రాయలసీమకు 96 వసంతాలు

రాయలసీమ ప్రాంతం ఆది నుంచి అనాథ కాదుకాదు. 1800కి ముందు, తర్వాత నైజాం ఆధీనంలోకి వెళ్లిన‌ నాటి నిజాం, ఆంగ్లేయుల పాలన, పాలెగాళ్ల వ్యవస్థ‌తోనే రాయలసీమ కరవు సీమగా మారింది. అంతకు ముందు విజయనగర…

రాయలసీమ ప్రాంతం ఆది నుంచి అనాథ కాదుకాదు. 1800కి ముందు, తర్వాత నైజాం ఆధీనంలోకి వెళ్లిన‌ నాటి నిజాం, ఆంగ్లేయుల పాలన, పాలెగాళ్ల వ్యవస్థ‌తోనే రాయలసీమ కరవు సీమగా మారింది. అంతకు ముందు విజయనగర రాజుల కాలంలో రతనాలసీమగా విరాజిల్లింది. తమ అవసరాల కోసం నిజాం సీమ ప్రజల అభిమతంతో సంబంధం లేకుండా ఆంగ్లేయులకు వదిలిపెట్టారు. అలా సీడెడ్ ప్రాంతంగా, దత్తమండలాలుగా పిలవబడ్డ సీమకు రాయలసీమ అని 1928 నవంబర్ 18న నామ‌క‌ర‌ణం జ‌రిగింది. అలా సీమ రాయలసీమగా ఆత్మగౌరవంతో నిలబడింది.

చరిత్రలోకి వెళితే…

1800 కి పూర్వం రాయలసీమ ప్రాంతం రతనాలసీమ. రాక్షసి తంగడి యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పతనం కావడంతో బలమైన రాజులు లేని పరిస్థితుల్లో వరుస దాడులు కారణంగా నైజాం నవాబు పాలనలోకి సీమ ప్రాంతం నెట్టబడింది. మరాఠ వారితో యుద్ధ భ‌యంతో ఉన్న నిజాం ఆంగ్లేయులతో సైనిక సహకార ఒప్పందం చేసుకున్నాడు. అందుకు ఆంగ్లేయులకు తగిన పరిహారం ఇవ్వలేని స్థితిలో నిజాం సీమ ప్రాంతాన్ని ఆంగ్లేయులకు వదిలేశాడు. ఆ మొత్తం వ్యవహారంలో సీమ ప్రజల మనోభావాలను లెక్కలోకి తీసుకోలేదు. అలా నిజాం నవాబు నుంచి ఆంగ్లేయుల చేతిలోకి వెళ్ళింది.

అప్పటికే పాలెగాళ్లు ఏలుబడిలో ఉన్న సీమ ప్రాంతంలో ప్రారంభంలో ఆంగ్లేయులకు పాలెగాళ్ల నుంచి ప్రతిఘటన ఎదురైంది. బలమైన సైనిక సామర్థ్యం ఉన్న ఆంగ్లేయుల ముందు బలహీనమైన సీమపాలెగాళ్లు నిలువలేకపోయారు.

ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించడం ద్వారా సీమ పాలెగాళ్లు తొలి స్వతంత్య ఉద్యమాన్ని నిర్వహించి చరిత్రలో నిలిచారు. అందులో ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి అగ్రగణ్యుడు. ఉత్తరాదిన జరిగిన సిపాయిల తిరుగుబాటుకు మునుపే మన సీమలో ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని ప్రశ్నించారు ఉయ్యాలవాడ. తొలి స్వాతంత్ర్య పోరాటం చేసిన ఘనత మన సీమదే. కాని ఈ నాటికి చరిత్రలో ఆ స్థానం మనకు ద‌క్క‌లేదు.

ఆంగ్లేయులకు నైజాం వదిలించుకున్న ప్రాంతం కావడం వలన దీన్ని సీడెడ్ ప్రాంతంగా పిల‌వ‌బ‌డింది. దీన్నే తెలుగు అర్థంలో దత్తమండలం అని పిలిచినా నిజానికి సీడెడ్ అన్న పదానికి దత్త మండలం అన్న అర్థం స‌రైందికాదు. వదిలి వేయించుకున్న ప్రాంతం అని అర్ధం. వదిలి వేయించుకున్న ప్రాంతం అనే దానికన్నా ఆంగ్లేయులు దత్తత తీసుకున్న ప్రాంతం అని పిలిస్తే సీమ ప్రజల మన్నన‌ల‌ను పొందవచ్చు అన్న ఉద్దేశం కావచ్చు అలా సీమ ప్రాంతం దత్తమండలాలుగా, సీడెడ్ ప్రాంతంగా పిలవబడింది.

నంద్యాల సభలో కీలక నిర్ణయం…….

1913 లో ప్రారంభ‌మైన ఆంధ్ర మ‌హాసభలు 1928, న‌వంబ‌ర్ 17,18 తేదీల్లో నంద్యాలలో జరిగాయి. రెండు రోజుల సభలలో ఒక రోజు కచ్చితంగా దత్తమండలం సమస్యలపై సమావేశంలో చర్చించే అవకాశం ఇస్తేనే తాము సహకరిస్తామన్న ఈ ప్రాంతనేతల వత్తిడి మేరకు 18న కడప కోటిరెడ్డి అద్యక్షతన ప్రథ‌మ దత్తమండలం సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్న చిలుకూరి నారాయణరావు ( అనంతపురం కాలేజి అధ్యాపకులు శ్రీకాకుళం నివాసి) గొప్ప చరిత్ర కలిగిన ఈ ప్రాంతానికి దత్త ప్రాంతం అన్న పేరు బాగుండదని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. రాయలసీమ అన్న పేరు ఉంటే బాగుంటుందని ఆయ‌న‌ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను పప్పూరి రామాచార్యులు బలపరచడంతో సభ ఏకగ్రీవంగా రాయలసీమ అనే పేరును ఆమోదించడంతో నాటి నుంచి రాయలసీమగా మారింది.

మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, సమన్వయ కర్త, రాయలసీమ మేధావుల ఫోరం

5 Replies to “రాయలసీమకు 96 వసంతాలు”

    1. కాటన్ మహాశయులు లేకుంటే గోదావరికి చరిత్రే లేదు, సోదరా greatandra Reddy గారు

Comments are closed.