బీజేపీ సీఎంలు.. ఇది కొత్త నీరా, సీనియ‌ర్ల‌కు వీడ్కోలా!

బీజేపీ త‌న భ‌విష్య‌త్త‌కు బాటలుగా కొత్త వారికి అవ‌కాశం ఇవ్వ‌డ‌మే అనుకోవాలా, పూర్తిగా అధిష్టానం అదుపాజ్ఞ‌ల్లో ఉంటార‌నే ఇలా కొత్త వారికి, ఊహ‌ల్లో కూడా లేని వారికి అవ‌కాశాలు ద‌క్కుతున్నాయా అనేదే ఆస‌క్తిదాయ‌క‌మైన ప్ర‌శ్న‌!

ఢిల్లీ సీఎంగా తొలి సారి ఎమ్మెల్యేగా నెగ్గిన రేఖా గుప్తాకు అవ‌కాశం ఇచ్చింది బీజేపీ అధిష్టానం. యాభై యేళ్ల వ‌య‌సులో తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గిన రేఖా గుప్తాకు ఇది ఊహించ‌ని అవ‌కాశ‌మే కాబోలు. ఈ మ‌ధ్య‌కాలంలో బీజేపీ వాళ్లు ఎన్నిక‌ల ముందు సీఎం అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌డం పూర్తిగా మానేశారు. రాష్ట్రం ఏదైనా.. ఎన్నిక‌ల ముందు బీజేపీ సీఎం అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌డం అరుదైపోయింది. ఇక ఎన్నిక‌లు అయ్యాకా అవ‌కాశం ద‌క్కితే.. ఊహించ‌ని పేర్ల‌ను సీఎం హోదాల‌కు పెంచుతోంది క‌మ‌లం పార్టీ! అలాగే కొన్ని రాష్ట్రాల్లో అయితే సీనియ‌ర్లు పోటీలో ఉన్నా వారిని ప‌క్క‌న పెట్టి, వీలైతే వారిని సీఎం హోదాల‌ను దించి మరీ వేరే వారికి అవ‌కాశం ఇస్తూ ఉంది.

ఇది వ‌ర‌కూ క‌ర్ణాట‌క విష‌యంలో ఇదే జ‌రిగింది. య‌డియూర‌ప్ప‌ను మార్చుతారు మార్చుతారు అనే ప్ర‌చారంతో చాలా కాలం గ‌డిచిన త‌ర్వాత చివ‌ర‌కు ఆయ‌న చేత రాజీనామా చేయించి, మ‌రొక‌రిని ఎన్నిక‌ల‌కు కొన్నాళ్ల ముందు సీఎంగా చేశారు. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల స‌మ‌యంలో మోడీ త‌నే సీఎం క్యాండిడేట్ అన్న‌ట్టుగా ప్ర‌చారం చేశారు. సీఎం అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌లేదు. ఆ ఎన్నిక‌ల్లో అక్క‌డ బీజేపీ ఓడిపోయింది కాబ‌ట్టి స‌రిపోయింది, లేక‌పోతే మ‌రెవ‌రు కొత్త‌గా సీఎం అయ్యే వారో అనేది ఊహ‌కు అంద‌ని అంశ‌మే!

ఇక ఢిల్లీలో రేఖా గుప్తా మాత్ర‌మే కాదు, ఈ మ‌ధ్య‌కాలంలో ఇలాంటి ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ఎంపిక‌లు చాలానే ఉన్నాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్లో ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కూ శివ‌రాజ్ సింగ్ చౌహాన్ సీఎంగా ఉండే వారు. కాంగ్రెస్ నేత క‌మ‌ల్ నాథ్ నాయ‌క‌త్వంలోని ప్ర‌భుత్వం కూలిపోవ‌డంతో బీజేపీ సీనియ‌ర్ల‌లోనే సీనియ‌ర్ లాంటి నేత‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ కు వ‌ర‌స‌గా ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన చౌహాన్ కు అవ‌కాశం ద‌క్కింది. ఆ ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి విష‌యంలో ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. అయితే తీరా ఎన్నిక‌ల‌య్యాకా మెజారిటీ ద‌క్క‌డంతో.. బీజేపీ చౌహాన్ ను సీఎంగా చేయ‌లేదు! ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ ఆయ‌నే సీఎం, ఆయ‌న నాయ‌క‌త్వంలోనే ఎన్నిక‌ల‌కు వెళ్లినా.. తీరా మెజారిటీ ల‌భించాకా ఆయ‌న‌ను కాద‌ని మోహ‌న్ యాద‌వ్ ను మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎంగా ప్ర‌క‌టించారు. అంత‌టి చౌహాన్ న కాకుండా రాష్ట్రం బ‌య‌ట పెద్ద‌గా తెలియ‌ని వ్య‌క్తికే బీజేపీ పెద్ద పీట వేసింది.

