రాజకీయాలకు శశిథరూర్​ కొత్త భాష్యం

థరూర్ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన కేరళ కాంగ్రెస్ నేతలు, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారు.

సాధారణంగా ఏ పార్టీలోనైనా సరే అందులో ఉన్న నాయకులు పార్టీ లైన్​కు, అంటే దాని ఆలోచనా విధానానికి, సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి. అందుకు భిన్నంగా మాట్లాడితే పార్టీని ఎదిరించినట్లు, ధిక్కరించినట్లు భావిస్తారు. కాని కాంగ్రెసు సీనియర్​ నాయకుడు, కేరళకు చెందిన శశిథరూర్​ పార్టీ రాజకీయాలకు కొత్త భాష్యం చెప్పారు.

ఎప్పుడూ పార్టీ ప్రయోజనాల కోసమే మాట్లాడాలా? అని ప్రశ్నించారు. ఆ పని చేయడం తనవల్ల కాదని తెగేసి చెప్పారు. అంటే ప్రభుత్వం మంచి పని చేస్తే ప్రశంసించడం తప్పు కాదని అన్నారు. సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం మంచి పని చేసినా దానికి ఈకలు తోకలు తీసి విమర్శిస్తుంటాయి. కాని థరూర్​ మాత్రం ప్రభుత్వం మంచి పని చేస్తే మెచ్చుకోవాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఒకవేళ తాను పార్టీ లైన్​ దాటినట్లుగా నాయకత్వం భావిస్తే, తాను పార్టీ నుంచి వెళ్లిపోతానని అన్నట్లుగా మాట్లాడాడు. తను ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెప్పాడు. ఇంతకూ థరూర్​ చేసిన పాపమేమిటి అంటే…ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ​ను కలవడాన్ని, కేరళలో వామపక్ష ప్రభుత్వ విధానాలను థరూర్​ ప్రశంసించారు. దీనిపై విమర్శలు వచ్చినట్లున్నాయి.

అందుకే అధిష్టానం తనపై ఏమైనా చర్యలు తీసుకుంటుందేమోనని భావించిన థరూర్​, ఒకవేళ అదే జరిగితే తనకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్నాడు. అంటే మరో పార్టీలో చేరతాడని అర్థం. ఆయన బీజేపీ వైపు చూస్తున్నాడా అనే అనుమానం కలుగుతోంది. థరూర్​ గతంలోనూ మోదీని ప్రశంసించారు. 2014 లో కూడా మోదీని ప్రశంసించినందుకు థరూర్​పై బహిష్కరణ వేటు వేయాలని అనుకున్నారు.

అప్పట్లో ప్రధాని మోడీపై పొగడ్తల వర్షం కురిపించిన శశిథరూర్‌పై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై బహిష్కరణ వేటు వేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ వడివడిగా అడుగులు వేసింది కూడా. అప్పట్లో ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ కార్యక్రమంపై మోడీని శశిథరూర్ పొగిడారు.

ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీలో మూడు, నాలుగు రోజులుగా రసవత్తరమైన చర్చ జరిగింది. ఆయన తన వ్యవహార సరళిని మార్చుకోవాలని కేరళ కాంగ్రెస్ కూడా హెచ్చరించింది. అయినప్పటికీ శశిథరూర్ తన మాటల వేడిని ఏమాత్రం తగ్గించలేదు. దీంతో థరూర్ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన కేరళ కాంగ్రెస్ నేతలు, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారు.

ఆరెస్సెస్, బీజేపీ విధివిధానాలను కాంగ్రెస్ ఎన్నడూ కీర్తించిన ఘటనలు చరిత్రలో లేవని వారు గుర్తు చేశారు. కానీ, శశిథరూర్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడం ఆ పార్టీ నియమనిబంధనలను ఉల్లఘించడమేనని వారు చెప్పారు. మరోవైపు గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని కీర్తిస్తే తప్పేమిటని థరూర్ వాదించారు. కాని ఆ తరువాత థరూర్​ను బహిష్కరించే ఆలోచనను కాంగ్రెసు అధిష్టానం విరమించుకుంది. ఇప్పుడు మళ్లీ వివాదం మొదలైంది కాబట్టి అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి.

8 Replies to “రాజకీయాలకు శశిథరూర్​ కొత్త భాష్యం”

  1. సుబ్రమణ్య స్వామి, శశి థరూర్ లాంటి వారు వ్యక్తిగతంగా మేధావులు. కానీ వాళ్ళని మెనేజ్ చెయ్యడం కష్టం యే పార్టీ వాళ్ళకి అయిన సరే. అందుకే ఇలాంటి వారికి సొంత పార్టీ వాళ్ళతోనే సండ.

Comments are closed.