గోడ్సే వాదన – 1943లో జైల్లో గాంధీ నిరాహారదీక్ష చేస్తున్నపుడు అధికారులు రాజకీయాలపై ఆయనతో చర్చించడానికి ఎవరికీ అనుమతి యివ్వలేదు. రాజాజీ గాంధీ గదిలోకి చాటుగా చేరుకుని, పాకిస్తాన్ యివ్వటానికి ఒక కుట్ర పన్ని, దాని విషయమై జిన్నాతో సంప్రదింపులు జరపడానికి గాంధీ అనుమతి పొందాడు. కొంతకాలం తర్వాత 1944 సంవత్సరం ఆఖరి భాగంలో గాంధీ దీని విషయమై జిన్నాతో మూడు వారాలపాటు సంప్రదింపులు చేసి యిప్పుడు పాకిస్తాన్ అని దేన్ని పిలుస్తున్నామో పూర్తిగా దాన్ని జిన్నాకు సమర్పించే ప్రతిపాదన చేశాడు.
(ఇది పూర్తిగా నిరాధారమైన ఆరోపణ. గాంధీ దేశవిభజనకు ఒప్పుకుని వుంటే స్వాతంత్య్రం యివ్వడానికి 1942లో బ్రిటన్ ఒప్పుకుని వుండేది. పాకిస్తాన్ ఏర్పాటును సూత్రప్రాయంగా అంగీకరిస్తే చాలు, యుద్ధసమయంలో భారత ప్రతినిథులతో వైస్రాయి కౌన్సిల్ ఏర్పరుస్తామని క్రిప్స్ ప్రతిపాదించాడు కదా. చర్చిల్ వంటి సామ్రాజ్యవాది కూడా ఆ మేరకు దిగి వచ్చాడంటే కారణం – అప్పట్లో బ్రిటన్ పరిస్థితి బొత్తిగా బాగా లేదు. అక్షరాజ్య కూటమిలోని ఇటలీ ఈజిప్టుపై దాడి చేసింది. సూయజ్ కెనాల్‌ను అదుపులోకి తెచ్చుకుంటే ఇంగ్లండ్ సామ్రాజ్యంలోని విభిన్న ప్రాంతాలకు లింకు తెగిపోతుంది. ఇండియాలోని పాలకులకు, ఇంగ్లండ్‌లోని పాలకుల ఆదేశాలు అందవు. 'అలాటి పరిస్థితి వస్తే మా ఆదేశాలకై ఎదురు చూడకుండా ఇండియాలోని వైస్రాయ్ జనరల్ స్వతంత్రంగా వ్యవహరించవచ్చు' అని బ్రిటిషు పార్లమెంటు తీర్మానం చేసింది. ఇటలీ ఈజిప్టు, ఇరాన్‌ల మీదుగా ఇండియాపై దాడి చేసే ప్రమాదం ఒక పక్కన వుండగా, మరో పక్క జపాన్ తూర్పునుంచి దండెత్తుతూ వచ్చింది. ఇండియాకు పొరుగున వున్న బర్మాపై దండెత్తబోతోంది. బోసును జర్మనీ నుంచి తెప్పించుకుని 1943 సంవత్సరాంతానికి ఇండియా గడ్డపై కాలు మోపడానికి సన్నాహాలు చేస్తోంది. ఇవన్నీ చూసే బ్రిటన్ క్రిప్స్‌ను పంపించింది. పాకిస్తాన్ ప్రతిపాదనను సూత్రప్రాయంగా ఒప్పుకున్నామని అంటే తప్ప ముస్లిం లీగ్ కలిసిరాదు. అది కలిసి రాకపోతే డీల్ కుదరదు. ఎందుకంటే దేశంలోని మూడు శక్తులలో అది ఒకటి.
