కాంగ్రెసు పార్టీపై ఇష్టంతో జనం గెలిపించలేదు!

అహంకారం కనిపించింది. అవినీతి కనిపించింది. అందుకే పక్కకు పెట్టి కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తెచ్చారు.

రెండోసారీ తానే సీఎంని అవుతానని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశాడు. గుడ్…మంచిదే. ఆ కాన్ఫిడెన్స్ ఉండటం మంచిదే. కాని రెండోసారి జనం కాంగ్రెసు పార్టీని ఎందుకు గెలిపిస్తారు? మళ్లీ రేవంత్ రెడ్డినే సీఎంగా ఎందుకు చేస్తారు? ఎందుకంటే జనాలకు ఆయన మీద ప్రేమ ఉందట. ఈ విషయం ఆయనే చెప్పాడు.

అంటే వచ్చే ఎన్నికలనాటికి జనానికి రేవంత్ రెడ్డి మీద ప్రేమ పెరుగుతుందన్నమాట. మొదటిసారి కాంగ్రెసు పార్టీని ఎందుకు గెలిపించారు? ఆ పార్టీ మీద ప్రేమతోనా? కాదు. కాదనే విషయం కూడా రేవంత్ రెడ్డే చెప్పాడు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద వ్యతిరేకత కారణంగా జనం కాంగ్రెసు పార్టీని గెలిపించారు. ఈ విషయం కూడా రేవంత్ రెడ్డే చెప్పాడు.

అంటే కాంగ్రెసు పార్టీ మీద జనాలకు ప్రేమ ఉండి గెలిపించలేదని అర్థమవుతోంది కదా. కాంగ్రెసు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనేది నిజం. దీనికి బీఆర్ఎస్ నాయకులు, ఆ పార్టీ మీడియా చేస్తున్న ప్రచారమూ తోడైంది. పథకాల అమల్లో కొన్ని వైఫల్యాలు ఉన్న మాట వాస్తవం. కొన్ని హామీలు నెరవేరని మాట వాస్తవం. కొన్ని పథకాలు భారంగా మారిన మాట వాస్తవం.

అయినప్పటికీ ఇప్పటికే ఏడాది పాటు పరిపాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. వచ్చేసారి జరిగే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని.. తను ముఖ్యమంత్రి అవుతానని నిండు శాసనసభ వేదికగా ప్రకటించాడు. ” అనుమానమే లేదు.. ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చాను. నేరుగా ముఖ్యమంత్రి అయ్యాను. ఏడాదిపాటు పరిపాలన విజయవంతంగా పూర్తి చేశాను. ఇంకా నాలుగు సంవత్సరాల పాటు పరిపాలన సాగించాల్సి ఉంది. వచ్చే టర్మ్ కూడా నేనే ముఖ్యమంత్రి అవుతానని” రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించాడు.

రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు అంత కాన్ఫిడెన్స్ ఎక్కడిది? అనే ప్రశ్న తెలంగాణ రాజకీయాలలో వ్యక్తమౌతోంది. రేవంత్ రెడ్డి పై భారత రాష్ట్ర సమితి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నప్పటికీ.. ప్రభుత్వపరంగా లోటుపాట్లు కనిపిస్తున్నప్పటికీ.. రెండోసారి కూడా ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

అయితే భారత రాష్ట్ర సమితి క్షేత్రస్థాయిలో బలం కోల్పోయిందని.. కాంగ్రెస్ పార్టీ బలాన్ని అలాగే ఉంచుకుందని.. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిందని.. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్యనే పోటీ ఉంటుందని.. అందువల్లే రేవంత్ రెడ్డి ఆ తరహా వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి తన తరఫున అభ్యర్థిని పోటీలో దించలేదు.

అందువల్లే రేవంత్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి.. తన నాయకత్వాన్ని అధిష్టానం ముందు ఉంచి.. ముఖ్యమంత్రి అవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ రెండవ సారి కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే… తెలంగాణ రాష్ట్రంలో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయిన రెండవ వ్యక్తిగా రేవంత్ రెడ్డి నిలుస్తారు.

ఎందుకంటే 2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్ ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి విజయం సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా కెసిఆర్ రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు తొమ్మిది సంవత్సరాలపాటు పరిపాలన సాగించారు. సరే…గెలుపు మీద, పదవుల మీద రాజకీయ నాయకులు నమ్మకం వ్యక్తం చేయడం మామూలే. కేసీఆర్ కూడా తాను మూడోసారి అధికారంలోకి వస్తానని అనుకున్నారు కదా. తెలంగాణను నెంబర్ వన్ స్థానంలో నిలిపిన తననే ప్రజలు ఆదరించి సింహాసనం మీద కూర్చోబెడతారని అనుకున్నారు.

కాని ప్రజలు ఆయన పాలనలోని లోపాలు కనిపించాయి. వైఫల్యాలు కనిపించాయి. అహంకారం కనిపించింది. అవినీతి కనిపించింది. అందుకే పక్కకు పెట్టి కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తెచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ప్రేమతో కాంగ్రెసు పార్టీని గెలిపిస్తారని, మళ్లీ తానే సీఎం అవుతానని రేవంత్ రెడ్డి ఆశ పడుతున్నాడు. కాంగ్రెసు పార్టీ గెలవొచ్చు. కాని మళ్లీ రేవంతే సీఎం అవుతాడని నమ్మకం ఏమిటి? ఎందుకంటే అది కాంగ్రెసు పార్టీ కాబట్టి.

2 Replies to “కాంగ్రెసు పార్టీపై ఇష్టంతో జనం గెలిపించలేదు!”

Comments are closed.