సీఎం రమేష్ వైఖరితో కూటమిలో అసంతృప్తి

రాయలసీమ నుంచి అనకాపల్లి వచ్చి ఎకాఎకిన బీజేపీ తరఫున ఎంపీ అయిపోయిన సీఎం రమేష్ తన పట్టుని పార్టీలోనూ స్థానికంగా నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. దానిలో భాగంగా ఆయన బీజేపీని బలోపేతం చేయడానికి ఆపరేషన్…

రాయలసీమ నుంచి అనకాపల్లి వచ్చి ఎకాఎకిన బీజేపీ తరఫున ఎంపీ అయిపోయిన సీఎం రమేష్ తన పట్టుని పార్టీలోనూ స్థానికంగా నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. దానిలో భాగంగా ఆయన బీజేపీని బలోపేతం చేయడానికి ఆపరేషన్ కమలం అంటూ స్టార్ట్ చేశారు. బీజేపీ పిలుస్తోంది ఎవరైనా చేరవచ్చు అని ఎంపీ ఇస్తున్న ఆఫర్లు క్రిమినల్ కేసులు ఉన్న వారిని భలే ఆకర్షిస్తున్నాయని అంటున్నారు.

వైసీపీ హయాంలో చేయాల్సిన పనులు ఎన్నో చేసి పోలీసు కేసులలో ఇరుక్కున్న వారు ఇదే సరైన ఆఫర్ అంటూ బీజేపీలో చేరిపోతున్నారు. అలా పెందుర్తి మండలానికి చెందిన ల్యాండ్ పూలింగ్ బ్రోకర్లు కమలం తీర్ధం పుచ్చుకోవడానికి సర్వం సిద్ధం అయింది.

ఏదో విధంగా అధికార పార్టీలో కొనసాగితే కేసుల బెడద తప్పుతుందని క్రిమినల్ కేసులు ఉన్న వారి మాస్టర్ ప్లాన్. అయితే వచ్చిన వారిని వచ్చినట్లే చేర్చుకుని బీజేపీ బలం పెరిగింది అని చాటాలన్నది ఎంపీ గారి ఆలోచనా అని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు.

గత ప్రభుత్వ హయాంలో ల్యాండ్ పూలింగ్ పేరిట అక్రమాలకు తెర తీసి ఎంతో మంది ఉసురు పోసుకున్న వారిని చేర్చుకోవడం ద్వారా ఏమి సందేశం ఇస్తున్నారు అని ఎంపీ తీరు మీద కూటమి పక్షాలు మండిపడుతున్నాయని అంటున్నారు. బీజేపీ నేతలు అయితే ఇలాంటి వారిని చేర్చుకుంటే కమలం పరువు మర్యాదా భ్రష్టు పట్టడం ఖాయమని అంటున్నారు. అయినా పార్టీని బలోపేతం చేసుకోవడానికి వీళ్లే దొరికారా అన్న కామెంట్స్ కూడా పడుతున్నాయి. క్రిమినల్ కేసులు ఉన్న వారికి శిక్షలు పడాల్సిందే అని జనసేన టీడీపీ నేతలు గట్టిగా కోరుకుంటున్నారు.

One Reply to “సీఎం రమేష్ వైఖరితో కూటమిలో అసంతృప్తి”

Comments are closed.