సాధారణంగా మన నిర్మాతలు అంతా సినిమా నిర్మాణానికి లోకల్ ఫైనాన్సియర్ల దగ్గర తీసుకుంటారు. ప్రతి బ్యానర్ కు ఓ రెగ్యులర్ ఫైనాన్సియర్ వుంటారు. వాళ్లకు నమ్మకం వుంటుంది. ప్రతి ప్రాజెక్ట్ కు ఫండింగ్ చేస్తారు. సినిమా విడుదల ముందు తీసుకుంటారు. వెనక్కు ఇవ్వకపోతే సినిమా విడుదల సాధ్యం కాదు. ఇలా చేసే ఫైనాన్స్ అంతా ఎవరు చేసినా రెండు రూపాయల నుంచి రెండున్నర రూపాయల వడ్డీ లెక్కన వుంటుంది.
కొంత మంది తమకు తెలిసిన వారి దగ్గర, కాస్త బాగా డబ్బున్న వారి దగ్గర నుంచి తెస్తారు. ఇలా తెచ్చేవాటికి రూపాయిన్నర వడ్డీ లెక్కన వుంటుంది. అయితే ఇది అందరికీ సాధ్యం కాదు. ఒక్కోసారి సినిమా విడుదల ముందు అత్యవసరం అయితే అయిదు నుంచి పది రూపాయల వడ్డీకి కూడా తీసుకునే అవసరం పడుతూ వుంటుంది. అది వేరే సంగతి.
విషయం ఏమిటంటే ఎంత తప్పని సరి అయినా లోకల్ ఫైనాన్సియర్లను దాటి వెళ్లరు ముఖ్యంగా వేరే స్టేట్ ల వాళ్ల దగ్గరకి వెళ్లరు. వాళ్ల రూల్స్ కఠినంగా వుంటాయి. దయ దాక్షిణ్యాలు, మొహమాటాలు, సిఫార్సులు వుండవు. తేడా వస్తే సినిమా విడుదలకే ప్రమాదం అవుతుంది.
ఇన్ని తెలిసి కూడా నిర్మాణంలో వున్న ఓ భారీ సినిమాకు పక్క రాష్ట్రానికి చెందిన ఓ ఫైనాన్సియర్ దగ్గర అప్పు తెచ్చారట ఓ ప్రముఖ నిర్మాత. తప్పనిసరి పరిస్థితులు కావడం, ఇక్కడ రెగ్యులర్ ఫైనాన్సియర్ ఇంతకు మించి ఇవ్వలేనని చెప్పడంతో అక్కడకు వెళ్లారని తెలుస్తోంది. పైగా వడ్డీ అసలుకు మించినా కూడా రూపాయి తగ్గించరట. చాలా కఠినంగా వుంటారు సదరు ఫైనాన్సియర్ అని తెలుస్తోంది.
ఇన్ని తెలిసి కూడా అక్కడకు వెళ్లి పైనాన్స్ తెచ్చుకోవడంపై తోటి నిర్మాతలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పటికే వడ్డీ భారీ చాలా అంటే చాలా పెరిగిపోయిందని గుసగుసలాడుకుంటున్నారు.