ఇప్పటికే నలుగురు రెడ్లు.. విస్తరణలో మరో ఇద్దరు?

కీలకమైన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లేకపోవడం కొన్ని దశాబ్దాల్లో ఇదే తొలిసారి.

తెలంగాణ కేబినెట్​ విస్తరణ రెండో తేదీనో, మూడో తేదీనో జరుగుతుందని చెబుతున్నారు. సీఎం ఉగాది రోజు గవర్నర్​ను కలిసి ఎవరెవరినీ మంత్రులుగా తీసుకునేది లిస్టు కూడా ఆయనకు ఇచ్చారట. ఆ లిస్టులో (నలుగురు) ఎవరెవరి పేర్లు ఉన్నాయో మీడియాలో వైరల్​ అవుతోంది. వారి పేర్లే ఖరారైనట్లు సమాచారం. దాని ప్రకారం కేబినెట్​లో రెడ్డి సామాజికవర్గం డామినేషన్​ పెరిగే అవకాశం కనబడుతోంది. కేబినెట్​లో చేర్చుకోవడానికి వ్యతిరేకత ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వబోతున్నారు. వారిద్దరు ఎవరో దాదాపు అందరికీ తెలుసు.

ఒకరు కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి, మరొకరు గడ్డం వివేక్​. వీరిద్దరు కాంగ్రెసు పార్టీ నుంచి బయటకు వెళ్లి ఎన్నికల ముందు మళ్లీ చేరారు. వీరిద్దరిపట్ల ఉన్న వ్యతిరేకత ఏమిటో తెలుసు. రాజగోపాల్​ రెడ్డి అన్నయ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ మంత్రి. ఆయన తమ్ముడైన రాజగోపాల్​ రెడ్డికి పదవి ఇవ్వడం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక మాల సామాజికర్గానికి చెందిన వివేక్​కు మంత్రి పదవి ఇవ్వడాన్ని మాదిగ సామజికవర్గం వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అదీ కాకుండా ఆయన అన్నయ్య వినోద్​ ఎమ్మెల్యే. మరో కుటుంబ సభ్యుడు వంశీకృష్ణ ఎంపీ.

వివేక్​తో కలుపుకుంటే ముగ్గురూ చట్టసభల్లో సభ్యులే. ఇప్పుడు అదనంగా వివేక్​కు మంత్రి పదవి. కోమటిరెడ్డి కుంటుంబం, వివేక్​ కుటుంబం రాజకీయంగా, ఆర్థికంగా చాలా బలమైనవి. వీరు పార్టీకి ఉపయోగపడతారు. రాజకీయంగా, ఆర్థికంగా అండగా ఉంటారు. ఈ కారణాలవల్ల వీరికి మంత్రి పదవులు ఇస్తుండవచ్చు. వీళ్లకు మంత్రి పదవులు ఇస్తామని అధిష్టానం ఆల్రెడీ హామీ ఇచ్చిందట. ప్రస్తుతం కేబినెట్​లో ఆరు పదవులు భర్తీ చేయాల్సి ఉంది. కాని ఇప్పుడు నాలుగు పదవులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఈ నాలుగు పదవులను నాలుగు సామాజికవర్గాలకు ఇవ్వాలని అనుకున్నారు. ఎస్సీ, బీసీ, రెడ్డి, ముస్లిం. కాని ఇప్పుడు రెడ్డి సామాజికవర్గానికి రెండు పదవులు ఇవ్వబోతున్నారు.

ఒకరు కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి, మరొకరు బోధన్​ ఎమ్మెల్యే పి. సుదర్శన్​ రెడ్డి. వీరిద్దిరికీ ఇస్తే కేబినెట్​లో రెడ్డి సామాజికవర్గం డామినేషన్​ పెరుగుతుంది. ఆల్రెడీ సీఎం రేవంత్​రెడ్డి, మంత్రులు ఉత్తమ్​కుమార్​ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు చేరితే రెడ్డి మంత్రులు ఆరుగురు అవుతారు. ఎస్సీల్లో జి. వివేక్​కు పదవి ఇస్తున్నారు. బీసీల్లో ముదిరాజ్​ సామాజికర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి పదవి ఇస్తున్నారని సమాచారం. ఇంకో రెండు మంత్రి పదవులు భర్తీ చేయాలి కాబట్టి మిగిలిన సామాజికవర్గాలకు అప్పుడు అవకాశం ఇస్తారేమో. ఇప్పటి విస్తరణలో అయితే సామాజిక సమతుల్యత లేదని చెప్పవచ్చు.

మాదిగ, లంబాడా, ముస్లిం సామాజికవర్గాలకు అన్యాయం జరిగింది. మంత్రి పదవులు ఇవ్వాలని సామాజికవర్గాలే కాదు, జిల్లాల నుంచి కూడా డిమాండ్​ వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. తాజాగా…ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఒక్కతాటిపైకి వచ్చారు. ఇప్పటి వరకు ఒక్కరికీ కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో స్థానంలేనందున ఈసారి మంత్రివర్గ విస్తరణపై ఎమ్మెల్యేలు కొండంత ఆశపెట్టుకుని ఎవరికి వారే తీవ్రంగా ప్రయత్నించారు. అయితే సానుకూల సంకేతాలు లేకపోవడంతో అంతా కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. తమలో ఎవరో ఒకరికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 14 స్థానాల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం), ప్రసాద్‌కుమార్‌ (వికారాబాద్‌), టి.రామ్మోహన్‌రెడ్డి (పరిగి), మనోహర్‌రెడ్డి (తాండూరు) గెలిచారు. ఆల్రెడీ ప్రసాద్‌కుమార్‌కు స్పీకర్‌ స్థానం దక్కింది. కీలకమైన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లేకపోవడం కొన్ని దశాబ్దాల్లో ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఆ నలుగురు ఎమ్మెల్యేలు తమలో ఒకరికి అవకాశం కల్పించాలని కోరుతూ పార్టీ అధిష్ఠానానికి ఇచ్చేందుకు లేఖ సిద్ధం చేశారు.

హైదరాబాద్‌ జిల్లా నుంచి కూడా మంత్రివర్గంలో స్థానం లేకపోవడాన్ని ప్రస్తావించారు. ఈ లేఖపై స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ సంతకం చేసినట్లు ఒక ఎమ్మెల్యే తెలిపారు. ఈ లేఖతో ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లి రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గేను కలుస్తారు. మరి కేబినెట్​ విస్తరణ జరిగాక కాంగ్రెసులో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో చూడాలి.

11 Replies to “ఇప్పటికే నలుగురు రెడ్లు.. విస్తరణలో మరో ఇద్దరు?”

  1. అయితే. S C. . ST అయిన అవ్వాలి లేక పోతే. బాగా డబ్బు అయిన ఉండాలి దాని బట్టి మంత్రులు వస్తాయి

  2. ఎన్నికలముందు ఖర్చులు పెట్టుకొనేప్పుడు ఈ మాట అనలేదే .. ఎందుకు ఖర్చులు అన్నీ రెడ్లే పెట్టుకుంటున్నారు మిగతావాళ్లని కూడా పెట్టమని అడగండి అనలేదే

  3. ఇప్పుడు CM కాకుండా ఉన్నది ముగ్గురు రెడ్లు . మన KCR గోవేర్నమేంట్ లో మొదటిసారి 6 , రెండొవ సారి 7 గురు రెడ్లు ఉన్నారు

Comments are closed.