తెలంగాణ కేబినెట్ విస్తరణలో మంత్రి పదవులు ఆశించి, చివరకు విస్తరణ వాయిదా పడటంతో నిరాశ చెందిన నాయకులు ఒక్కొక్కరుగా పార్టీపై, నాయకులపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. గొంతు పెంచి మాట్లాడుతున్నారు. తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘నాకే మంత్రి పదవి ఇవ్వరా?’ అన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీనియర్ నాయకుడు జానా రెడ్డిపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే కదా.
తనకు మంత్రి పదవి రాకపోవడానికి జానా రెడ్డే కారణమని బహిరంగంగానే విమర్శించాడు. ఆయన హైకమాండ్‌కు లేఖ రాసిన కారణంగానే తనకు పదవి ఇవ్వలేదని మండిపడ్డాడు. ‘అన్నదమ్ములు మంత్రులుగా ఉంటే తప్పేంటి?’ అని ప్రశ్నించాడు. జానా రెడ్డి ధృతరాష్ట్రుడి మాదిరిగా తనకు అడ్డుపడ్డాడని ఆక్రోశించాడు. తాజాగా మరో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈయన కూడా సీనియర్ నాయకుడే. డాక్టర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలోనే మండిపడ్డాడు.
ఆయనే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మొన్నటి మంత్రివర్గ విస్తరణలో ఈయన పేరు కూడా వినిపించింది. తీరా విస్తరణ రద్దయ్యేసరికి తీవ్రంగా నిరాశ చెందాడు. ‘మంత్రి పదవి విషయంలో నాకు అన్యాయం జరిగితే సహించను’ అని అధిష్ఠానాన్ని హెచ్చరించాడు. తనకు పదవి ఇవ్వకుంటే ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేసినట్లే అన్నాడు. జిల్లాలో పదేళ్లుగా పార్టీని కాపాడుకుంటూ వస్తున్నానని, ఇంత కష్టపడ్డందుకు తనకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించాడు.
పార్టీలు మారి వచ్చిన వారికి మంత్రి పదవులు కావాలా? అంటూ పరోక్షంగా రాజగోపాల్ రెడ్డిని విమర్శించాడు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని అధిష్ఠానం నిర్ణయించిన తరుణంలో తన గొంతు కోసేందుకు ఓ కుటుంబం ప్రయత్నిస్తోందన్నాడు. గొంతు కోస్తే ఊరుకోనని, ఆ కుటిల యత్నాలను తిప్పికొట్టేందుకు తానూ సిద్ధంగా ఉన్నానని అన్నాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇంకా ఎవరికీ మంత్రి పదవి దక్కలేదు.
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేకానంద్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌లు మంత్రి పదవుల రేసులో ఉన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దాదాపు 14 సంవత్సరాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో అందరూ కాంగ్రెస్ పార్టీని వీడిపోతూ వచ్చినా ఆయన మాత్రం పార్టీకి కట్టుబడి ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ సజీవంగా ఉందంటే అది ప్రేమ్ సాగర్ రావు కృషి వల్లనే అని కాంగ్రెస్ క్యాడర్ భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 66 వేలకుపైగా భారీ మెజార్టీతో విజయం సాధించాడు ప్రేమ్ సాగర్ రావు.
aithe na M kudu reddy