ఫిబ్రవరి.. ఆ రెండు పండగలే కాపాడాలి

ఓ బ్లాక్ బస్టర్.. ఓ యావరేజ్.. ఓ భారీ ఫ్లాప్ తో జనవరి బాక్సాఫీస్ ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి ఫిబ్రవరిపై పడింది.

ఓ బ్లాక్ బస్టర్.. ఓ యావరేజ్.. ఓ భారీ ఫ్లాప్ తో జనవరి బాక్సాఫీస్ ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి ఫిబ్రవరిపై పడింది. ఈ నెలలో ఉన్నవి రెండే రెండు సంబరాలు. ఒకటి కుర్రాళ్లకు ఇష్టమైన ప్రేమికుల రోజు. ఇంకోటి భక్తులు ఇష్టపడే శివరాత్రి. టాలీవుడ్ కు ఈ రెండూ కావాలి.

మొదటి వారంలో తండేల్ వస్తోంది. ఫిబ్రవరి నెల మొత్తానికి పెద్ద సినిమా ఇదే. పైగా సంక్రాంతి తర్వాతొస్తున్న పెద్ద మూవీ కూడా ఇదే. హిట్ కాంబినేషన్ నాగచైతన్య-సాయిపల్లవి కలిసి నటించిన సినిమా ఇది.

గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, కార్తికేయ-2 లాంటి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత చందు మొండేటి నుంచి వస్తున్న చిత్రం.. ఇలా తండేల్ కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఎన్ని ప్రత్యేకతలున్నప్పటికీ కంటెంట్ క్లిక్ అవ్వాలి. ఇది కచ్చితంగా మేజిక్ చేస్తుందంటున్నారు మేకర్స్. అదే కనుక జరిగితే వాలంటైన్స్ డేకు కూడా ఇదే ప్రేక్షకుల బెస్ట్ ఛాయిస్ అవుతుంది.

తండేల్ వచ్చిన వారం రోజుల తర్వాత లైలా, దిల్ రుబా, బ్రహ్మ ఆనందం సినిమాలొస్తున్నాయి. ఈ మూడూ వేటికవే భిన్నమైనవి. విశ్వక్ సేన్ తొలిసారి లేడీ గెటప్ వేసిన సినిమా లైలా కాగా.. పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రంగా దిల్ రూబ వస్తోంది. ‘క’ లాంటి సక్సెస్ తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్న మూవీ కావడంతో దీనిపై ఓ మోస్తరు అంచనాలున్నాయి.

ఇక బ్రహ్మ ఆనందం విషయానికొస్తే.. నిజజీవిత తండ్రీకొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ కలిసి నటించిన సినిమా ఇది. టీజర్ హిట్టవ్వడం ఈ సినిమాకు కలిసొచ్చిన అంశం. వెన్నెల కిషోర్ మరో ఎట్రాక్షన్.

ఫిబ్రవరి మూడో వారం మజాకా వస్తోంది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ మూవీ టీజర్ కూడా పెద్ద హిట్టయింది. వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన ధమాకా లాంటి సినిమా తర్వాత త్రినాధరావు నక్కిన చేస్తున్న మూవీ ఇది. దీంతో పాటు మరో 3 సినిమాలొస్తున్నప్పటికీ ఫోకస్ అంతా మజాకాపైనే ఉంది.

చివరి వారానికి కూడా కొన్ని సినిమాలు షెడ్యూల్ అయినప్పటికీ ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తంగా చూసుకుంటే.. ఫిబ్రవరి నెలలో తండేల్ మాత్రమే పెద్ద సినిమా. బడ్జెట్ పరంగానే కాదు, అంచనాల పరంగా కూడా. దీంతో పాటు లైలా, దిల్ రూబ, బ్రహ్మ ఆనందం, మజాకా సినిమాల్లో ఏవైనా సక్సెస్ అయితే టాలీవుడ్ కు అదే అసలైన పండగ.

One Reply to “ఫిబ్రవరి.. ఆ రెండు పండగలే కాపాడాలి”

  1. తొమ్మిది, సున్నా, ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ చేయిదానికి

Comments are closed.