ఇక ఛ‌త్తీస్ గ‌డ్ లో కూడా సీఎం పీఠం కోసం చాలా మంది బీజేపీ సీనియ‌ర్లు పోటీలు ప‌డ్డారు. అయితే వారంద‌రినీ కాద‌ని విష్ణుదేవ్ సాయిని సీఎంగా ప్ర‌క‌టించేశారు. ఇక రాజ‌స్థాన్ సంగ‌తీ అలానే ఉంటుంది. అక్క‌డ మాజీ సీఎం వ‌సుంధ‌ర రాజే మ‌రోసారి అవ‌కాశాన్ని ఆశించారు. అలాగే గ‌జేంద్ర షెకావ‌త్ పేరు కూడా వినిపించింది ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ.. అయితే రాజే కు అవ‌కాశం ల‌భించ‌లేదు, షెకావ‌త్ కూ ద‌క్క‌లేదు. భ‌జ‌న్ లాల్ శ‌ర్మ అంటూ కొత్త పేరున ప్ర‌క‌టించేశారు.

ఒడిశాలో కూడా ద‌శాబ్దాల బీజేడీ పాల‌న‌కు తెర‌దించి అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకున్న బీజేపీ ఊహించ‌ని రీతిలో మోహ‌న్ చ‌రణ్ మాఝీకి అవ‌కాశం ఇచ్చింది. ఇలా ఊహ‌ల‌కు అంద‌ని పేర్ల‌ను సీఎంలుగా చేసే ప‌రిస్థితుల్లో బీజేపీ అధిష్టానం ఉంది. మ‌హారాష్ట్ర‌లో కూడా బీజేపీ ముందుగా సీఎం అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌లేదు. అక్క‌డ కూట‌మిగా ఎన్నిక‌ల‌కు వెళ్లినా.. సీఎం అభ్య‌ర్థి ఎవ‌రో చెప్ప‌లేదు. అయితే మ‌రీ కొత్త వ్య‌క్తిని తెర‌పై తేకుండా.. మాజీ సీఎం ఫ‌డ్న‌వీస్ కే మ‌ళ్లీ అవ‌కాశం ఇచ్చింది. ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ షిండేను కొన‌సాగించినా, ఎన్నిక‌ల త‌ర్వాత షిండే పాత్ర‌ను త‌గ్గించి వేసింది.

2014లో హ‌ర్యానాలో మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ అనే తొలిసారి ఎమ్మెల్యేను బీజేపీ ముఖ్య‌మంత్రిని చేసింది! ఆయ‌నకు మోడీతో సాన్నిహిత్యంతో పాటు, ఆర్ఎస్ఎస్ లో ప‌ని చేసిన అనుభ‌వం ఉప‌యోగ‌ప‌డిందంటారు. అలా తొలి సారి ఎమ్మెల్యేల‌నే సీఎంలుగా చేసే ప‌ని అప్ప‌టి నుంచి బీజేపీ మొద‌లుపెట్టింది. అది అలా కొన‌సాగుతూ ఉంది.

ఇక 2024లో రాజ‌స్తాన్ సీఎంగా భ‌జ‌న్ లాల్ శ‌ర్మ‌ను ప్ర‌క‌టించే స‌మ‌యంలో జ‌రిగిన లెజిస్ట్లేటివ్ పార్టీ మీటింగ్ లో ఆయ‌న ఎక్క‌డో ఆఖ‌రి వ‌ర‌స‌లో కూర్చున్నాడ‌ట‌. తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గిన వ్య‌క్తి అలా ఆఖ‌రి వ‌ర‌స‌ల్లో కూర్చోవ‌డం సీనియర్లు గౌర‌వ ప్ర‌దంగా ముందు వ‌ర‌స‌లో కూర్చోవ‌డం బీజేపీ సంప్ర‌దాయంలో భాగం కావొచ్చు. అయితే సీఎం సీటు మాత్రం ఆఖ‌రి వ‌ర‌స‌లో కూర్చున్న ఆ తొలిసారి ఎమ్మెల్యే కే ద‌క్కింది! ఆయ‌న ఎక్క‌డ కూర్చున్నాడ‌నేది కాకుండా, ఆయ‌న‌ను సీఎంగా ప్ర‌క‌టించారు తోటి ఎమ్మెల్యేలు!

మ‌రి ఇదంతా బీజేపీ త‌న భ‌విష్య‌త్త‌కు బాటలుగా కొత్త వారికి అవ‌కాశం ఇవ్వ‌డ‌మే అనుకోవాలా, పూర్తిగా అధిష్టానం అదుపాజ్ఞ‌ల్లో ఉంటార‌నే ఇలా కొత్త వారికి, ఊహ‌ల్లో కూడా లేని వారికి అవ‌కాశాలు ద‌క్కుతున్నాయా అనేదే ఆస‌క్తిదాయ‌క‌మైన ప్ర‌శ్న‌!

One Reply to “బీజేపీ సీఎంలు.. ఇది కొత్త నీరా, సీనియ‌ర్ల‌కు వీడ్కోలా!”

Comments are closed.