ఆయన ఆ తప్పు చేశాడు.. అధికారం దక్కలేదు!

పాలకుర్తిలో తనకు కూడా టిక్కెట్​ ఇవ్వొద్దని చెప్పానని, అయినా కేసీఆర్​ వినకుండా తనను నిలబెట్టాడని, ఫలితంగా ఓడిపోయానని చెప్పాడు.

రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్​ఎస్​ మూడోసారి ఎందుకు అధికారంలోకి రాలేకపోయింది? ఈ ప్రశ్నకు రాజకీయ విశ్లేషకులు, పొలిటికల్​ లీడర్స్​, సామాన్య ప్రజలు అనేక రకాల సమాధానాలు చెబుతున్నారు. ఈ సమాధానాలు, విశ్లేషణలు ఎలా ఉన్నా సీఎం రేవంత్​ రెడ్డి సహా అందరూ అంగీకరించే విషయం ఏమిటంటే…కేసీఆర్ పై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతే బీఆర్​ఎస్​ను ఓడించింది. కాంగ్రెసును అధికారంలోకి తెచ్చింది.

దీన్ని కేసీఆర్​ ఒప్పుకోకపోచ్చు. కాని ఇదే నిజం. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమికి 170 కారణాలు తమ దృష్టికి వచ్చాయని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొత్తలో చెప్పాడు. ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు, క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా పార్టీ నేతలు ఈ విషయాలను తమ దృష్టికి తెచ్చారని అన్నాడు. పార్టీ అంతర్గత సమస్యలు, కాంగ్రెస్‌ పార్టీ చెప్పిన అబద్ధాలు, ప్రజల్లో చేసిన దుష్ప్రచారం వంటి 170కిపైగా కారణాలు మా దృష్టికి వచ్చాయి.

పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టి ఉంటే బాగుండేదని, పదేళ్లలో పార్టీ నిర్మాణాన్ని ఇంకా సుధృడం చేసి ఉంటే కార్యకర్తల్లో నిస్తేజం ఉండేది కాదని అన్నాడు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేల పై తీవ్ర వ్యతిరేకత, తాము ఎవరిని నిలబెట్టినా జనం గెలిపిస్తారన్న అతి విశ్వాసం, ప్రజా సమస్యల కోసం పోరాటం చేసే పార్టీలపై నిరంకుశ వైఖరి ప్రదర్శించడం మొదలైనవి బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ఉన్న అనేక కారణాల్లో ప్రధానమైందిగా చెప్పవచ్చు. ప్రజలు వ్యతిరేకిస్తున్న చాలామంది ఎమ్మెల్యేలకు కేటీఆర్​ టిక్కెట్లు ఇచ్చాడు.

వాళ్లందరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ జనం చచ్చినట్లు గెలిపిస్తారనే అతి విశ్వాసంతో వారందరికీ టిక్కెట్లు ఇచ్చాడు కేసీఆర్. సరే…కేసీఆర్​ వ్యవహారశైలి, వైఫల్యాలు చాలా ఉన్నాయనుకోండి. తాజాగా ఇదే విషయాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు చెప్పాడు. 30 స్థానాల్లో ఎమ్మెల్యేలను మార్చి వేరే వాళ్లకు టిక్కెట్లు ఇవ్వాలని తాను ఆనాడు కేసీఆర్​కు ఎంతో చెప్పానని, అయినా ఆయన వినకుండా పాతవారికే టిక్కెట్లు ఇచ్చాడని, అందుకే పార్టీ ఓడిపోయిందని అన్నాడు.

పాలకుర్తిలో తనకు కూడా టిక్కెట్​ ఇవ్వొద్దని చెప్పానని, అయినా కేసీఆర్ ​వినకుండా తనను నిలబెట్టాడని, ఫలితంగా ఓడిపోయానని చెప్పాడు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినోడు ముఖ్యమంత్రి అయ్యాడని, ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను ఓడిపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. తనపట్ల ప్రజల్లో ఏమీ వ్యతిరేకత లేదని, అయిన్పటికీ తానే టిక్కెట్​వద్దని చెప్పానని అన్నాడు. అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలను, ప్రజలకు దూరమైన వారిని కేసీఆర్​ వదులుకోలేదు కాబట్టి కేసీఆర్​ను ప్రజలు వదిలేశారు. కాని కేసీఆర్​ ఇప్పటికీ ఈ సత్యాన్ని గ్రహించడంలేదు.

One Reply to “ఆయన ఆ తప్పు చేశాడు.. అధికారం దక్కలేదు!”

  1. మూడు సార్లు గెలిస్తే తక్కువ ఏడు సార్లు గెలిస్తే ఎక్కువ అని ఎవరూ చెప్పారు ఎర్రబెల్లి? ఎవరి స్టామినా ఎంత అని చూడాలి. రేవంత్ రెడ్డి చేసినన్ని సాహసాలు నువ్వు చేసావా? నీది అంతా సేఫ్ గేమ్.

Comments are closed.