రేవంత్ రెడ్డి పాలన ఏడాది పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ రెండో ఏడాదే అంటే కొత్త ఏడాదిలోనే అగ్నిపరీక్షను ఎదుర్కోబోతోంది. అంటే కొత్త ఏడాది సర్కారుకు రిఫరెండం అన్నమాట. ఎందుకంటే ….జీహెచ్ ఎంసీ ఎన్నికలతోపాటు అన్ని రకాల స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతున్నాయి.
మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు జనవరి 26 తో ముగుస్తుంది. గ్రామ పంచాయతీల గడువు ఫిబ్రవరితో ముగుస్తుంది. జిల్లాపరిషత్తుల గడువు జూలైతో ముగుస్తుంది. కాబట్టి అన్నిటికీ ఎన్నికలు నిర్వహించాల్సిందే. అందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దశలవారీగా ఈ ఎన్నికలు జరుగుతాయి.
ముందుగా జనవరి నుంచి మార్చి వరకు నిర్వహిస్తారు. కేవలం ఈ ఎన్నికలే కాకుండా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నాయి. మార్చిలో ఒక పట్టభద్రుల నియోజకవర్గానికి కూడా ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఈ అన్ని ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ సర్కారు పాలనకు రిఫరెండంగానే భావించాలి. రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై ఓటర్లు తీర్పు చెబుతారు.
రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటినుంచి కుతకుత ఉడికిపోతూ ఆపకుండా విమర్శలు చేస్తున్న గులాబీ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను తప్పనిసరిగా సీరియస్ గా తీసుకుంటుంది. ఈ ఎన్నికల కోసమే ఆ పార్టీ ఎదురుచూస్తోంది. బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీకి శత్రువే కాబట్టి ఆ పార్టీ కూడా తప్పనిసరిగా సీరియస్ గానే తీసుకుంటుంది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఇంకా కొన్ని నెరవేర్చాల్సి ఉంది. పంచాయతీ ఎన్నికల్లో రైతులే కీలకం కాబట్టి రైతు భరోసా అమలుకు కసరత్తు చేస్తోంది. సంక్రాంతికల్లా అమలు చేస్తామని చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొంతకాలానికే గులాబీ పార్టీ హామీలు అమలు చేయాలని పట్టుబట్టింది. రైతు రుణ మాఫీపై ఎంత రచ్చ చేసిందో తెలిసిందే.
ఇప్పటికీ రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని విమర్శలు చేస్తూనే ఉంది. ఇక ఇరిగేషన్ ప్రాజెక్టులపై, విద్యుత్ పై వేసిన విచారణ కమిషన్లు, కేటీఆర్ పై ఫార్ములా -ఈ రేసు కుంభకోణం కేసు, కవితపై ఉన్న ఢిల్లీ లిక్కర్ కేసు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపించవచ్చు. ఈ కేసుల కారణంగా కేసీఆర్ కుటుంబం పట్ల సానుభూతి పెరుగుతుందా ? కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందా చూడాలి.