శేషాచ‌లం కొండ‌ల్లో విహ‌రింప‌జేసే దృశ్య కావ్యం

ట్రెక్కింగ్ అంటే కేవ‌లం కాళ్ల‌కు ప‌ని చెప్ప‌డం మాత్ర‌మే కాద‌ని రాఘ‌వ త‌న రాత‌ల ద్వారా నిరూపించారు.

స‌హ‌జంగా ట్రెక్కింగ్ అంటే ఎవ‌రెస్ట్ శిఖ‌రాన్ని అధిరోహించే వాళ్ల‌గానో, లేక ఎత్తైన కొండ‌ల్ని ఎక్కేవాళ్ల‌గానో అనుకుంటుంటాం. కానీ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ రాఘ‌వ‌శ‌ర్మ మాత్రం ట్రెక్కింగ్‌ను మ‌రో కోణంలో చూశారు, చూపారు. తిరుమ‌ల శేషాచ‌లం కొండ‌ల్లో మూడు ద‌శాబ్దాలుగా ట్రెక్కింగ్ అనుభ‌వాన్ని సొంతం చేసుకున్న రాఘ‌వ రెండేళ్ల వ్య‌వ‌ధిలో ట్రెక్కింగ్‌పై రెండు పుస్త‌కాలు వెలువ‌రించ‌డం విశేషం.

రెండేళ్ల నాడు తిరుమ‌ల దృశ్య కావ్యం, తాజాగా దానికి కొన‌సాగింపుగా రెండో పుస్త‌కాన్ని కూడా తీసుకొచ్చారు. జ‌ర్న‌లిస్టు రాఘ‌వ దృష్టిలో ట్రెక్కింగ్ అంటే స‌న్న‌గా ప్ర‌వ‌హించే సెల ఏటి సంగీతాన్ని ఆస్వాదించ‌డం, చీలిన రాతి కొండ‌ల్లోని సౌంద‌ర్యాన్ని ద‌ర్శించ‌డం, చెట్లు, పుట్ట‌లు, పిట్ట‌ల‌ను ప‌ల‌క‌రించ‌డం, వెన్నెల్లో నిద్రించ‌డం, అడ‌వి మ‌ల్లెల గుబాళింపును ఆస్వాదించ‌డం. అందుకే ట్రెక్కింగ్‌పై తాజాగా వ‌చ్చిన పుస్తకం ఎంతో ప్ర‌త్యేకం.

శేషాచ‌లం కొండ‌లంటే క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి మొద‌ట గుర్తుకొస్తారు. ప్ర‌తి రోజూ వేల మంది భ‌క్తులు ఏడుకొండ‌ల‌పై కొలువుదీరిన శ్రీ‌వారిని ద‌ర్శించుకోడానికి వెళ్తుంటారు. కానీ 30 ఏళ్లుగా రాఘ‌వ మాత్రం… శేషాచలం కొండ‌ల్లో ఏ మూలో దాక్కున్న తీర్థాల‌ను సంద‌ర్శిస్తూ, జ‌ల‌పాతాలు వెద‌జ‌ల్లే సంగీత స్వ‌రాల‌ను మ‌న‌సారా ఆస్వాదిస్తున్నారు. అయితే ఆయ‌న నిస్వార్థ‌ప‌రుడు కావ‌డంతో, శేషాచ‌లం కొండ‌ల అందాల‌కు తాను ప‌ర‌వ‌శుడు కావ‌డంతో పాటు అంద‌రికీ అలాంటి అద్భుత‌మైన అనుభూతిని క‌లిగించేందుకు క‌లానికి ప‌దును పెట్టి, ఒక్కో అక్ష‌రాన్ని అందంగా పొందిక‌గా పేర్చుతూ, అద్భుత‌మైన పుస్త‌క కొండ‌ను ప్ర‌తిష్టించారు.

మ‌న పూర్వీకుల ఆవాసాలు అడ‌వుల్లోనే ఉన్నాయ‌ని భావించే రాఘ‌వ‌, మూలాల‌ను వెతుక్కునే క్ర‌మంలో అనిర్వ‌చ‌నీయ‌మైన ఆనందాన్ని పొంద‌డాన్ని ఆయ‌న రాసిన పుస్త‌కంలో చూడొచ్చు. శేషాచ‌లం కొండ‌ల్లో ఎన్నో తీర్థాలు, ఎన్నెన్నో జ‌ల‌పాతాలు, రాతి కొండ‌ల రూపాలు, ప్ర‌కృతి విశ్వ‌రూపాలు ద‌ర్శ‌న‌మిస్తాయ‌ని మూడు ద‌శాబ్దాల ట్రెక్కింగ్ అనుభ‌వంతో ఆయ‌న మ‌న కళ్ల‌కు క‌ట్టారు. అడ‌వుల్లోని చెట్లు, రాళ్లు, జ‌లపాతాలకు ఓ భాష వుంద‌ని న‌మ్ముతారు. ఆయ‌న‌లోని భావుక‌త‌ను ప్ర‌తిబింబించే వాక్యాలేంటో తెలుసుకుందాం.