కాంగ్రెసు కూడా పూర్తిగా గాంధీ అధీనంలో వుందనుకోవడం తప్పు. గాంధీ మెతకగా వ్యవహరించడం వలననే స్వాతంత్య్రం ఆలస్యమవుతోందని చాలామంది యువకులు, కాంగ్రెసులోని సోషలిస్టు భావాల వారు అనుకోసాగారు. 1938లో సుభాష్ బోసు కాంగ్రెసు అధ్యకక్షుడిగా వుండి గాంధీ విధానాలను వ్యతిరేకించాడు. ఆ పదవిని ఏడాది కంటె ఎక్కువగా ఎవరూ నిర్వహించరాదనే సంప్రదాయానికి విరుద్ధంగా 1939లో మళ్లీ పోటీ చేశాడు. గాంధీకి అది నచ్చక తన తరఫు అభ్యర్థిగా పట్టాభి సీతారామయ్యగారిని నిలబెట్టాడు. కానీ పట్టాభి ఓడిపోయారు. దాన్ని తన ఓటమిగా గాంధీ ప్రకటించారు. నెల తిరక్కుండా బోసు కాంగ్రెసు నుండి బయటకు వెళ్లిపోయి ''ఫార్వర్డ్ బ్లాక్'' పార్టీ ఏర్పరచి బెంగాల్లో కాంగ్రెసుకు గట్టి పోటీ నివ్వడం చరిత్ర. గమనించవలసిన దేమిటంటే గాంధీ మాటే చెల్లుబాటు అయ్యే పరిస్థితి వుంటే పట్టాభి ఎలా ఓడిపోయారు? పోనుపోను జిన్నా గాంధీని ముక్కుపట్టి ఆడిస్తున్నాడని, బ్రిటిషువారి వద్ద అతని మాటే ఎక్కువ చెల్లుబాటు అవుతోందని కాంగ్రెసువారు గమనించారు. ఇవన్నీ నాయకులలో గాంధీ పరపతిని తగ్గించాయి. చాలామంది కాంగ్రెసు విడిచి వెళ్లిపోయి వేరే పార్టీలు పెట్టుకున్నారు. వారిలో కొందరు మళ్లీ వెనక్కి వచ్చారు, కొందరు రాలేదు. 1937లో ఏర్పడిన ప్రభుత్వాలలో చేరిన కాంగ్రెసు నాయకులు అధికారంలో వున్న మజా చూశారు. వారి కంటికి గాంధీ ఆదర్శవాదే తప్ప ఆచరణ వాది కాదు. కానీ చాలామంది ప్రజలు మాత్రం గాంధీని నమ్ముతున్నారని గమనించి తగుపాటి గౌరవం యిస్తూ, మధ్యమధ్యలో విభేదిస్తూ, విమర్శిస్తూ వచ్చారు.
1942 నాటికి ముస్లిం లీగుని బ్రిటన్ విస్మరించజాలదని, విభజన జరగనిదే స్వాతంత్య్రం రాదని రాజాజీ, ఆంబేడ్కర్ బహిరంగంగా ప్రకటిస్తున్నారు. చాలామందికి రెండింటికీ లింకు వుందని అర్థమై పోయింది. అయినా గాంధీ విభజనకు ఒప్పుకోకుండా పట్టుదలతో, ఒక విధంగా చూస్తే మూర్ఖంగా వ్యవహరించారు. దేశంలో గాంధీ ఒక్కడే నాయకుడు కాడు, కానీ ప్రముఖ నాయకుడు. ఆయన ఒప్పుకోకపోతే కథ ముందుకు సాగదు. అందుకే క్రిప్స్ రాయబారం విఫలమైనా బ్రిటన్ ఓపిక పట్టింది. గాంధీ సరే అని వుంటే పేచీ ఏముంది? బ్రిటన్, ముస్లిం లీగు అందరూ హ్యాపీ. పైన చెప్పినట్లు క్రిప్సు రాయబారం తర్వాత భారత రాజకీయాల్లో తన ప్రాధాన్యత తగ్గిపోయిందని, బ్రిటన్‌లో లేబరు పార్టీ కూడా తమని అసహ్యించుకోవడం మొదలుపెట్టిందని గ్రహించిన తర్వాత తమ అస్తిత్వం నిలుపుకోవడానికే కాంగ్రెసు క్విట్ ఇండియా ఉద్యమం మొదలుపెట్టింది. ప్రకటన రాగానే బ్రిటన్ అత్యంత కఠినంగా అణచి పారేసింది. అందర్నీ జైళ్లల్లో కుక్కింది. కొన్ని వారాల్లో ఉద్యమం చల్లారిపోయింది. భారత చరిత్ర పుస్తకం చదివితే తెలుస్తుంది – 1942-45 మధ్య అంటే రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయేవరకు స్వాతంత్య్ర ఉద్యమం చల్లారిపోయిందని, 1939 నుండి వ్యక్తి సత్యాగ్రహం తప్ప వేరే యాక్టివిటీ లేదనీ! 1943లో బెంగాల్లో భయంకరమైన కరువు వచ్చింది. యుద్ధపు గొడవల్లో మునిగి వున్న బ్రిటిషు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో 30 లక్షల మంది ఆకలితో చనిపోయారు. అయినా దాన్ని ప్రజా ఉద్యమంగా మలుచుకునే రాజకీయనాయకత్వం కరువైంది. జైల్లో పడిన కాంగ్రెసు నాయకులకు తమకు ఎక్కువ ఆప్షన్లు లేవని బోధపడింది. అయినా గాంధీ విభజనకు అంగీకరించకపోవడంతో ఏమీ చేయలేక వూరుకున్నారు.
