జనవరి బాక్సాఫీస్.. సేమ్ సీన్ రిపీట్

సంక్రాంతికి ఎప్పుడు సినిమాలు సిద్ధమైనా, అంతకుముందు వారం బాక్సాఫీస్ డల్ గా కనిపిస్తుంది. అది సహజం. ఈ జనవరిలో కూడా మొదటివారం అదే పరిస్థితి.

సరిగ్గా ఏడాది కిందటి సంగతి.. 2024 జనవరి. భారీ అంచనాల మధ్య గుంటూరు కారం వచ్చింది. అండర్ డాగ్ గా హనుమాన్ సినిమా రిలీజైంది. రిజల్ట్ ఏంటో అందరం చూశాం. సేమ్ టు సేమ్ అదే ఫలితం, ఈ ఏడాది జనవరిలో కూడా రిపీట్ అయింది. అరివీర భయంకరమైన అంచనాలతో గేమ్ ఛేంజర్ వచ్చింది. ఓ మోస్తరు అంచనాలతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా వచ్చింది. వెంకీ నటించిన ఈ సినిమా ‘పొంగలు బ్లాకుబస్టరు’ అనిపించుకుంది.

సంక్రాంతికి ఎప్పుడు సినిమాలు సిద్ధమైనా, అంతకుముందు వారం బాక్సాఫీస్ డల్ గా కనిపిస్తుంది. అది సహజం. ఈ జనవరిలో కూడా మొదటివారం అదే పరిస్థితి. డ్రీమ్ క్యాచర్, చేతిలో చెయ్యేసి చెప్పు బావ లాంటి 5 సినిమాలొచ్చాయి. వారం రోజులు ఆడితే చాలనుకునే ఉద్దేశంతో వచ్చిన ఈ సినిమాలు కనీసం మొదటి వారాంతం కూడా నిలబడలేకపోయాయి.

ఇక గేమ్ ఛేంజర్ నుంచి సంక్రాంతి సినిమాల సందడి షురూ అయింది. ఈ సంక్రాంతికి భారీ అంచనాలతో వచ్చిన సినిమా ఇదే. ఎందుకంటే, రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్. అలా భయంకరమైన హైప్ తో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా అన్ని ప్రాంతాల్లో ఫ్లాప్ అయింది. నిర్మాత దిల్ రాజును కోలుకోలేని దెబ్బ కొట్టింది. రామ్ చరణ్ కు ఆర్ఆర్ఆర్ తో వచ్చిన క్రేజ్ ను ఇది కొనసాగించలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్ లో కూడా ఇది భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. శంకర్ దర్శకత్వం, కార్తీక్ సుబ్బరాజ్ పాత కథ ఈ సినిమా ఫెయిల్యూర్ కు ప్రధాన కారణాలు.

గేమ్ ఛేంజర్ రిలీజైన 2 రోజులకు (జనవరి 12) డాకు మహారాజ్ వచ్చింది. ఈ సినిమాకు కూడా భారీ హైప్ ఇచ్చారు. వరుసగా సక్సెస్ లు ఇస్తున్న బాలయ్య, ఆల్రెడీ హిట్ కొట్టిన దర్శకుడు, ‘సితార’ లాంటి పెద్ద బ్యానర్.. ఇలా అంతా కలిసి ఓ యావరేజ్ ప్రొడక్ట్ అందించారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్ కలెక్షన్లు మాత్రమే సాధించింది. స్టయిలిష్ ప్రజెంటేషన్, డీసెంట్ ఫస్ట్ హాఫ్ ఈ సినిమాను ఉన్నంతలో ఆదుకున్నాయి. లేదంటే రిజల్ట్ మరింత ఘోరంగా ఉండేది.

ఇక సంక్రాంతి బరిలో చివరగా వచ్చిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం‘. గతేడాది సంక్రాంతి బరిలో హనుమాన్ ఎలాగైతే ఆశ్చర్యకరమైన విజయాన్నందుకుందో, ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాది కూడా అలాంటి విజయమే. వెంకటేష్, అనీల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఈ సినిమా వసూళ్లు చూసి ట్రేడ్ తో పాటు టాలీవుడ్ ఆశ్చర్యపోతోంది.

ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ సాధించే దిశగా దూసుకుపోతోంది. అటు ఓవర్సీస్ లో 3 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటర్ అవ్వబోతోంది. జనవరి నెలలో వన్ అండ్ ఓన్లీ బ్లాక్ బస్టర్ గా అవతరించడంతో పాటు.. వెంకీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా.

సంక్రాంతికి రిలీజైన 3 పెద్ద సినిమాల కారణంగా మరుసటి వారం ఎలాంటి సినిమాలు థియేటర్లలోకి రాలేదు. ఆ తర్వాత వారం మాత్రం ఐడెంటిటీ, డియర్ కృష్ణ, హత్య లాంటి 5 సినిమాలొచ్చాయి. అప్పటికే సంక్రాంతి సినిమాలకు పెంచిన టికెట్ రేట్ల కారణంగా, వీటిని చూసేందుకు ప్రేక్షకులెవ్వరూ ముందుకురాలేదు.

ఇక జనవరి నెలకు ఫినిషింగ్ టచ్ ఇస్తూ.. 31వ తేదీన మదగజరాజ, మహిష, సంహారం, రాచరికం, రొమాంటిక్ లైఫ్ అనే సినిమాలు వస్తున్నాయి. బాక్సాఫీస్ పై ప్రభావం చూపించేంత పెద్ద సినిమాలేవీ ఇందులో లేవు. ఓవరాల్ గా.. జనవరి నెలలో 19 సినిమాలు మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో సంక్రాంతికి 3 పెద్ద సినిమాలొచ్చాయి. వీటన్నింటిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా తిరుగులేని బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

4 Replies to “జనవరి బాక్సాఫీస్.. సేమ్ సీన్ రిపీట్”

Comments are closed.