“రాళ్ల‌లో స‌హ‌జ శిలా సౌంద‌ర్యం వుంది. ఆ మౌన శిల‌లు మ‌న‌తో మాట్లాడుతున్న‌ట్టే వుంటాయి. ఆ మౌనానికి మ‌న‌మే భాష‌ను క‌నుక్కోవాలి, లిపిని క‌నుక్కోవాలి. మ‌న‌మే వాటితో మాట్లాడాలి. చెల్లు ప‌ల‌క‌రించుకున్న‌ట్టుంటాయి. గాలి వీచిన‌ప్పుడు రెల్లు పొద‌లు ఆనందంతో త‌ల‌లూపుతాయి. ఈదురుగాలులు వీచిన‌ప్పుడు మ‌హావృక్షాలు త‌ల విర‌బోసుకుని విర‌గ‌బ‌డి న‌వ్విన‌ట్టుంటాయి. రెండు చెట్లు పెన‌వేసుకుంటాయి. వాటికి జాతి వివ‌క్ష లేదు. మ‌న‌లాగా వాటికి కులం లేదు, మ‌తం లేదు, వ‌ర్ణ వివ‌క్ష అస‌లే లేదు. అన్నీ క‌లిసే జీవిస్తుంటాయి”

ట్రెక్కింగ్ అంటే కేవ‌లం కాళ్ల‌కు ప‌ని చెప్ప‌డం మాత్ర‌మే కాద‌ని రాఘ‌వ త‌న రాత‌ల ద్వారా నిరూపించారు. ట్రెక్కింగ్ అనేది మ‌న‌సుకు సంబంధించిన వ్య‌వ‌హారంగా ఆయ‌న తాజా పుస్త‌కం చ‌దువుతుంటే, ప్ర‌తి వాక్యం ప్ర‌త్యేకంగా గుర్తు చేస్తుంటుంది.

శేషాచ‌లం కొండ‌ల్లో బ్ర‌హ్మ‌తీర్థం, నారాయ‌ణ‌తీర్థం, కుమార‌ధార‌- శ‌క్తి క‌టారి తీర్థాలు, కైలాస తీర్థం, యుద్ధ‌గ‌ళ‌, హ‌లాయుధ తీర్థం, డ‌బ్బారేకుల కోన‌, గుంజ‌న జ‌ల‌పాతం… ఇలా ఒక‌టా, రెండా? వంద‌కు పైగా జ‌ల‌పాతాల్ని త‌న ఒడిలో నింపుకున్న అందాల కొండ శేషాచ‌లం.

తొలి చ‌రిత్ర యుగ‌పు మాన‌వులు నివ‌సించిన ఆన‌వాళ్లు యుద్ధ‌గ‌ళ తీర్థం వ‌ద్ద ఉన్న‌ట్టు ఆయ‌న రాశారు. ఈ పుస్త‌కాన్ని ప్ర‌కృతి ప్రేమికులంతా ఎందుకు చ‌ద‌వాలో… రాఘ‌వ రాత‌ల నుంచే తెలుసుకుందాం.

“రాళ్ల మ‌ధ్య రాగాలు ప‌లుకుతూ, గారాలు పోతోంది. మ‌నం వినాలే కానీ, ఆ శ‌బ్దాల్లో ఏటికి ఎన్ని స్వరాలు! ఎన్ని రాగాలు! ఆ సంగీతాన్ని విని అడ‌వి అడ‌వంతా త‌న్మ‌య‌మైపోతోంది. కొండ‌లు, కోన‌లు ప‌ర‌వ‌శించిపోతున్నాయి” అని అద్భుతంగా ఆవిష్క‌రించారు.

నిజానికి “శేషాచ‌లం కొండ‌ల్లో… దృశ్య కావ్యం-2″లోని ప్ర‌తి క‌థ‌నం, దేనిక‌ది ప్ర‌త్యేకం. ఈ పుస్త‌కాన్ని చ‌దివే పాఠ‌కుల్ని త‌న్మ‌యుల‌య్యేలా, ప‌ర‌వ‌శించేలా అక్ష‌రాల్ని చ‌క్క‌టి శిల్ప నైపుణ్యంతో చెక్కారీ శిల్పి. మరీ ముఖ్యంగా అడ‌వి నుంచి త‌న త‌ల్లికి రాసిన బ‌హిరంగ లేఖ‌… క‌న్నీళ్ల‌ను తెప్పిస్తుంది. అడ‌విని త‌ల్లిగా భావించే రాఘ‌వ లాంటి వాళ్లు త‌ప్ప‌, మ‌రొక‌రికి ఇంత అద్భుతంగా శేషాచ‌లంలోని తీర్థాల‌పై రాయ‌డం సాధ్యం కాదు. ఈ పుస్త‌కం కావాల్సిన వాళ్లు 9493226180లో సంప్ర‌దించ‌గ‌ల‌రు.

3 Replies to “శేషాచ‌లం కొండ‌ల్లో విహ‌రింప‌జేసే దృశ్య కావ్యం”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.