టీడీపీ వచ్చింది.. ఊరించడం మొదలైంది

హైదరాబాద్ నుంచి ఐదేళ్లలో టాలీవుడ్, వైజాగ్ కు షిఫ్ట్ అయిపోతుందా?

తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఈ ఊరించడం అనే ప్రక్రియ నిరాటంకంగా సాగిపోతుంది. అధికారంలో ఉన్న ఐదేళ్లు, భారీగా ప్రచారం చేసుకుంటారు. ఇక్కడ ఇది వస్తోంది, అక్కడ అది వస్తోందంటూ మీడియాలో వరుసగా కథనాలు వస్తుంటాయి.

అందులో ఆచరణ సాధ్యమైనవి ఎన్ని, అమలయ్యేవి ఎన్ని, క్షేత్రస్థాయిలో అందుబాటులోకి వచ్చినవి ఎన్ని అనే లెక్కలు తీస్తే రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్లిపోతారు ఎవరైనా. ఓవైపు వాస్తవాలు ఇలా ఉన్నప్పటికీ, మరోవైపు ఎప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చినా ప్రజల కళ్లకు భారీ ప్రచారాలు, అభివృద్ధి జరిగిపోతోందనే వార్తలు కనిపిస్తూనే ఉంటాయి. ఈ వ్యవహారంలో టాలీవుడ్ ఎప్పుడూ ఓ భాగమే.

చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా టాలీవుడ్ లో పెద్ద పండగ అన్నట్టు కలరింగ్ ఉంటుంది. దీనికితోడు రాష్ట్రానికి టాలీవుడ్ తరలివస్తోందని, ఇకపై అన్నీ ఆంధ్రప్రదేశ్ లోనే అన్నట్టు చెబుతుంటారు. విశాఖ టాలీవుడ్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతుందంటూ ప్రచారం స్టార్ట్ అయిపోతుంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ప్రచార ఆర్భాటాలు ఇంకాస్త ఎక్కువయ్యాయి. దీనికి కారణం ఈసారి స్వయంగా సినీ నటుడు పవన్ కల్యాణ్ కూటమిలో భాగస్వామి కావడం. ఈ ఐదేళ్లలో టాలీవుడ్ మొత్తం వైజాగ్ కు తరలి వస్తుందని చెబుతున్నారు కూటమి నేతలు.

విశాఖలో ఐదేళ్లలో కళ్లుచెదిరే స్టుడియోలు వస్తాయని, సినీ ప్రముఖులంతా వైజాగ్ లో ఇళ్లు కట్టుకొని స్థిర నివాసం ఏర్పాటు చేసుకోబోతున్నారంటూ ఎక్కడ చూసినా బ్యానర్ స్టోరీలు కనిపిస్తున్నాయి. ఇదంతా సాధ్యమా అని ఆలోచించడం లేదు.

చెన్నై నుంచి హైదరాబాద్ కు పరిశ్రమ తరలి రావడానికి ఎన్నేళ్లు పట్టింది? ఇప్పటికీ కొన్ని పనుల కోసం చెన్నై వైపు చూడాల్సిన పరిస్థితి. మంచి టెక్నీషియన్స్ ను చెన్నై నుంచే తెచ్చుకుంటున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి ఐదేళ్లలో టాలీవుడ్, వైజాగ్ కు షిఫ్ట్ అయిపోతుందా?

సినీ ప్రముఖులు కావాలంటే ఇళ్లు కట్టుకోవచ్చు, ప్రభుత్వం సహకరిస్తే, ఈ ఐదేళ్లలో స్టుడియోలు నిర్మించుకోవచ్చు. అంతేతప్ప, ఐదేళ్లలో ఇండస్ట్రీ మొత్తం షిఫ్ట్ అయిపోతుందంటూ ప్రచారం చేయడం మాత్రం విడ్డూరం.

2 Replies to “టీడీపీ వచ్చింది.. ఊరించడం మొదలైంది”

Comments are closed.