కీలకమైన ఎన్నికల సమయంలో ఏపీ బీజేపీలో విభేదాలు బయటపడ్డాయి. పొత్తులో భాగంగా ఏపీ బీజేపీకి 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాలు దక్కాయి. ఇప్పటికే పార్లమెంట్ సభ్యుల్ని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఇక అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రకటించాల్సి వుంది. అయితే బీజేపీలో టికెట్ల లొల్లి ఓ రేంజ్‌లో సాగుతోంది.
నిజమైన బీజేపీ నాయకులకు టికెట్లు ఇవ్వాలని, వలస నేతలను పక్కన పెట్టాలంటూ ఇటీవల ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ద్వారా జాతీయ నాయకత్వానికి లేఖ పంపారు. ఈ లేఖ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. పార్లమెంట్ అభ్యర్థులను చూస్తే, ఈ లేఖను ఏ మాత్రం పట్టించుకోలేదని అర్థమైంది.
సీఎం రమేష్‌నాయుడు, వరప్రసాద్, కిరణ్‌కుమార్‌రెడ్డి, కొత్తపల్లె గీత తదితర వలస నేతలకు సీట్లు దక్కాయి. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు కూడా వలస నేత కావడం గమనార్హం. ఆమెకు కూడా రాజమండ్రి టికెట్ దక్కింది. నరసాపురం నుంచి ఒకే ఒక్క నిజమైన బీజేపీ నేతకు టికెట్ ఇచ్చారనే చర్చ జరుగుతోంది. జీవీఎల్, సత్యకుమార్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి లాంటి నేతలకు టికెట్లు దక్కలేదు.
వీరిలో సత్యకుమార్‌కు ధర్మవరం, వీర్రాజుకు అనపర్తి టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగులోంది. అలాగే చంద్రబాబు మనిషిగా గుర్తింపు ఉన్న సుజనాచౌదరికి విజయవాడ వెస్ట్ టికెట్ ఇస్తారని అంటున్నారు.
అయితే ఎన్నికల సమయంలో నిర్వహించిన ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశానికి జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి , సత్యకుమార్ డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. తమకు అన్యాయం జరిగిందనే ఆవేదనతోనే కీలక సమావేశానికి వెళ్లలేదని అంటున్నారు.