కరికే పదవి అనేది విధానమని, ఇందులో మరో మాట లేదని రాహుల్ అన్నాడని సమాచారం.

అయితే తాజాగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ‘ఒక కుటుంబంలో ఎంతమందికైనా మంత్రి పదవులు ఇవ్వొచ్చు’ అన్నాడు. రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిపై ఫైర్ అవడం ఆయన వ్యక్తిగత విషయమని చెప్పాడు. జానారెడ్డి ఫలానా వారికి మంత్రి పదవి ఇవ్వాలనిగానీ, ఇవ్వొద్దనిగానీ హైకమాండ్‌కు చెప్పలేదన్నాడు. మరి రాహుల్ గాంధీతో జరిగిన సమావేశంలో మహేశ్ కుమార్ కూడా పాల్గొన్నప్పుడు పార్టీ విధానం ఏమిటన్నది తెలియలేదా? మరి రాహుల్ చెప్పినదానికి భిన్నంగా ఎందుకు మాట్లాడాడు? హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడంలేదు?