తిరుప‌తిలో బిక్కుబిక్కుమంటున్న పేద‌లు!

తిరుప‌తి న‌గ‌రంలో పారిశుధ్య కార్మికులైన పేద‌లుంటున్న స్కావెంజ‌ర్స్ కాల‌నీవాసులు బిక్కుబిక్కుమ‌ని బ‌తుకీడిస్తున్నారు.

తిరుప‌తి న‌గ‌రంలో పారిశుధ్య కార్మికులైన పేద‌లుంటున్న స్కావెంజ‌ర్స్ కాల‌నీవాసులు బిక్కుబిక్కుమ‌ని బ‌తుకీడిస్తున్నారు. దీనికి కార‌ణం… ఆ కాల‌నీ నుంచి త‌మ‌ను కూట‌మి ప్ర‌భుత్వం త‌రిమివేయాల‌నే స‌మాచారం వాళ్ల చెవుల్లో ప‌డ‌డ‌మే. తిరుప‌తి స్కావెంజ‌ర్స్ కాల‌నీలో 200 కుటుంబాలు వుంటాయి. అంతా మున్సిప‌ల్ పారిశుధ్య కార్మికులే. ఒక స‌మ‌యం అంటూ లేకుండా వాళ్లు విధులు నిర్వ‌ర్తించాల్సి వుంటుంది.

నాలుగు ఎక‌రాల‌కు పైగా విస్తీర్ణంలో ఉన్న కాల‌నీలో మూడు రోజులుగా స‌ర్వే సిబ్బంది స‌ర్వే చేస్తున్నారు. కొంత స్థ‌లంలో అపార్ట్‌మెంట్స్ నిర్మించి, అందులోకి కొంద‌రు కాల‌నీవాసుల్ని, మిగిలిన వాళ్ల‌ను సుదూర ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌నే ప్ర‌తిపాద‌న ప్ర‌భుత్వం చేస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌తంలో 2014లో కూడా మున్సిప‌ల్‌శాఖ మంత్రిగా ఉన్న నారాయ‌ణ ఈ కాల‌నీపై ఇదే ర‌క‌మైన వ్యూహం ప‌న్నారు. క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్‌లు నిర్మించి, అందులో వ్యాపారాలు చేయాల‌నేది మంత్రి నారాయ‌ణ ఆలోచ‌న‌లో ఎలాంటి మార్పు రాలేదు.

దీంతో స్కావెంజ‌ర్స్ కాల‌నీవాసుల బ‌తుకు మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. గ‌తంలో ప్ర‌భుత్వ కుట్ర‌ను వామ‌ప‌క్ష పార్టీలు, వైసీపీ క‌లిసి తిప్పికొట్టాయి. ఇప్పుడు మ‌ళ్లీ కూట‌మి అధికారంలోకి రావ‌డంతో స్కావెంజ‌ర్స్ కాల‌నీవాసుల్ని ఖాళీ చేయించి, ఆ స్థ‌లంలో వ్యాపారం చేయాల‌ని అనుకోవ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది.

ఈ ప‌రిణామాల‌పై వైసీపీ తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ఒక‌వేళ స్కావెంజ‌ర్స్ కాల‌నీని ట‌చ్ చేస్తే, తీవ్రంగా ప్ర‌తిఘ‌టిస్తామ‌ని తిరుప‌తి వైసీపీ స‌మ‌న్వ‌య‌కర్త భూమ‌న అభిన‌య్ హెచ్చ‌రించారు. ప్ర‌స్తుతం తిరుప‌తిలో స్కావెంజ‌ర్స్‌ను ఖాళీ చేసే అంశం తీవ్ర వివాదాస్ప‌ద‌మ‌వుతోంది.

5 Replies to “తిరుప‌తిలో బిక్కుబిక్కుమంటున్న పేద‌లు!”

Comments are closed.