ఇక గాంధీ-జిన్నా చర్చల గురించి చెప్పాలంటే – గాంధీ రాజాజీ ద్వారా జిన్నాకు ప్రతిపాదన పంపారనడం సత్యదూరం, దుర్మార్గం. జైల్లో గాంధీ జబ్బుపడడంతో 1944 మేలో విడుదల చేశారు. జిన్నాతో చర్చలు జరిపి అతన్ని పాకిస్తాన్ డిమాండ్ వదులుకోమని నచ్చచెప్పబోయాడు. కానీ జిన్నా వినలేదు. ఇన్ ప్రిన్సిపుల్ పాకిస్తాన్‌ను నేను ఒప్పుకుంటే దాని సరిహద్దులేమిటి? అని గాంధీ జిన్నాను ప్రశ్నించాడు. గోడ్సే ఆరోపించినట్లు ఇప్పటి పాకిస్తాన్ ప్రతిపాదన అప్పట్లో ఎవరి వద్దా లేదు. అస్సామ్‌లో ముస్లిములు 33% శాతమే ఉన్నా వారి ప్రభుత్వం ఉంది కాబట్టి అది పాకిస్తాన్లో చేరాలని జిన్నా వాదన! పంజాబ్, బెంగాల్‌లలో మొత్తంగా చూస్తే ముస్లిములు మెజారిటీ కాబట్టి ఆ రాష్ట్రాలు రెండూ పూర్తిగా పాకిస్తాన్లో రావాలని డిమాండ్ చేశాడు పైగా రెండిటినీ కలపడానికి ఇండియా గుండా ఒక కారిడార్ కూడా! చివరకు దక్కినది చూసి అతను 'ఇది చెదలు పట్టిన (మాత్-ఈటెన్) పాకిస్తాన్' అని వ్యాఖ్యానించాడు. జిన్నా కోరుకున్న పాకిస్తాన్ జిన్నాకు దక్కలేదు. గాంధీ కోరుకున్న అఖండ హిందూస్తాన్ గాంధీకి దక్కలేదు. 'నా శరీరాన్నైనా చీల్చండి కానీ దేశాన్ని చీల్చవద్దని' ఆయన అనడం జరిగింది. కానీ దేశం చీలింది. గోడ్సే చెప్పినట్లు గాంధీ జిన్నాకు పాకిస్తాన్‌ను సమర్పించే ప్రతిపాదన చేసి వుంటే జిన్నా ఆనందంగా ఒప్పుకునేవాడు. దేశ విభజన అనివార్యం అని తోచినపుడు దాన్ని ఆపడానికి జిన్నాకు ప్రధానమంత్రి పదవి కట్టబెట్టడానికి కూడా గాంధీ ప్రయత్నించాడు. కానీ ఇతర కాంగ్రెసు నాయకులు దానికి ససేమిరా ఒప్పుకోలేదు. జిన్నాతో కొన్నాళ్లు మిశ్రమ ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం వారికి పాఠం నేర్పింది. కాంగ్రెసు నాయకులు గాంధీ మాట అప్పటికే లక్ష్యపెట్టడం మానేశారు. అలాటప్పుడు గాంధీని విభజనకు బాధ్యుణ్ని చేయడం తప్పు.- వ్యా.) (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2014)