కేబినెట్​ విస్తరణలో పీటముడి.. మరింత ఆలస్యం!

కేబినెట్​ విస్తరణ అనేది పీటముడి పడినట్లే. దాన్ని చాలా జాగ్రత్తగా విప్పాలి.

తెలంగాణ కేబినెట్​ విస్తరణ పీటముడి పడింది. ఢిల్లీలోని అధిష్టానం పెద్దలు జుట్టు పీక్కుంటున్నారని సమాచారం. దీంతో విస్తరణ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందు అనుకున్నట్లు రెండో తేదీ లేదు. మూడో తేదీ ఉండదు. అసలు ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియదు. కేబినెట్​ విస్తరణపై తనకు ఎలాంటి సమాచారం లేదని మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి అన్నారు. దీన్నిబట్టి విస్తరణ ఇప్పట్లో కాదని అర్థమవుతోంది. భర్తీ చేయాల్సిన ఆరు పదవులకు లెక్కలేనంతమంది ఆశావహులు ఉన్నారు. సామాజికవర్గాలవారీగా, జిల్లాల వారీగా మంత్రి పదవులు డిమాండ్​ చేస్తున్నారు. ముందుగా నాలుగు పదవులు భర్తీ చేయాలనుకున్నారు. ఆ తరువాత అయిదు పదవులు అన్నారు. ఇప్పుడు ఈ తలనొప్పి అంతా ఎందుకు ఒకేసారి ఆరు పదవులు భర్తీ చేస్తే ఓ పనైపోతుంది కదా అని పెద్దలు ఆలోచిస్తున్నారట.

ఒకేసారి ఆరు పదవులు భర్తీ చేయాలన్నా, మంత్రి పదవులు డిమాండ్​ చేస్తున్న సామాజికవర్గాలకు న్యాయం చేయాలన్నా ప్రస్తుత మంత్రుల్లో ఇద్దరిని తొలగించాలని అంటున్నారు. ఇద్దరిని తొలగిస్తారని కొంతకాలంగా కొన్ని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. బీఆర్​ఎస్​ అనుకూల మీడియాలోనూ ఈ సమాచారం వచ్చింది. వాళ్ల పేర్లు కూడా వచ్చాయి. ఆ ఇద్దరిలో ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిన మహిళా మంత్రి. అందులోనూ ఆమె బీసీ. ఈ ఇద్దరు మంత్రులను తొలగిస్తే రేవంత్​రెడ్డికి తల బొప్పికట్టే అవకాశం ఉంది. కేబినెట్​లో కొత్తగా ఇద్దరు రెడ్లకు స్థానం కల్పించాలనుకోవడంతో కేబినెట్​లో ఆ సామాజికవర్గం ఆధిక్యం పెరుగుతుందనే భయం మిగతా సామాజికవర్గాల్లో ఉంది. ఇక విస్తరణలో మాల సామాజికవర్గానికి స్థానం కల్పించి మాదిగలను విస్మరించడంతో ఆ సామాజికవర్గం కూడా గుర్రుగా ఉంది.

ఎస్టీల్లోని లంబాడా సామాజికవర్గానికి మంత్రి పదవి కాకుండా వేరే పదవి ఆఫర్​ చేస్తున్నారు. దీనికి వారు ఒప్పుకోవడంలేదు. కేసీఆర్​ ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చాడని చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల్లో ఒకరికి మంత్రి పదవి అది పార్టీకి నష్టం కలిగిస్తుందని సీనియర్​ నేత జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాయడంతో ఆ జిల్లా ఎమ్మెల్యేల్లో ఆశలను చిగురింపచేస్తోంది. వారు మంత్రి పదవి కోసం గట్టిగా పట్టుపడుతున్నారు. వారిలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కు చీఫ్​ విప్​ పదవి ఆఫర్​ చేస్తే ఆయన తనకు మంత్రి పదవే కావాలని, లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వార్నింగ్​ ఇచ్చారు. ఏ కులానికి మంత్రి పదవి ఇవ్వకపోయినా ఆ కులం పార్టీకి దూరమయ్యే అవకాశం ఉంటుందని అధిష్టానం భయపడుతోంది.

ఇక కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డికి మంత్రి పదవి ఇస్తే తన భార్యకూ ఇవ్వాలని మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డి డిమాండ్​ చేస్తున్నారని మీడియాలో ప్రచారం జరుగుతోంది. సందట్లో సడేమియా మాదిరిగా విజయశాంతికి మంత్రి పదవి కూడా చర్చకు వస్తోంది. రేవంత్​ రెడ్డితో సంబంధం లేకుండా, ఆయన ప్రమేయం లేకుండా అధిష్టానం పెద్దలను కలిసి ఎమ్మెల్సీ టిక్కెట్​ తెచ్చకున్న విజయశాంతి ఇప్పుడు మంత్రి పదవి కోసం కూడా పావులు కదుపుతుందని కొందరు చెబుతున్నారు. ఆమె కూడా ఎస్టీ అంటున్నారు. నిజానికి ఆమె కులమేమిటో ఈనాటి వరకు సరిగ్గా తెలియదు. మొత్తంమీద కేబినెట్​ విస్తరణ అనేది పీటముడి పడినట్లే. దాన్ని చాలా జాగ్రత్తగా విప్పాలి. లేకుంటే అంతా చిన్నాభిన్నం అవుతుంది.

3 Replies to “కేబినెట్​ విస్తరణలో పీటముడి.. మరింత ఆలస్యం!”

  1. “మా మంత్రివర్గాన్ని మీరే నిర్ణయించండి” అని ఏకవాక్య తీర్మానం చేసి సోనియా గాంధీకి పంపించలేదా?

Comments are closed.